హోంగార్డుల జీవితాల్లో వెలుగు

28 Mar, 2017 03:27 IST|Sakshi
హోంగార్డుల జీవితాల్లో వెలుగు

సీఎం ప్రకటనతో 19వేల కుటుంబాల్లో సంతోషం
రెగ్యులర్‌ ఉద్యోగాలిస్తామన్న ముఖ్యమంత్రి
పలు ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం


సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో పనిచేస్తున్న హోంగార్డుల్లో నూతన ఉత్తేజం కనిపిస్తోంది. ఏళ్లపాటుగా చాలీచాలని జీతాలతో కష్టాలు పడుతున్న హోంగార్డుల కుటుంబాల్లో ముఖ్యమంత్రి ప్రకటన సంతోషం నింపింది. హోంగార్డులను రెగ్యులర్‌ ఉద్యోగులుగా గుర్తిస్తామని సోమవారం అసెంబ్లీలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. దీంతో కొన్ని నెలల నుంచి జరుగుతున్న హోంగార్డుల పోరాటం ఫలించినట్టు కనిపిస్తోంది.

రాష్ట్రవ్యాప్తంగా 19వేల మంది హోంగార్డులు పోలీస్‌ శాఖలోని 14 విభాగాల్లో పనిచేస్తున్నారు. వీరందరినీ రెగ్యులరైజ్‌ చేయడంతోపాటు జీతభత్యాల పెంపు విషయంలోనూ ప్రభుత్వం పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలే పోలీస్‌ శాఖ పలు ప్రతిపాదనలను ప్రభుత్వానికి పంపించింది. బేసిక్‌ రూ.13 వేలు, డీఏ రూ.2384, హెచ్‌ఆర్‌ఏ రూ.3900, సీసీఏ 600, మొత్తంగా రూ.19,884 జీతం వచ్చేలా చర్యలు చేపట్టాలని డీజీపీ అనురాగ్‌ శర్మ జనవరిలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ప్రస్తుతం ఉన్న 19201 మంది హోంగార్డులను స్పెషల్‌ పోలీస్‌ అసిస్టెంట్లుగా గుర్తించి రెగ్యులర్‌ ఉద్యోగులుగా మార్చాలని ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనపై సీఎం కేసీఆర్‌ రెండుసార్లు ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. మిగతా రాష్ట్రాల్లో ఉన్న దానికంటే మరింత మెరుగ్గా ఉండేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆవిర్భావం నాటికి హోంగార్డుల జీతం రూ.6వేలు ఉండగా,  ప్రస్తుతం రూ.12వేల జీతభత్యాలను అందుకుంటున్నారు.

ప్రసూతి సెలవులు, ఆరోగ్య భద్రత...
హోంగార్డులను రెగ్యులర్‌ చేసేందుకు ఎదురవుతున్న న్యాయ సమస్యలపై ప్రభుత్వం కసరత్తుచేస్తోం దని ఉన్నతాధికారులు తెలిపారు. ఇప్పటికే పోలీస్‌ శాఖలో జరిగే నియామకాల్లో హోంగార్డులకు 5శాతం రిజర్వేషన్‌ అమల్లో ఉంది. ఈ రిజర్వేషన్‌ను మరో 5శాతం పెంచాలన్న ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. అదే విధంగా మహిళలకు జీతభత్యాలతో కూడిన ప్రసూతి సెలవులు, హోంగార్డులందరికీ ఆరోగ్య భద్రత స్కీం అమలుచేసేందుకు కూడా పోలీస్‌ ఉన్నతాధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. 

మరిన్ని వార్తలు