పట్టణాల్లో ప్రక్షాళన!

26 Jan, 2018 01:30 IST|Sakshi

అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశం

నగరాలు, పట్టణాల్లో అన్ని భూములకు సరైన లెక్కలుండాలి

సర్వే నంబర్ల తరహాలో ప్రైవేటు ఆస్తులకు నంబర్లు 

ప్రతి అంగుళం భూమి యజమాని ఎవరో తేలాలి

మార్చి 5 నాటికే పాసు పుస్తకాలు గ్రామాలకు.. 

పాస్‌ బుక్కులు, పహాణీలు, భూ రికార్డుల ప్రక్షాళనపై ప్రగతి భవన్‌లో సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అన్ని రకాల భూములకు సరైన లెక్కలుండాలని, ప్రతీ అంగుళం భూమికి ఎవరు యజమానో తేల్చాలని అధికారులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. భూ రికార్డుల ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూముల వివరాల నిగ్గు తేలిందని, ఇదే తరహాలో పట్టణాలు, నగర ప్రాంతాల్లో కూడా భూముల వివరాలు తేల్చాలని స్పష్టం చేశారు. మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా కొత్త పాస్‌ పుస్తకాల పంపిణీ చేపట్టాలని నిర్ణయించినందున, ఆ నెల 5వ తేదీకల్లా పాస్‌ పుస్తకాలు జిల్లాలకు చేరేలా కార్యాచరణ రూపొందిం చుకోవాలని సూచించారు. 

కొత్త పాస్‌ పుస్తకాలు, పహాణీలు, భూ రికార్డుల ప్రక్షాళన, ధరణి నిర్వహణ తదితర అంశాలపై గురువారం ప్రగతి భవన్‌లో సీఎం సమీక్షించారు. ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ముఖ్య కార్యదర్శులు నర్సింగ్‌రావు, శాంతాకుమారి, రెవెన్యూ ముఖ్య కార్యదర్శి రాజేశ్వర్‌ తివారీ, ల్యాండ్‌ రికార్డుల విభాగం డైరెక్టర్‌ వాకాటి కరుణ, మీ సేవ కమిషనర్‌ వెంకటేశ్వర్‌రావు, రంగారెడ్డి కలెక్టర్‌ రఘునందన్‌ రావు, మేడ్చల్‌ కలెక్టర్‌ ఎంవీ రెడ్డి, ఎమ్మెల్యే ఆలం వెంకటేశ్వర్లు, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, ఎండీసీ చైర్మన్‌ శేరి సుభాష్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రైవేటు ఆస్తులకు ప్రత్యేక నంబర్లు
‘భూ రికార్డుల ప్రక్షాళన గొప్ప విజయం సాధించింది. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ అంగుళం భూమి లెక్క తేలింది. 93 శాతం భూముల విషయంలో స్పష్టత వచ్చింది. కోర్టు కేసులు, ఇతర వివాదాల్లో ఉన్న భూములకు సంబంధించి పార్ట్‌–బిలో నిర్ణయం జరుగుతుంది. ఈ ప్రక్షాళనతో గ్రామీణ ప్రాంతాల్లో భూ వివాదాలు తగ్గిపోతాయని భావిస్తున్నాం. పట్టణాలు, నగరాల్లో కూడా ఈ వాతావరణం రావాలి. ఇందుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేయాలి. ప్రైవేటు ఆస్తులకు కూడా సర్వే నంబర్ల తరహాలో ప్రత్యేక నంబర్లు కేటాయించే విధానం తీసుకొచ్చే అంశాన్ని పరిశీలించాలి. తెలంగాణ భూ భాగంలోని ప్రతీ అంగుళం భూమి ఎవరి ఆధీనంలో ఉంది, అందులో ఎలాంటి కార్యకలాపాలు జరగుతున్నాయి.. తదితర వివరాలన్నీ ప్రభుత్వం వద్ద ఉండాలి’అని సీఎం అధికారులకు సూచించారు. భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా రికార్డులన్నీ ప్రక్షాళన చేయడంతోపాటు వాటిని పారదర్శకంగా నిర్వహించాలని ఆదేశించారు.

పాస్‌ పుస్తకంపై రైతు ఫొటో, ప్రత్యేక నంబర్‌
‘పాస్‌ పుస్తకాలు, పహాణీల్లో ప్రస్తుతం 31 కాలమ్స్‌ ఉన్నాయి. కాలక్రమేణా వచ్చిన మార్పుల వల్ల చాలా కాలమ్స్‌ అవసరం లేదు. ప్రభుత్వం భూమి శిస్తు వసూలు చేసిన కాలంలో కొన్ని కాలమ్స్‌ అవసరం ఉండేది. ఇప్పుడు ఇవన్నీ ఉండటం వల్ల అనవసర గందరగోళం ఏర్పడుతుంది. రైతుల వద్ద ఉండే పాస్‌ పుస్తకాలు, పహాణీల్లో అన్ని వివరాలు అవసరం లేదు. అత్యవసరం అనుకున్న వివరాలుంటే చాలు. రైతు పేరు, ఖాతా నంబరు, సర్వే నంబరు, విస్తీర్ణం, భూమి పొందిన విధానం వంటి కొన్ని ముఖ్యమైన కాలమ్స్‌ ఉంటే సరిపోతుంది. పాస్‌ పుస్తకాల్లో, పహాణీల్లో పరభాషా పదాలు చాలా వాడుతున్నారు.

అవి రైతులకు అర్థం కావు. కాబట్టి మన రైతులు వాడే పదాలనే పాస్‌ పుస్తకాలు, పహాణీల్లో వాడాలి. ఈ మార్పులతో కొత్త పాస్‌ పుస్తకాలు, పహాణీలు తయారు కావాలి’’అని సీఎం సూచించారు. ఈ మేరకు ఏ కాలమ్స్‌ ఉంచాలి, ఏ కాలమ్స్‌ తీసేయాలనే దానిపై విస్తృత చర్చ జరిపి నిర్ణయం తీసుకున్నారు. అందుకు అనుగుణంగానే కొత్త పాస్‌ పుస్తకాలు, పహాణీలు పంపిణీ చేయాలని, పాస్‌ పుస్తకంపైన ఖచ్చితంగా రైతు ఫోటో ఉంచాలని, ప్రతీ పాస్‌ పుస్తకానికి ప్రత్యేక నంబరు కేటాయించాలని నిర్ణయించారు. 
 

మరిన్ని వార్తలు