అర్బన్‌ పాలసీ అదరాలి

8 Jul, 2019 01:41 IST|Sakshi

ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి, పారదర్శక పాలనే లక్ష్యం

ఆ మేరకు కొత్త పాలసీలను రూపొందించాలని కేసీఆర్‌ దిశానిర్దేశం

అర్బన్‌ పాలసీలో భాగంగా కొత్త మున్సిపల్, జీహెచ్‌ఎంసీ చట్టాలు

కొత్తగా రూరల్, రెవెన్యూ పాలసీల రూపకల్పన కూడా..

3 రోజుల్లో ముసాయిదా.. అధికారులకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

చట్టాల ప్రకారమే అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యతలు

 గ్రామాల అభివృద్ధికి ఐదేళ్లలో రూ. 35 వేల కోట్ల కేటాయింపు

నూతన అర్బన్‌ పాలసీపై ముఖ్యమంత్రి ఉన్నతస్థాయి సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలో అవినీతికి ఆస్కారం లేనివిధంగా ప్రజలకు పారదర్శకమైన సేవలు, ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరిగేలా తెలంగాణ నూతన అర్బన్‌ పాలసీని రూపొందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. అర్బన్‌ పాలసీతోపాటు కొత్త రూరల్‌ పాలసీ, కొత్త రెవెన్యూ పాలసీలను కూడా రూపొందించాలన్నారు. నూతన అర్బన్‌ పాలసీలో భాగంగా నూతన మున్సిపల్‌ చట్టం, నూతన కార్పొరేషన్ల చట్టం, నూతన హైదరాబాద్‌ నగర కార్పొరేషన్‌ చట్టం తీసుకురావాలని, హెచ్‌ఎండబ్ల్యూఏతోపాటు ఇతర నగరాల అభివృద్ధి సంస్థల పాలనకు సంబంధించి కూడా కొత్త చట్టం రూపొందించాలని సూచించారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ చట్టాల ముసాయిదా తయారు చేయాలన్న కేసీఆర్‌... త్వరలోనే అసెంబ్లీని సమావేశపరిచి కొత్త చట్టాలు తెస్తామని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర నూతన అర్బన్‌ పాలసీ రూపకల్పనపై సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

పచ్చదనం, పరిశుభ్రత వెల్లివిరిసేలా... 
అవినీతికి ఏమాత్రం ఆస్కారం కలిగించని విధంగా, అక్రమ కట్టడాలకు ఏమాత్రం వీలులేని విధంగా, పచ్చదనం–పరిశుభ్రత వెల్లివిరిసేలా నగరాలు, పట్టణాలను తీర్చిదిద్దడానికి ఉపయోగపడే కొత్త చట్టాలు ఉండాలని సీఎం కేసీఆర్‌ నిర్దేశించారు. ఈ చట్టాల ప్రకారమే నగర పాలన జరిగేలా అధికారులు, ప్రజాప్రతినిధులకు బాధ్యత అప్పగించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. బాధ్యతలను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అధికారం కూడా చట్టమే కల్పిస్తుందని స్పష్టం చేశారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పరిస్థితిని చక్కదిద్దే బృహత్తర ప్రయత్నంలో కలెక్టర్లు క్రియాశీల బాధ్యత పోషించేలా చట్టంలో నిబంధనలు పెడతామని చెప్పారు. ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులు ఖర్చు చేయకుండా ఆయా నగరాలు, పట్టణాల ప్రాధాన్యతలు, సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారం కోసమే నిధులు వెచ్చించాలన్నారు. మున్సిపాలిటీలకు ఆదాయం రావాలని, వచ్చిన ఆదాయం సద్వినియోగం కావాలని చెప్పారు. రాష్ట్రంలో పద్ధతి ప్రకారం నగర–పట్టణ పాలన సాగేందుకు నూతన పాలసీ, కొత్త చట్టాలు ఉపయోగపడాలని పేర్కొన్నారు. ‘‘తెలంగాణ ఏర్పడిన వెంటనే రాష్ట్ర ప్రాధాన్యతలను గుర్తించాం. సంక్షేమ రంగానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాం. విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించుకున్నాం. మంచినీటి సమస్యను తీర్చుకున్నాం. సాగునీటి కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. పారిశ్రామికాభివృద్ధి కోసం టీఎస్‌ ఐపాస్‌ చట్టం చేసుకున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మరో మెట్టు ఎక్కాలి. దీనికోసం మంచి విధానాలు రావాలి. కొత్తగా పంచాయతీరాజ్‌ చట్టం చేసుకున్నాం. ఇదే విధంగా రెవెన్యూ, మున్సిపల్‌ చట్టాలు కూడా రావాలి. పరిపాలన పారదర్శకంగా, వేగంగా, అవినీతికి ఆస్కారంలేని విధంగా సాగాలి’’అని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు.

రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ సమ్మేళనాలు... 
తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్మన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలని కేసీఆర్‌ పిలుపునిచ్చారు. కొత్త పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కల్పించడంతోపాటు గ్రామాల వికాసానికి, ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించడానికి త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీరాజ్‌ సమ్మేళనాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని నాలుగు చోట్ల సమ్మేళనాలు నిర్వహిస్తామని, సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జడ్పీ చైర్‌పర్సన్లతోపాటు పంచాయతీ కార్యదర్శులు, ఈఓపీఆర్డీలు, ఎంపీడీవోలు, డీఎల్పీవోలు, సీఈఓలను ఈ సమ్మేళనాలకు ఆహ్వానిస్తామని చెప్పారు. జిల్లా పరిషత్తులను, గ్రామీణ స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. గ్రామాల అభివృద్ధికి ఏటా దాదాపు రూ. 7 వేల కోట్లను, ఐదేళ్లలో రూ. 35 వేల కోట్లను ఖర్చు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ నిధులను సమర్థంగా వినియోగించుకొనే విధంగా స్థానిక సంస్థలు తయారు కావాలని చెప్పారు.

గ్రామాలు పచ్చగా, పరిశుభ్రంగా తయారు కావడానికి అధికారులు, ప్రజాప్రతినిధులు ఎలాంటి బాధ్యతలు నిర్వహించాలనే విషయంపైనా సమ్మేళనాల్లో చర్చించనున్నట్లు కేసీఆర్‌ తెలిపారు. సమ్మేళనాల తరువాత అధికారులతో కూడిన 100 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌లను ఏర్పాటు చేస్తామని, అవి గ్రామాల్లో ఆకస్మిక తనిఖీలు జరుపుతాయన్నారు. పచ్చదనం, పరిశుభ్రత విషయంలో అలసత్వం ప్రదర్శించినట్లు, విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు తేలితే వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో మూడు నెలల్లో మార్పు కనిపించాలన్నారు. గ్రామాల్లో చేపట్టాల్సిన కార్యక్రమాలను కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, ఇందుకోసం త్వరలోనే హైదరాబాద్‌లో కలెక్టర్లకు అవగాహన సదస్సు నిర్వహించాలని ఉన్నతాధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌.కె. జోషి, ముఖ్య కార్యదర్శి ఎస్‌.నర్సింగ్‌రావు, మున్సిపల్‌శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, పురపాలకశాఖ డైరెక్టర్‌ శ్రీదేవి, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావు, కామారెడ్డి కలెక్టర్‌ సత్యనారాయణ, సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

తెలంగాణ పల్లెలు పచ్చదనంతో, పరిశుభ్రతతో కళకళలాడాలి. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్‌ చైర్‌ పర్సన్లు గ్రామాల వికాసానికి పూనుకోవాలి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు