నగదు ర‘హితం’

29 Nov, 2016 04:08 IST|Sakshi
నగదు ర‘హితం’

క్యాష్‌లెస్‌ లావాదేవీలే పరిష్కారం: కేసీఆర్‌
మొబైల్‌ యాప్‌లు, స్వైప్‌ మిషన్లు, ఆన్‌లైన్‌ చెల్లింపులకు పెద్దపీట
బ్యాంకు లావాదేవీలను ప్రోత్సహించేందుకు చర్యలు
రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు
ఢిల్లీతో సంప్రదింపులకు అనుసంధాన కమిటీ
నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా మార్చేందుకు పూర్తి మద్దతిస్తాం
నోట్ల రద్దు.. ఓ పెద్ద సంస్కరణ.. కానీ అంతటితో ఆగిపోవద్దు
వివిధ రూపాల్లోని నల్ల డబ్బు.. నల్ల జబ్బును వదిలించాలని వ్యాఖ్య


సాక్షి, హైదరాబాద్‌
నల్లధనం లేని, అవినీతి రహిత దేశంగా భారత్‌ను మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం సంపూర్ణంగా మద్దతిస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. పెద్ద నోట్ల రద్దుతోనే ఆగిపోవద్దని, వివిధ రూపాల్లో విస్తరించిన నల్లధనానికి సమూలంగా అడ్డుకట్ట వేయాలని ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశారు. ‘‘నోట్ల రద్దు చర్యను గుడ్డిగా వ్యతిరేకించాల్సిన పనిలేదు. మద్దతివ్వాల్సిన పని లేదు. ఇదో పెద్ద సంస్కరణగా గుర్తించాలి. నగదు రహిత లావాదేవీలతో భవిష్యత్తులో ప్రజలకు మేలు జరుగుతుంది. ఈ వ్యూహాన్ని అర్థం చేసుకునేందుకు సమయం పడుతుంది’’ అని పేర్కొన్నారు. ఆస్తులు, అంతస్తులు, భూములు, వజ్రాలు, బంగారం, వెండి, షేర్‌ మార్కెట్, హవాలా, విదేశీ మారకద్రవ్యం, విదేశాల్లో హవాలా సొమ్ము.. రూపంలో ఉన్న నల్లధనాన్ని అరికట్టేందుకు చర్యలు చేపడితే తమ ప్రభుత్వం తరఫున కేంద్రానికి సంపూర్ణ మద్దతుంటుందని వెల్లడించారు. ‘‘ఎవరు ఎవరినీ లంచం అడగొద్దు.. ఎవరు ఎవరికి లంచం ఇవ్వొద్దు.. అలాంటి రోజులు రావాలి. అంతకు మించిన సంస్కరణ ఇంకేం కావాలి.

మళ్లీ కొందరు నల్లదొంగలు బతికి ఉండకూడదు. అన్ని రకాల నల్లడబ్బు.. నల్ల జబ్బును వదిలిస్తేనే ఈ నిర్ణయం సఫలమవు తుంది. లేదంటే విఫల ప్రయోగంగా మిగిలి పోతుంది. ఇది స్వాగతించదగ్గ పరిణామం. దీనికి వంద శాతం మద్దతిస్తాం. ఇదే విషయాన్ని ప్రధానితో చెప్పాను’’ అని సీఎం అన్నారు. నోట్ల రద్దు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలను చర్చించేందుకు రాష్ట్ర మంత్రివర్గం సోమవారం సచివాలయంలో ప్రత్యేకంగా సమావేశమైంది. నాలుగు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించింది. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ పెద్దనోట్లను రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని తప్పుగా అర్థం చేసుకోవడానికి వీల్లేదన్నారు.

ప్రజలను చైతన్యపరచాలి
ఇటీవల ఢిల్లీకి వెళ్లి ప్రధానితో దాదాపు గంటసేపు జరిగిన భేటీలో నోట్ల రద్దుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులనే చర్చించానని, పలు పరిష్కారాలను సూచించినట్లు సీఎం చెప్పారు. తర్వాత రాష్ట్రానికి వచ్చిన ప్రధానితోనూ రెండుసార్లు మాట్లాడానని, ప్రధాని కార్యాలయానికి పలు సిఫారసులను పంపించినట్లు వివరించారు. పెద్దనోట్ల రద్దు నిర్ణయంలో కానీ.. అమలులో కానీ రాష్ట్రాల పాత్ర లేదన్నారు. కానీ నిర్ణయం అమలులో ప్రజలు పడుతున్న ఇబ్బందులను పట్టించుకోకుండా ప్రేక్షక పాత్ర పోషించటం సరైంది కాదన్నారు. ‘‘పరిస్థితులకు అనుగుణంగా ప్రజలను చైతన్యపరచాల్సి ఉంది. ప్రజల్లో అవగాహన కల్పించి నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే చర్యలు చేపట్టాల్సి ఉంది. అందుకే రాష్ట్ర మంత్రివర్గంలో ఇదే అంశాన్ని సుదీర్ఘంగా చర్చించాం.

దేశంలో 25 కోట్ల బ్యాంకు ఖాతాలుంటే.. రాష్ట్రంలో 82 లక్షల ఖాతాలున్నాయి. ఉపాధి హామీ చెల్లింపులు కూడా బ్యాంకులు, పోస్టాఫీసుల ద్వారా జరుగుతున్నాయి. కానీ మన దేశంలో నగదుతో కూడిన ఆర్థిక వ్యవస్థ నడుస్తోంది. కూరగాయలు, పండ్లు మొదలు నిత్యావసరాలన్నీ చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు చేయటం కనిపించదు. రూ.140 లక్షల కోట్లు ఉన్న దేశ ఆదాయంలో 12 శాతమే నగదు లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ మిగతా 88 శాతంపై దీని ప్రభావం ఉంటుంది. అందుకే తాత్కాలికంగా అన్ని రాష్ట్రాల ఆదాయం పడిపోతుంది’’ అని సీఎం వివరించారు.

నగదు రహిత లావాదేవీలకు టాస్క్‌ఫోర్స్‌
నోట్ల రద్దు నేపథ్యంలో రాష్ట్రం ఆర్థిక వ్యవస్థ సాఫీగా ముందుకు సాగాలంటే.. రాష్ట్ర జీవిక కొనసాగాలంటే నగదు రహిత లావాదేవీలే పరిష్కారమని సీఎం స్పష్టంచేశారు. లేకుంటే కొనుగోళ్లు, అమ్మకాల వ్యవస్థ అచేతనంగా మారిపోయే పరిస్థితి ఉందన్నారు. ‘‘ప్రజల అవసరాలు తీర్చటంతో పాటు కొనుగోళ్లు, అమ్మకాలతో వ్యాపారాలు నిలబడాలంటే  మొబైల్‌ యాప్, స్వైపింగ్‌ మిషన్లు, చెక్కులు, ఆన్‌లైన్‌ ద్వారా చెల్లింపులు జరగాలి. అన్నీ బ్యాంకు ఆధారిత లావాదేవీలు జరిగేలా చూడటం తప్ప గత్యంతరం లేదు. రాష్ట్రానికి తగిన ఆదాయం రావాలంటే కూడా ఇదొక్కటే పరిష్కారం. బ్యాంకు లావాదేవీలు పెంచుకున్న రాష్ట్రం దేశంలో ముందుకుపోయే ఆస్కారముంటుంది. ఈ క్రమంలో ఎదురయ్యే సమస్యల్ని అధిగమించేందుకు రాష్ట్రస్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేశాం. ముఖ్య కార్యదర్శి సురేశ్‌చందా సారథ్యంలో జయేశ్‌రంజన్, నవీన్‌మిట్టల్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ రఘునందన్, సూర్యాపేట కలెక్టర్‌ సురేంద్రమోహన్, సీఏంవో నుంచి శాంతికుమారి సభ్యులుగా నియమించాం. రిజిస్ట్రేషన్, ఎక్సైజ్‌ ఫీజులన్నీ నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా, వ్యాట్‌ డీలర్ల నుంచి పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ దగ్గర స్వైపింగ్‌ మిషన్లు, రైతులకు చేసే చెల్లింపులన్నీ బ్యాంకుల ద్వారా జరిగేలా చూడటం, రేషన్‌ షాపులు, మిల్క్‌ ఫెడరేషన్లు, సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లన్నింటా నగదు రహిత చెల్లింపులకు ఈ కమిటీ సిఫారసులు చేస్తుంది. నోట్ల రద్దు తదనంతర పరిణామాలతో ఢిల్లీతో సంప్రదింపులు జరిపేందుకు, రాష్ట్ర పరిస్థితులను నివేదించేందుకు నలుగురు అధికారులతో అనుసంధాన కమిటీని నియమిస్తాం’’ అని సీఎం వివరించారు.

ఐదారు రోజుల్లో  కలెక్టర్లతో భేటీ
అయిదారు రోజుల్లో జిల్లా కలెక్టర్లతో సదస్సు నిర్వహించి జిల్లాస్థాయి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు, అక్కడ చేపట్టాల్సిన చర్యలను చర్చిస్తామని సీఎం వెల్లడించారు. ఖాతాలున్న వారందరూ బ్యాంకుల ద్వారా లావాదేవీలు నిర్వహించేలా చూడటం, లేని వారిని ఖాతాలు తెరిపించేందుకు ప్రోత్సహిస్తామన్నారు. బ్యాంకింగ్‌ వ్యవస్థను విస్తరించాలని, మూడు, నాలుగు గ్రామాలకు ఒక బ్యాంకు ఉండాలని, వెయ్యి మంది జనాభా ఉన్న గ్రామాల్లో ఒక ఏటీఎం ఉండేలా చూడాలని కేంద్రాన్ని కోరినట్లు చెప్పారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14.5 లక్షల స్వైపింగ్‌ యంత్రాలుంటే రాష్ట్రంలో 85 వేల నుంచి లక్ష స్వైపింగ్‌ మిషన్లు ఉన్నాయన్నారు. దేశవ్యాప్తంగా నగదు రహిత లావాదేవీలు జరగాలంటే పది కోట్ల యంత్రాలు అవసరమవుతాయన్నారు. అందుకే రెండు వ్యూహాలపై దృష్టి సారిస్తామని, స్వైపింగ్‌ యంత్రాలను సమకూర్చుకోవటంతో పాటు మొబైల్‌ యాప్‌ల ద్వారా చెల్లింపులను ప్రోత్సహిస్తామని వివరించారు.

‘డబుల్‌’ ఇళ్లతో ఉపాధి కల్పిస్తాం
నోట్ల రద్దు నిర్ణయం స్థిరాస్తి రంగంపై తీవ్ర ప్రభావం చూపిందని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హైదరాబాద్‌లో దాదాపు పది లక్షల మంది నిర్మాణ రంగంపై ఆధారపడ్డ శ్రామికులు ఉన్నారని, వారిలో ఎక్కువ మంది పని కోల్పోయే ప్రమాదముందని చెప్పారు. అందుకే జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణాన్ని శరవేగంగా చేపట్టాలని మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. దానివల్ల ఈ రంగంలో ఉన్న కార్మికులకు ఉపాధి దొరకడంతోపాటు పేదలకు రెండు పడక గదుల ఇళ్ల కల నెరవేరుతుందన్నారు.

త్వరలో టీఎస్‌ వ్యాలెట్‌
రాష్ట్రంలో నగదు రహిత లావాదేవీలను పెంచేందుకు టీఎస్‌ వ్యాలెట్‌ పేరుతో మొబైల్‌ యాప్‌ను త్వరలోనే ఆవిష్కరిస్తామని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఐటీ శాఖ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తోందని తెలిపారు. నగదు రహిత లావాదేవీలపై ఎక్కువ చార్జీలు పడకుండా మర్చంట్‌ డిస్కౌంట్‌ రేట్‌ను ఎత్తివేయాలని ఇటీవలే ప్రధానిని కోరామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర మనుగడ కీలకమని, మీడియా ప్రజలకు సహాయ సహకారిగా నిలబడాలని పేర్కొన్నారు.

సిద్దిపేటలో పైలెట్‌ ప్రాజెక్టు
నగదు రహిత లావాదేవీలను సిద్దిపేట అసెంబ్లీ నియోజకవర్గంలో పైలెట్‌ ప్రాజెక్టుగా అమలు చేయాలని నిర్ణయించినట్లు సీఎం తెలిపారు. ‘‘మున్సిపాలిటీతో పాటు మూడు మండలాల్లోని ప్రజలకు రూ.500 వరకు నగదుకు అవకాశమిచ్చి.. మిగతా లావాదేవీలన్నీ నగదు రహితంగా చేసే అవకాశం కల్పిస్తాం. బ్యాంకులు చెప్పినంత వేగంగా సహకరిస్తే నెలన్నర రోజుల్లోనే ఈ ప్రాజెక్టు అమలవుతుంది. అక్కడ ఎదురైన అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ముందుకెళుతాం. గుజరాత్‌ రాష్ట్రంలో అకోదర గ్రామంలో నగదు రహిత విధానం ఎప్పట్నుంచో అమల్లో ఉంది. అదే స్ఫూర్తిగా ఈ విధానం అమలు చేస్తాం..’’ అని సీఎం వివరించారు.

మరిన్ని రూ.5 భోజన కౌంటర్లు
ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో నిరుపేదల ఆకలి తీర్చేందుకు అమల్లో ఉన్న రూ.5 భోజనం అందించే కౌంటర్లను 150కి పెంచాలని కేబినెట్‌ నిర్ణయించింది. ప్రస్తుతం 50 కౌంటర్ల ద్వారా రోజుకు 15 వేల మందికి భోజనం అందిస్తున్నారు. వీటిని పెంచి 45 వేల మందికి భోజనం అందించనున్నారు.

మరిన్ని వార్తలు