ఆర్టీసీని ఎలా బాగుచేద్దాం!

10 Jun, 2016 02:01 IST|Sakshi
ఆర్టీసీని ఎలా బాగుచేద్దాం!

పూర్తిస్థాయిలో సమీక్షించి నిర్ణయిద్దాం
రవాణా మంత్రి, ఆర్టీసీ చైర్మన్‌లకు సీఎం ఫోన్

 సాక్షి, హైదరాబాద్:ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవటంతో అస్తవ్యస్తంగా తయారైన రోడ్డు రవాణా సంస్థపై ఎట్టకేలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు దృష్టి సారించారు. జేఎండీ నుంచి డిపో మేనేజర్ స్థాయి వరకు సమీక్షించాలని నిర్ణయించారు. ఈ మేరకు రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణలతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. ఇందుకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేయాలంటే తీసుకోవాల్సిన చర్యలపై కూలంకషంగా చర్చించనున్నట్టు తెలిపారు. ఆర్టీసీ నష్టాల్లో ఉండటానికి గల కారణాలను డిపోల వారీగా తనకు ముందస్తుగా లెక్కలు అందజేయాలని ఆయన పేర్కొన్నారు. డిపోల్లోని బస్సుల వివరాలను నివేదిక రూపంలో అందజేయాలని ఆదేశించారు. సమావేశం ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తానని చెప్పారు. అయితే వచ్చే సోమవారం సమావేశం ఉండే అవకాశం ఉందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు.

 గతంలో ఇలాగే చెప్పి...
గతేడాది వేతన సవరణ జరిగి 44 శాతం ఫిట్‌మెంట్ ప్రకటించిన రోజున స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు వివరాలు వెల్లడించారు. ఆర్టీసీ నష్టాల నివారణపై ఓ రోజు మొత్తం సమీక్ష నిర్వహిస్తానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత దాని ఊసే లేకుండా పోయింది. చండీ యాగానికి నెల ముందు మరోసారి సమీక్షవిషయాన్ని సీఎం ప్రస్తావించారు. ఏర్పాట్లు చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయటంలో వారు అన్నీ సిద్ధం చేశారు. కానీ సీఎం ఇప్పటి వరకు సమీక్ష తేదీ ప్రకటించలేదు.

సమీక్ష సంగతి దేవుడెరుగు కనీసం ఆర్టీసీని పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది. చరిత్రలో ఎన్నడూ లేనంత నష్టాలను మూటగట్టుకుంది. సిబ్బంది జీతాలకు కూడా డబ్బులు లేక దివాళా దిశగా సాగుతోంది. ఇలాంటి తరుణంలో సమీక్ష ఉంటుందని సీఎం ప్రకటించటంతో.. ఈసారైనా ఆర్టీసీని ‘బాగు’ చేయడానికి చర్యలు తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. సమావేశంలో తమకు కూడా భాగస్వామ్యం కల్పించాలని కోరాయి.

మరిన్ని వార్తలు