మహా సుదర్శన యాగం 

31 Jul, 2019 02:08 IST|Sakshi

యాదాద్రిలో త్వరలోనే ఘనంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయం

యాగం నిర్వహణపై త్రిదండి చినజీయర్‌ స్వామితో చర్చలు 

సాక్షి, హైదరాబాద్‌: త్వరలో యాదాద్రిలో మహా సుదర్శన యాగాన్ని నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. యాగం నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామితో ఆయన చర్చించారు. శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపం లోని శ్రీరామనగరంలో ఉన్న చినజీయర్‌ స్వామి ఆశ్రమాన్ని కేసీఆర్‌ మంగళవారం సందర్శించారు. స్వామి సీఎంను ఆశీర్వదించి జ్ఞాపికను, మంగళశాసనాలు అందజేశారు. ఈ సందర్భంగా యాగంపై ఇరువురూ చర్చించారు. వంద ఎకరాల యజ్ఞ వాటికలో 1048 యజ్ఞ కుండాలతో ఈ యాగంనిర్వహించాలని నిర్ణయించారు. 3వేల మంది రుత్విక్కులు, మరో 3వేల మంది సహాయకులతో మహా యాగాన్ని గొప్పగా నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నారు.

కేవలం భారతదేశంలోనివి మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వైష్ణవ పీఠాలతోపాటు బద్రీనాథ్, శ్రీరంగం, జగన్నాథ్, తిరుపతి వంటి మహాక్షేత్రాల నుంచి మతాధిపతులను, కేంద్ర ప్రభుత్వ పెద్దలను, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, మంత్రులను, అన్ని సంప్రదాయాలకు చెందిన మత గురువులను ఈ యాగానికి ఆహ్వానించనున్నారు. లక్షల సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున వారికి విస్తృతమైన ఏర్పాట్లు చేసే అంశంపైనా ఈ భేటీలో చర్చించారు. కేసీఆర్‌ వెంట ఎంపీ సంతోష్‌కుమార్, మై హోం గ్రూప్‌ అధినేతలు జూపల్లి రామేశ్వర్‌రావు, జూపల్లి జగపతిరావు ఉన్నారు. జీయర్‌స్వామితో సీఎం కొద్దిసేపు ఏకాంతంగా మాట్లాడారు. అనంతరం కేసీఆర్‌ జూపల్లి బాలమ్మ మెమోరియల్‌ గార్డెన్‌లోని రామేశ్వర్‌రావు ఫాంహౌజ్‌కు వెళ్లారు. సాయంత్రం వరకు అక్కడ ఉండి తిరుగు పయనమయ్యారు.

మరిన్ని వార్తలు