దేవాదులకు కాళేశ్వరం జలాలు

10 Nov, 2019 01:54 IST|Sakshi

మల్లన్నసాగర్‌ నుంచి దేవాదులలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు అనుసంధానికి సీఎం ఆదేశాలు

వచ్చే ఏడాదికి మల్లన్నసాగర్, సీతారామ ఎత్తిపోతల పూర్తికి సూచన

ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై సీఎం సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి నదీ జలాల వినియోగం విషయంలో మరో కొత్త ప్రతిపాదనను సీఎం కేసీఆర్‌ తెరపైకి తెచ్చారు. గోదావరి జలాల ఆధారంగా చేపట్టిన దేవాదుల ఎత్తిపోతల పథకంలో నీరందని చివరి ఆయకట్టు ప్రాంతాలకు కాళేశ్వరం ద్వారా ఎత్తిపోస్తున్న జలాలను తరలించేలా ప్రణాళిక సిద్ధం చేయాలని నీటిపారుదలశాఖ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ ద్వారా నీటిని దేవాదుల ఆయకట్టుకు తరలించే ప్రతిపాదనలను సిద్ధం చేయాలని సూచించారు. ప్రగతిభవన్‌లో శనివారం కాళేశ్వరం, దేవాదుల, సీతారామ ఎత్తిపోతల పథకంపై ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా దేవాదులను ఇన్టేక్‌ పాయింట్‌ గంగాపురానికి 187 కిలోమీటర్ల దూరంలోని తపాస్‌పల్లి రిజర్వాయర్‌ వరకు కాళేశ్వరం జలాలు తరలింపు, తపాస్‌పల్లి కింద ఉన్న 92వేల ఎకరాల ఆయకట్టుకు మల్లన్నసాగర్‌ నుంచి నీటిని తరలించేలా అధికారులు సిద్ధం చేసిన ప్రతిపాదనలపై ఈ సమావేశంలో చర్చించారు. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి పది కిలోమీటర్ల మేర గ్రావిటీ కెనాల్‌ నిర్మించి కనీసంగా 10 టీఎంసీల నీటిని తపాస్‌పల్లికి నీటిని అందించాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు సూచించారు. ఈ ప్రతిపాదనకు రూ.100 కోట్ల మేర ఖర్చు అవుతుందని, మల్లన్నసాగర్‌లో కనీసంగా 30 టీఎంసీల నీటి లభ్యత ఉంటేనే గ్రావిటీ ద్వారా నీటి లభ్యత సాధ్యపడుతుందని అధికారులు వివరించారు. ఇదే సందర్భంగా ఫ్రెషర్‌ మెయిన్‌ ద్వారా నీటిని తరలించేలా రెండో ప్రతిపాదనను అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు.

ఈ పద్ధతిన నీటిని తరలించేందుకు గరిష్టంగా రూ.350 కోట్ల నుంచి రూ.400 కోట్ల వరకు ఖర్చు జరిగే అవకాశం ఉంటుందని, మల్లన్నసాగర్‌లో 12 టీఎంసీల నీటి తరలింపు సాధ్యమవుతుందని తెలిపారు. ఈ రెండు ప్రతిపాదనలను ఏది ఉపయుక్తంగా ఉంటుందో తెలపాలని సీఎం సూచించారు. వచ్చే ఏడాది నవంబర్‌ నాటికి దేవాదుల మూడో దశను పూర్తి చేయాలని, మల్లన్నసాగర్‌ను వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేయాలని సూచించారు. సీతారామ ఎత్తిపోతల పథకం పనులను ప్యాకేజీ వారీగా సమీక్షించిన సీఎం..భూసేకరణ అంశాలపై రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని మార్గదర్శకం చేశారు. వచ్చే ఖరీఫ్‌ నాటికి సీతారామ ద్వారా గరిష్ట నీటి వినియోగం జరిగేలా చూడాలని చెప్పారు. దీంతో పాటు కాళేశ్వరం పనులపైనా సీఎం సమీక్షించారు.

మరిన్ని వార్తలు