ఎక్కడికక్కడే నీటి కట్టడి!

4 Jan, 2020 02:48 IST|Sakshi
శుక్రవారం ప్రగతి భవన్‌లో చిన్న నీటి వనరుల వినియోగంపై సమీక్ష నిర్వహిస్తున్న సీఎం కేసీఆర్‌

అన్ని వాగులపై ఈ ఏడాది సగం.. వచ్చే ఏడాది సగం చెక్‌డ్యామ్‌ల నిర్మాణం

చెక్‌డ్యామ్‌లు, చెరువుల కోసం ప్రత్యేక బడ్జెట్‌

సాగునీటి శాఖపై సమీక్షలో సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వాగులపై అవసరమైనన్ని చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలని సీఎం కె.చంద్రశేఖర్‌ రావు అధికారులను ఆదేశించారు. మొత్తం ఎన్ని చెక్‌ డ్యామ్‌లు అవసరమో గుర్తిం చి, అందులో సగం చెక్‌ డ్యాములను ఈ ఏడాది, మిగతా సగం వచ్చే ఏడాది నిర్మించాలని చెప్పా రు. మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణను ప్రతి ఏటా చేపట్టాలని ఆదేశిం చారు. చిన్న నీటి వనరుల వినియోగంపై సీఎం కేసీఆర్‌ శుక్రవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సమీక్షలో మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్సీలు శేరి సుభాశ్‌రెడ్డి, భానుప్రసాద్‌ రావు, సీఎం కార్యదర్శి స్మితా సభర్వాల్, ఈఎన్సీలు మురళీధర్‌ రావు, విజయ్‌ ప్రకాశ్, వెంకటేశ్వర్లు, సీఈలు వీరయ్య, హమీద్‌ ఖాన్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌ పాండే తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, ‘ప్రాజెక్టుల నిర్మాణంతో రాష్ట్రానికి సాగునీటి సమస్య తీరుతోంది. కాళేశ్వ రం, దేవాదుల, సీతారామ ప్రాజెక్టులతో గోదావరి నది నుంచి మన వాటా ప్రకారం పుష్కలంగా నీటిని తీసుకుంటాం. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి 500కు పైగా టీఎంసీల నీటిని తీసుకోవచ్చు. ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, లోయర్‌ మానేరు, ఎస్‌ఆర్‌ఎస్పీలతో పాటు కొత్తగా నిర్మిస్తున్న మల్లన్నసాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్‌ లాంటి రిజర్వాయర్లు నింపుకుంటాం. అన్ని చెరువులకు ప్రాజెక్టుల ద్వారా నీరిస్తాం. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో జలధార ఉంటుంది. పంటలు సంవృద్ధిగా పండుతాయి. పంటలకు నీళ్లిచ్చే క్రమంలో పడుబాటు నీళ్లు, వర్షం నీళ్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఈ నీళ్లు సహజంగా ఏర్పడిన వాగులు, వంకలు, డొంకల ద్వారా కిందికి వెళ్లిపోతాయి. ఈ నీళ్లను ఎక్కడికక్కడ ఆపడానికి విరివిగా చెక్‌ డ్యామ్‌లు నిర్మించాలి. ప్రస్తుతం రాష్ట్రంలో ఏ వాగుకు ఎన్ని చెక్‌ డ్యామ్‌లున్నాయి? కొత్తగా ఎన్ని మంజూరయ్యాయి? ఇంకా ఎన్ని మంజూరు చేయాలి? అనే లెక్కలు తీయాలి. అవసరమైనన్ని చెక్‌ డ్యామ్‌లను గుర్తించిన తర్వాత వాటిలో సగం ఈ ఏడాదే నిర్మించాలి. దీని కోసం జనవరి 15 నాటికి టెండర్లు పిలవాలి. మిగతా సగం చెక్‌ డ్యామ్‌లను వచ్చే ఏడాది నిర్మించాలి. వీటి నిర్మాణం కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తాం’అని ముఖ్యమంత్రి చెప్పారు. 

చెరువుల నిర్వహణకు నిధులు..
మిషన్‌ కాకతీయ ద్వారా పునరుద్ధరించిన చెరువుల నిర్వహణకు బడ్జెట్‌లో నిధులిస్తామని ముఖ్యమంత్రి చెప్పారు. ‘రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమ స్పూర్తితో మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులను పునరుద్ధరించుకున్నాం. ఈ చెరువులు ఊరికి బతుకు దెరువుగా ఉపయోగపడుతున్నాయి. పునరుద్ధరించుకున్న చెరువుల కట్టలు, తూములు, కాల్వలు, ఇతరత్రా మళ్లీ పాడవకుండా ఎప్పటికప్పుడు అవసరమైన మరమ్మతులు చేయాలి. దీనికోసం ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయిస్తాం. ప్రతీ వేసవిలో చెరువులోని పూడిక మట్టిని రైతులు తమ పొలాల్లోకి తీసుకువెళ్లేలా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, రైతు సమన్వయ సమితి, గ్రామ పంచాయతీలు సమన్వయంతో వ్యవహరించి పూడిక మట్టిని పొలాలకు తరలించుకునేలా చూడాలి. గతంలో మాదిరిగా నీరటి కాడు వ్యవస్థను పునరుద్ధరించాలి. వీఆర్‌ఏలలో ఒకరికి చెరువుల పని అప్పగించాలి. చెరువుల్లో మొలిచే మొక్కలను ఎప్పటికప్పుడు తొలగించాలి’అని కేసీఆర్‌ అన్నారు. 

అక్టోబర్‌ నాటికే అన్నీ నింపాలి..
వర్షాకాలం ఆరంభంలోనే కడెం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు ఎల్లంపల్లికి చేరుకునే అవకాశం ఉన్నందున, వేసవి కాలంలోనే ఎల్లంపల్లి నీటిని ఎస్‌ఆర్‌ఎస్పీకి తరలించాలని ముఖ్యమంత్రి ఇంజనీర్లకు సూచించారు. ఎస్‌ఆర్‌ఎస్పీ ఆయకట్టుకు ఎప్పుడూ నీటి కొరత లేకుండా చూడాలన్నారు. రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లను అక్టోబర్‌ నాటికి పూర్తిస్థాయిలో నింపాలని సూచించారు. మిర్యాలగూడ డివిజన్‌లోని నాగార్జునసాగర్‌ ఆయకట్టుకు పాలేరు నుంచి నీళ్లివ్వడానికి అనువుగా ఎత్తిపోతల పథకం నిర్మించే అంశాన్ని పరిశీలించాలని, సర్వే నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్రంలో మారిన నీటిపారుదల వ్యవస్థ స్వరూపం మేరకు నీటి పారుదల శాఖను ఐదారుగురు ఈఎన్సీల పరిధిలోకి తీసుకురావాలని, దీనికి తగ్గట్టు శాఖను పునర్వ్యవస్థీకరించాలని సూచించారు. అర్హులైన వారికి పదోన్నతులు కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఈఎన్సీలు తమ పరిధిలోని ప్రాంతంలో అన్ని రకాల నీటి వనరులను పర్యవేక్షించాలని చెప్పారు. భారీ, మధ్య తరహా, చిన్న తరహా అనే తేడా లేకుండా నీటి పారుదల శాఖ ఒకే విభాగంగా పనిచేయాలని సీఎం కేసీఆర్‌ వివరించారు.

మరిన్ని వార్తలు