వచ్చే మార్చి కల్లా ప్రతి ఇంటికి నల్లా: సీఎం కేసీఆర్‌

17 Dec, 2018 17:16 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: మిషన్ భగీరథ పనులపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ప్రగతి భవన్‌లో సోమవారం సమీక్ష నిర్వహించారు. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి మిషన్ భగీరథ ద్వారా  ప్రతీ ఇంటిలో నల్లా బిగించి మంచినీరు సరఫరా చేయాలని ఆధికారులకు సూచించారు. వచ్చే ఏప్రిల్ నాటికి కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతాలు, మారుమూల ప్రాంతాలనే తేడా లేకుండా రాష్ర్ట్రంలోని అన్ని ఆవాస ప్రాంతాలకు మిషన్ భగీరథ పథకం ద్వారానే మంచినీళ్లు అందించేల చర్యలు తీసుకోవాలని ఆధికారులకు సూచించారు.

మిషన్‌ భగీరథ పనులపై ప్రస్తుతం జరుగుతున్నపనుల వివరాలు వెల్లడించిన ఆధికారులు. రాష్ట్రంలో 23,968 ఆవాస ప్రాంతాలకు గాను, 23, 947 ఆవాస ప్రాంతాలకు ప్రస్తుతం మిషన్ భగీరథ ద్వారా నీళ్లు అందుతున్నాయని ఆధికారులు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని 95 శాతం ఇండ్లకు నల్లాలు బిగించి మంచినీరు అందిస్తున్నట్లు సీఎంకు నివేదించారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ, దళిత వాడలు, ఆదివాసీ గూడేలు, శివారు ప్రాంతాలు, మారుమూల పల్లెలు అన్నింటికీ మిషన్ భగీరథ ద్వారానే శుద్ధి చేసిన మంచినీటిని సరఫరా చేయడం ప్రభుత్వ లక్ష్యమన్నారు.

ఆర్థికంగా భారమైనా సరే మిషన్ భగీరథ ద్వారానే మంచినీరు సరఫరా చేయాలని చెప్పారు. వచ్చే జనవరి 10లోగా అన్ని ఆవాస ప్రాంతాలకు మంచినీళ్లు చేరుకోవాలని సీఎం గడువు విధించారు. మిషన్ భగీరథ ప్రాజెక్టును పూర్తి చేయడం ఎంత ముఖ్యమో దాన్ని ఎలాంటి ఆటంకాలు లేకుండా నిర్వహించడం కూడా అంతే ముఖ్యమన్నారు.

మిషన్ భగీరథ కార్యక్రమం చేపట్టాలని అనుకున్న రోజు చాలా మందికి చాలా అనుమానాలుండేవి. ఈ కార్యక్రమం అవుతుందా? అనే సందేహాలుండేవి. కానీ అధికారులు, ఇంజనీర్లు ఎంతో కష్టపడి మిషన్ భగీరథ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు అనురాగ్ శర్మ, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, మిషన్ భగీరథ ఇ.ఎన్.సీ. కృపాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, జోగు రామన్న, గొంగిడి సునిత, రాజేందర్ రెడ్డి, కె.విద్యాసాగర్ రావు, భాస్కర్ రావు, తదితరులు హాజరయ్యారు.

మరిన్ని వార్తలు