ఆర్టీసీ కార్మికులకు కేసీఆర్‌ అల్టిమెట్టం

4 Nov, 2019 21:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రేపు అర్థరాత్రిలోగా విధుల్లో చేరని ఆర్టీసీ కార్మికులను తర్వాత ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగంలో చేర్చుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై హైకోర్టు విచారణ నేపథ్యంలో అనుసరించాల్సిన వైఖరిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. సీఎం కేసీఆర్‌ పలు అంశాల మీద చర్చించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ.. గడువులోగా కార్మికులు చేరకుంటే, మిగిలిన ఐదు వేల రూట్లలో ప్రైవేటు వాహనాలకు పర్మిట్లు ఇస్తామని, అప్పుడు తెలంగాణలో ఇక ఆర్టీసీ ఉండదని స్పష్టం చేశారు. విధుల్లో చేరడానికి గడువు ఇవ్వడం ద్వారా కార్మికులకు మంచి అవకాశం ఇచ్చినట్లయిందన్నారు. దాన్ని కార్మికులు ఉపయోగించుకుని ఉద్యోగాలు కాపాడుకోవడమా? వినియోగించుకోకుండా ఉద్యోగాలు కోల్పోయి, కుటుంబాన్ని కూడా ఇబ్బందుల పాలు చేయడమా ? అనేది వారే తేల్చుకోవాలన్నారు. న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్న ప్రభుత్వం కార్మిక చట్టాలను, కేంద్ర రవాణా చట్టాన్ని పరిశీలించిందని పేర్కొన్నారు.

హైకోర్టులో జరుగుతున్న విచారణను చూపి, యూనియన్ నాయకులు కార్మికులను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. కానీ న్యాయ నిపుణుల అభిప్రాయం ప్రకారం సమ్మె విషయంలో కోర్టు ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కోర్టు తేల్చగలిగింది కూడా ఏమీ లేదన్నారు. హైకోర్టు తీర్పు మరోలా ఉంటే, ఇంతదూరం వచ్చిన తర్వాత ఆర్టీసీ గానీ, ప్రభుత్వం గానీ సుప్రీంకోర్టుకు వెళ్తుందన్నారు. ఒకవేళ కేసు సుప్రీంకోర్టుకు వెళితే, అక్కడ విచారణ మరింత ఆలస్యమవుతుందని తెలిపారు. గతానుభాలను బట్టి చూస్తే సుప్రీంకోర్టులో నెలల తరబడి, ఒక్కోసారి సంవత్సరాల తరబడి కేసుల విచారణ సాగుతుందన్నారు. అది అంతంలేని పోరాటం అవుతుందని ఆయన పేర్కొన్నారు. కార్మికులకు ఒరిగేదేమీ ఉండదని సీఎం అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె. జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, రామకృష్ణ రావు, సునిల్ శర్మ, సందీప్ సుల్తానియా, అరవింద్ కుమార్, లోకేశ్ కుమార్, అడ్వకేట్ జనరల్ శివానంద ప్రసాద్, అడిషనల్‌ ఏజీ రాంచందర్ రావు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా