అన్యోన్యంగా కలిసే ఉన్నం 

19 May, 2020 04:28 IST|Sakshi

మాకు ఏం వివాదాలు లేవు.. కొందరి కళ్లు మండుతున్నాయా? 

శ్రీశైలం వద్ద ఏపీ తలపెట్టిన లిఫ్టు నిర్మాణంపై కేసీఆర్‌ స్పష్టీకరణ 

రాయలసీమకు గోదావరి నీళ్లు వెళ్లాలని నేనే అన్న 

వృథా నీళ్ల కోసమే ప్రాజెక్టు అన్న ఏపీ వాదనను ఎలా నమ్మాలి? 

ఈ మేరకు ఇవ్వాల్సిన చోట హామీ ఇవ్వాలి కదా?

ఈ విషయంలో కొందరు కిరికిరి పెట్టాలని చూస్తున్నారని ఫైర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ‘ఇప్పుడు కూడా (ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు) కలిసే పనిచేస్తున్నం. మాకు ఏం వివాదాలు లేవు. అన్యోన్యంగా కలిసే ఉన్నం. కలిసే ఉంటం. కొంత మందికి కళ్లు మండుతున్నాయా? వాళ్లు (నీళ్లు) తీసుకుంటామంటే మేము ఊరుకొని ఉన్నమా? కలిసి ఉందామంటే కలిసి ఉంటాం.. లేదు అంటే కొట్లాడుతం’అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ పేర్కొన్నారు. సోమవారం ప్రగతిభవన్‌లో విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిచ్చారు.

‘వాళ్ల ప్రతిపాదనలు వారిష్టం. వాటి విషయంలో మాకు అధికారం లేదు. రాయలసీమకు నీళ్లు అవసరమున్నప్పుడు గోదావరి నుంచి తీసుకెళ్లండి. మాకు అభ్యంతరం లేదు. మేము తీసుకుంటాం.. మీరు కూడా తీసుకోండి అన్నాం. కాదు మేము వేరే విధంగా తీసుకుంటామంటే, మా రాష్ట్రానికి భంగం కలిగితే ఒక్క క్షణం కూడా ఉపేక్షించం. తెలంగాణ ప్రయోజనాల మీద రాజీపడే ప్రసక్తే లేదు. గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా మాకు అభ్యంతరం లేదు.

చిల్లర పంచాయితీలతో సాధించేది ఏమీ లేదు. ప్రేమతో సాధించుకుందాం అని నేను అప్పుడు అన్న.. ఇప్పుడు కూడా కట్టుబడి ఉన్న. మాకు రెండు నాలుకలు లేవు’అని కేసీఆర్‌ స్పష్టంచేశారు. ‘వాళ్లు కూడా ఈ రోజు (కృష్ణా గోదావరి వాటర్‌ మేనేజ్‌మెంట్‌ బోర్డుకు) లేఖ ఇచ్చినట్టు తెలిసింది. మా పాలసీ మాకు ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో మనకు జరిపిన కేటాయింపుల మేరకే మనం అన్ని ప్రాజెక్టులను కడుతా ఉన్నం. మిగతావాళ్లు కూడా అలానే ఉండాలని కోరుతున్నం. అంతకు మించి వివాదంలోకి నేను పోదల్చుకోలేదు’అని తొలుత కేసీఆర్‌ బదులిచ్చారు. అయితే, దీనిపై స్పందించాలని ఓ విలేకరి అడగ్గా.. ఆయన మాట్లాడారు. 

అప్పుడు బాబు అంగీకరించారు..  
‘నీళ్ల గురించి కేసీఆర్‌ను విపక్షాలు విమర్శించడం నాదాన్‌ దుష్మన్‌ లాంటిది. పోతిరెడ్డిపాడు మీద అరవీర భయంకరంగా పోరాడింది ఎవరు? ఆనాడు చెంచాగిరీ చేసి ఆంధ్ర ముఖ్యమంత్రుల సంచులు మోసింది ఎవరు? విషయం నా దృష్టికి వచ్చినప్పుడు ఐదు నిమిషాల్లో సమావేశం ఏర్పాటు చేసి ఫిర్యాదు చేసినం. పాలమూరు ఎత్తిపోతల పథకంపై అప్పట్లో వారు(చంద్రబాబు ప్రభుత్వం) సుప్రీంకోర్టులో కేసు వేశారు. అపెక్స్‌ కౌన్సిల్‌కు వెళ్లమని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. నేను కూడా వెళ్లిన.. అప్పుడు వేరే ముఖ్యమంత్రి (చంద్రబాబు) ఉన్నడు. నేను మాట్లాడిన తర్వాత మీది మీరు కట్టుకోండి.. మాది మేము కట్టుకుంటామని చెప్పి ఆయన లేచి వెళ్లిపోయిండు.

దాని ప్రకారం ప్రాజెక్టులు కట్టుకుంటున్నం. చట్టం ప్రకారం వాటా పరిధిలో కట్టుకుంటున్నం. కాబట్టి వివాదాలకు పోవట్లేదు. ప్రజలు ఎక్కడి వారైనా బాగా ఉండాలి.. రాయలసీమకు నీళ్లు వెళ్లాలని నువ్వు అనలేదా? అనంటున్నరు.. వంద శాతం అన్నాను. ఇప్పుడు కూడా చెబుతున్న ఎందుకు పోవద్దు రాయలసీమకు నీళ్లు? గోదావరిలో సముద్రంలోకి పోతున్నయి నీళ్లు. వాటిని తీసుకుని రాయలసీమకు పొమ్మని చెప్పిన. తప్పా? మేము పిచ్చి లొల్లి పెట్టం. వీళ్ల గురించి పట్టించుకోవద్దనే ప్రజలు మాకు చెబుతున్నరు’ అని విపక్షాలపై మండిపడ్డారు.  

చంద్రబాబు బోగస్‌ పంచాయితీ..  
ఏపీ సీఎం జగన్‌కు గతంలో మీరు స్నేహహస్తం ఇచ్చారు కదా అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని పిలిచి భోజనం పెట్టి సమావేశం ఏర్పాటు చేసి బేసిన్లు లేవు. భేషజాలు లేవు అని నేనే అన్న. బ్రహ్మాండంగా (గోదావరి) నీళ్లు మీరు వాడుకోండి. మేము వాడుకుంటం. ఇరు రాష్ట్రాలు సరిపోగా ఇంకా 1000 టీఎంసీలు మిగిలి ఉంటయి అని నేను అన్న’అని సీఎం కేసీఆర్‌ బదులిచ్చారు.

‘చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడితే బస్తీమే సవాల్‌. ఏం సాధించిన్రు? ఒక టీఎంసీనైనా సాధించిన్రా? మాట్లాడితే పచ్చ జెండాలు(టీడీపీ జెండాలు) పట్టుకుని కర్ణాటక సరిహద్దులోకి పోవడం.. తొడగొట్టి సుప్రీంకోర్టుకు వెళ్లడం.. చంద్రబాబు బాబ్లీ బోగస్‌ పంచాయితీ పెట్టిండు? ఏమైనా వచ్చిందా? మహారాష్ట్ర ముఖ్యమంత్రి నా కంటే చిన్నవాడైనా ఏడుసార్లు ఆ రాష్ట్రానికి వెళ్లి (కాళేశ్వరం ఒప్పందం) సామరస్యంగా సాధించిన’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. 

కిరికిరి పెట్టాలని చూస్తున్నరు.. అది జరగదు 
పోతిరెడ్డిపాడు మీద కేంద్రం జోక్యాన్ని కోరుతారా? అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘తమ్ముడు.. నీకు కిరికిరి పంచాయితీ పెట్టాలని ఉన్నట్టుంది.. అదేమీ జరగదు.. దురాశపడకు.. ఇక చాలు. నీ ఉద్దేశం ఏమిటో తెలుస్తుంది. నువ్వు కేసీఆర్‌తో పెట్టుకోలేవు’అని సీఎం బదులిచ్చారు. శ్రీశైలం నుంచి వృథా జలాలను వాడుకోవడానికే కొత్త ఎత్తిపోతల పథకం నిర్మిస్తున్నామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసిందన్న విషయాన్ని మరో విలేకరి ప్రస్తావించగా..

‘ఎలా నమ్ముతరండి? అందుకే మేము ఫిర్యాదు ఇచ్చినం. వారు ఇవ్వాల్సిన చోట ఆ హామీ అధికారికంగా ఇవ్వాలి కదా? మాకు అనుమానం కలిగించే పద్ధతిలో ఉంటే నిరసపన తెలుపుతాం కదా?’అని కేసీఆర్‌ పేర్కొన్నారు. ‘గోదావరి మీద ఇంకో కమిటీ వేశాం. గోదావరిలో మా 950 టీఎంసీల వాటా పోను 650 టీఎంసీ సర్‌ప్లస్‌ వాటా కావాలని కేంద్రాన్ని కోరుతున్నం. గతంలో కూడా కోరినం. మాట్లాడితే గోదావరి కావేరి అంటున్నరు. మాకు సాగు, తాగు, పరిశ్రమల అవసరాలకు గోదావరి తప్ప మరో దిక్కులేదు’అని కేసీఆర్‌ స్పష్టంచేశారు.   

మరిన్ని వార్తలు