దశలవారీగా ఎలక్ట్రిక్‌ వాహనాలు

6 Jun, 2018 02:17 IST|Sakshi

పర్యావరణ పరిరక్షణకు చర్యలు: సీఎం కేసీఆర్‌

కాలుష్య కారకాల వినియోగాన్ని నియంత్రించాలి

జూలైలో నాలుగో విడత హరితహారం ప్రారంభం

అధికారులతో ‘పర్యావరణ దినోత్సవ’ సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌ : పర్యావరణ పరిరక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని.. ఇప్పటికే ప్రతిష్టాత్మకంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. అన్ని సంపదలతో పోలిస్తే ఆరోగ్యమే ప్రధానమైనదని, భవిష్యత్‌ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సమకూర్చడమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించేందుకు దశల వారీగా ఎలక్ట్రికల్‌ వాహనాలను ప్రవేశపెట్టబోతున్నట్టు తెలిపారు.

సౌర విద్యుత్‌లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి సాధించామన్నారు. అటవీ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అటవీ పునరుజ్జీవన చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై మంగళవారం అధికారులతో సీఎం కేసీఆర్‌ సమీక్షించారు. జూలైలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని, ప్రజలంతా అందులో భాగస్వాములైతే కార్యక్రమం విజయవంతం అవుతుందని చెప్పారు. ప్రజలంతా హరితహారంలో పాల్గొనాలని.. మొక్కలు నాటడంతోపాటు నాటిన ప్రతీ మొక్కా బతికేలా రక్షణ చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.

అప్రమత్తంగా ఉండాలి
ప్రపంచవ్యాప్తంగా పర్యావరణంలో వస్తున్న మార్పుల ప్రభావం మనపై కూడా ఉంటుందని.. ఈ విషయంలో ప్రతీ ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కేసీఆర్‌ సూచించారు. వీలైనంత వరకు కాలుష్య కారకాలను వాడకుండా ఉండాలని చెప్పారు. ప్లాస్టిక్‌ విచ్చలవిడి వినియోగంతో ముప్పు పొంచి ఉందని.. నిత్య జీవితంలో ప్లాస్టిక్‌ అవసరమున్నా, దానితో తలెత్తే దుష్పరిణామాలపై ఏమరుపాటు వద్దని పేర్కొన్నారు. 

హరితహారం ఫలితాలు కనిపిస్తున్నాయి
రాష్ట్రాన్ని ఆకుపచ్చగా మార్చాలన్న లక్ష్యంతోనే ‘తెలంగాణకు హరితహారం’కార్యక్రమం ప్రారంభమైందని.. గత మూడేళ్లుగా చేపట్టిన చర్యల ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. మొక్కలు నాటడంతోపాటు వాటి పెంపకం, రక్షణకు ప్రాధాన్యత ఇచ్చినప్పుడే ఫలితాలు మరింత ఆశాజనకంగా ఉంటాయన్నారు. వచ్చే నెలలో నాలుగో విడత హరితహారం ప్రారంభమవుతుందని తెలిపారు. ఈ విడతలో రాష్ట్రవ్యాప్తంగా 38 కోట్ల మొక్కలు నాటనున్నామని పేర్కొన్నారు. హరితహారంలో భాగంగా అర్బన్‌ ఫారెస్ట్‌ పార్కులు, రహదారి వనాలు (ఎవెన్యూ ప్లాంటేషన్‌) ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.

నాటడం కాదు.. పెంచేలా..
ఇప్పటివరకు మూడు విడతలుగా జరిగిన హరితహారంలో రాష్ట్రవ్యాప్తంగా 82 కోట్ల మొక్కలు నాటారు. తాజాగా నాలుగో విడతలో ప్రధానంగా టేకు, వెదురు, పూలు, పళ్ల మొక్కలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ఈసారి స్కూళ్లు, కాలేజీల ఆవరణలో మొక్కలు ఎక్కువగా నాటాలని.. విద్యార్థులను ఎక్కువగా భాగస్వాములను చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక మొక్కలు నాటే సమయంలో హడావుడి చేస్తున్న ప్రభుత్వ విభాగాలు తర్వాత వాటి రక్షణను గాలికి వదిలేస్తున్నాయనే విమర్శల నేపథ్యంలో.. ఈసారి మొక్కలు నాటడంతో పాటు రక్షణ విషయంలో జవాబుదారీగా ఉండేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

నేరుగా సీఎంవో పర్యవేక్షణ
నాటిన మొక్కలు, వాటిలో బతికి ఉన్నవెన్ని, రక్షణకు తీసుకున్న చర్యలేమిటనే అంశాలపై అటవీ శాఖ ఈసారి కట్టుదిట్టంగా వ్యవహరిస్తోంది. ప్రతినెలా మొక్కల ఫొటోలను అటవీ శాఖకు చెందిన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ చేయాలని సూచించింది. ఈ వెబ్‌సైట్‌తోపాటు మొక్కల వివరాలను జియో ట్యాగింగ్‌ ద్వారా సీఎం క్యాంపు కార్యాలయంలోని డ్యాష్‌ బోర్డుకు అనుసంధానం చేస్తున్నారు. దాంతో ముఖ్యమంత్రే స్వయంగా ఏయే ప్రాంతాల్లో మొక్కలు ఎలా ఉన్నాయి, వాటి పరిస్థితి ఏమిటన్నది పర్యవేక్షించే వీలుంటుందని చెబుతున్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు