వారం రోజుల్లోనే రైతులకు పెద్ద తీపి కబురు: కేసీఆర్‌

29 May, 2020 15:51 IST|Sakshi

సాక్షి, సిద్దిపేట: కాళేశ్వరం బహుళ ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన కొండపోచమ్మ సాగర్ జలాశయాన్ని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు శుక్రవారం మధ్యాహ్నం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తెలంగాణ రైతులకు వారం రోజుల్లోనే పెద్ద తీపికబురు చెబుతానని ప్రకటించారు. భారత్‌లో ఇప్పటివరకు ఏ ప్రభుత్వం చేయనటువంటి పనిని తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం చేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు కోసం భూములు ఇచ్చినవారి త్యాగాలు వెలకట్టలేనివని సీఎం పేర్కొన్నారు. భూములు కోల్పోయినవారందరికీ పునరావాసం కల్పించామని గుర్తు చేశారు. ఏ ప్రభుత్వం కూడా ఇంత త్వరగా ప్రాజెక్టులు పూర్తి చేయలేదని ఆయన స్పష్టం చేశారు. లక్షలాది ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా నీళ్లు వచ్చాయని అన్నారు. నిర్వాసితుల త్యాగాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 
(చదవండి: కేసీఆర్‌ పేరుకు కొత్త నిర్వచనం.. )

కష్టాల పాటల నుంచి పసిడి పంటలవైపు..
తెలంగాణ చరిత్రలో కొండపోచమ్మ సాగర్‌ ప్రారంభం ఉజ్వల ఘట్టమని ముఖ్యమంత్రి అభివర్ణించారు. ఏ లక్ష్యంతో ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమించామో ఆ కల సంపూర్ణంగా, సాదృశ్యంగా సాకారమైందని ఆనందం వ్యక్తం చేశారు. కొండపోచమ్మ సాగర్‌ అపురూపమైన ప్రాజెక్టు అని సీఎం వ్యాఖ్యానించారు. కొద్ది రోజుల్లోనే దుమ్ముగూడెం దగ్గర సీతమ్మసాగర్, దేవాదుల ప్రాజెక్టు కోసం సమ్మక్క సాగర్‌ నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు. హుస్నాబాద్‌ దగ్గర గౌరవెళ్లి, గండిపెల్లి ప్రాజెక్టు కూడా త్వరలో నిర్మాణం పూర్తి చేసుకుంటుందన్నారు. దేశంలోనే అత్యధికంగా వరి సేకరించిన రాష్ట్రంగా తెలంగాణ పేరుతెచ్చుకుందని హర్షం వ్యక్తం చేశారు. ఆరేళ్ల క్రితం కష్టాల పాటలు పాడుకున్న తెలంగాణ ఇప్పుడు పసిడి పంటల రాష్ట్రంగా మారిందని కేసీఆర్‌ వెల్లడించారు.
(చదవండి: తెలంగాణ సాగునీటి కల సాకారం)

>
మరిన్ని వార్తలు