బడ్జెట్‌ సమావేశాల్లోనే ‘పంచాయతీ’ బిల్లు 

5 Feb, 2018 02:44 IST|Sakshi
ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

ప్రతి గ్రామానికి రూ. 5 లక్షల నుంచి రూ. 30 లక్షలు: కేసీఆర్‌

వచ్చే బడ్జెట్‌ నుంచి కేటాయింపు

మూడు నెలల్లో ఊరూరా 

కంటి చికిత్స శిబిరాలు

హైదరాబాద్‌లో ‘పట్టణ అడవుల’ అభివృద్ధికి చర్యలు

మూసీ రివర్‌ ఫ్రంట్‌లో వాక్‌వే.. అధ్యయనానికి బృందం

వివిధ శాఖల అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్ష  

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే రాష్ట్ర బడ్జెట్‌ సమావేశాల్లోనే కొత్త పంచాయతీరాజ్‌ చట్టం బిల్లును ప్రవేశపెట్టాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఏటా రూ.5 లక్షల నుంచి రూ.30 లక్షల వరకు నిధులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని సూచించారు. గ్రామ పంచాయతీలకు ఉపాధి హామీ పథకం నిధులతోపాటు ఆర్థిక సంఘం, రాష్ట్ర బడ్జెట్, ఆస్తి పన్నుల వసూళ్లు తదితర మార్గాల ద్వారా ఆదాయం సమకూరేలా విధివిధానాలు రూపొందించాలని ఆదేశించారు.

కొత్తగా ఏర్పాటు కాబోతున్న పంచాయతీలు ఆర్థిక సంఘం నుంచి నిధులు ఏవిధంగా పొందవచ్చనే దానిపై అధ్యయనం చేయాలని పంచాయతీరాజ్‌ కమిషనర్‌కు సూచించారు. ఆదివారం పంచాయతీరాజ్‌ ముసాయిదా బిల్లు పురోగతి, కొత్త పంచాయతీలు, నగర పంచాయతీల ఏర్పాటుపై ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి సమీక్షించారు. 

అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు 
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో నేత్ర శిబిరాలు నిర్వహించి, కంటి పరీక్షలు చేయాలని.. అవసరమైన వారికి కళ్లద్దాలను ఉచితంగా అందజేయాలని కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం మూడు నెలల్లో పూర్తి కావాలని స్పష్టం చేశారు. ఇక ఆరోగ్యానికి సంబంధించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పెద్ద ఎత్తున ప్రచారం చేసి ప్రజలను చైతన్యవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమం అమలుకు ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, ఆసక్తి గల ఇతర వ్యవస్థలను భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు. దీనిపై అవలంబించాల్సిన వ్యూహన్ని ఖరారు చేయాల్సిందిగా ఆరోగ్య శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వైద్యారోగ్య శాఖ కార్యదర్శి, కమిషనర్‌లను ఆదేశించారు. ఇక మార్చి 11న రాష్ట్రవ్యాప్తంగా పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వాలని నిర్ణయించిన నేపథ్యంలో.. ఆ పాస్‌ పుస్తకాల ముద్రణ పురోగతి, ధరణి వెబ్‌సైట్‌ ఏర్పాటుపై రెవెన్యూ, ఐటీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ పనులన్నీ అనుకున్న సమయంలోగా పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వ సీఎస్‌ను ఆదేశించారు. 

హైదరాబాద్‌ చుట్టూ ‘అర్బన్‌ ఫారెస్ట్‌’ 
హైదరాబాద్‌ నగరం చుట్టూ 50 నుంచి 60 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అటవీ భూమిని కాపాడేందుకు తగిన చర్యలు చేపట్టాలని అధికారులను కేసీఆర్‌ ఆదేశించారు. నగరం పరిధిలో, చుట్టూ ఉన్న అటవీ ప్రాంతాలను పరిశీలించి.. వాటి అభివృద్ధికి ఏం చేయాలో అధ్యయనం చేయాలని సూచించారు. ఈ బాధ్యతలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్, అటవీ శాఖల మంత్రులు, చీఫ్‌ కన్సర్వేటర్‌ ఆఫ్‌ ఫారెస్ట్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావులకు అప్పగించారు. ‘సేవ్‌ హైదరాబాద్‌’లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాలన్నారు. 

హైదరాబాద్‌ పరిధిలో దాదాపు లక్షన్నర ఎకరాల మేర అటవీ భూమి ఉందని.. దాన్ని కాపాడుకుంటూ ఆరోగ్యకరమైన గాలి పీల్చుకునేలా ‘ఫారెస్ట్‌ బ్లాక్స్‌’ను అభివృద్ధి చేయాలని ఆదేశించారు. మూసీ రివర్‌ ఫ్రంట్, హైదరాబాద్‌ అర్బన్‌ ఫారెస్ట్‌ను ప్రత్యేకంగా అభివృద్ధి చేయాలని, అవసరమైనన్ని నిధులు వెచ్చించాలని సూచించారు. జూబ్లీహిల్స్‌లోని కేబీఆర్‌ పార్క్‌ తరహాలో మూసీ రివర్‌ ఫ్రంట్‌లో వాక్‌వే రూపొందించాలన్నారు. సమావేశంలో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్, తుమ్మల, జూపల్లి, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీలు సీతారాంనాయక్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, మల్లారెడ్డి, ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు