కార్మికుల ఆందోళనలు.. కేసీఆర్‌ కీలక ఆదేశాలు

12 Oct, 2019 21:05 IST|Sakshi

​కార్మికులను క్షమించే ప్రసక్తే లేదు: కేసీఆర్‌

3 రోజుల్లో 100 శాతం బస్సులు నడివాల్సిందే

నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు

సాక్షి, హైదరాబాద్‌: సమ్మెను ఉధృతం చేస్తామన్న ఆర్టీసీ కార్మికుల ప్రకటనలపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె పేరుతో బస్టాండ్లు, బస్‌ డిపోల వద్ద అరాచకం చేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. గూండాగిరి నడవదని, ఇప్పటి వరకు ప్రభుత్వం కాస్త ఉదాసీనంగా ఉందని, ఇకపై కఠినంగా వ్యవహరిస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెతో తలెత్తిన పరిస్థితులపై శనివారం ఆయన ప్రగతి భవన్‌లో సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్న కార్మికులను క్షమించే ప్రసక్తే లేదన్నారు. మూడు రోజుల్లోగా వందశాతం బస్సులు నడిపి తీరాల్సిందేనని అధికారులను ఆదేశించారు. 
(చదవండి : ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్‌ ఆత్మహత్యాయత్నం)

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని యూనియన్‌ లీడర్లుగా చెప్పుకునే కొందరు ప్రకటిస్తున్నారని, సమ్మెను ఉధృతం చేసినా ప్రభుత్వం చలించదని.. బెదిరింపులకు భయపడేది లేదని కేసీఆర్‌ అన్నారు. చట్ట విరుద్ధంగా జరుగుతున్న సమ్మెను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ గుర్తించదని, సమ్మె చేస్తున్న వారితో చర్చలు కూడా జరపదని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. బస్టాండ్లు, బస్ డిపోల వద్ద ఎవరైనా బస్సులను ఆపినా, విధ్వంసం సృష్టించినా వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి హెచ్చరికలు జారీ చేశారు. 

ప్రతి ఆర్టీసీ డిపో, బస్టాండ్ల వద్ద పోలీసు బందోబస్తును పెంచాలని, అన్ని చోట్ల సీసీ కెమెరాలు పెట్టాలని, మహిళా పోలీసులను కూడా బందోబస్తు కోసం వినియోగించాలని డీజీపీ మహేందర్‌ రెడ్డికి సమీక్ష సమావేశం నుంచే ముఖ్యమంత్రి ఫోన్‌ చేసి ఆదేశించారు. అవసరమైతే ఇంటెలిజెన్స్‌ పోలీసులనూ ఉపయోగించాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే వారిని గుర్తించి, కేసులు పెట్టి, కోర్టుకు పంపాలని, ఉద్యమం పేరిట విధ్వంసం చేస్తే ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి అన్నారు. 

కాగా, ఖమ్మం జిల్లాలో ఇద్దరు ఆర్టీసీ డ్రైవర్లు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఖమ్మం డిపోలో డ్రైవర్‌గా పని చేస్తున్న శ్రీనివాస్‌ రెడ్డి ఒంటిపై కిరోసిన్‌ పోసుకుని నిప్పంటించుకున్నారు. తీవ్రంగా గాయపడిన అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అలాగే మరో డ్రైవర్‌ బోయిన వెంకటేశ్వరాచారి పెట్రోల్‌ పోసుకుని నిప్పుంటించుకోగా తోటి కార్మికులు సకాలంలో స్పందించి ఆర్పివేశారు. ఈ పరిణామాలతో ఖమ్మం బస్‌ డిపో వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.  

మరిన్ని వార్తలు