ఆర్టీసీ సమ్మె : కేసీఆర్‌ కీలక నిర్ణయం

4 Oct, 2019 23:31 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : త్రిసభ్య ఐఏఎస్‌ అధికారుల కమిటీతో చర్చలు విఫలమైన నేపథ్యంలో తెలంగాణ ఆర్టీసీ కార్మిక సంఘాలు శనివారం నుంచి సమ్మెకు దిగుతున్నట్టు ప్రకటించాయి. అయితే, ఆర్టీసీ కార్మికుల తీరుపై సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న ఆయన ఆర్టీసీ సమ్మెపై ప్రగతి భవన్‌లో  ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఆర్టీసీ కార్మికులతో చర్చించేందుకు వేసిన త్రిసభ్య కమిటీ సభ్యులు చర్చల వివరాలను కేసీఆర్‌కు తెలియజేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆయా డిపోల్లో రిపోర్ట్ చేసిన కార్మికులే ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించబడతారని  స్పష్టం చేశారు.
(చదవండి : సమ్మెలో పాల్గొంటే డిస్మిస్‌)

6 గంటల్లోపు రిపోర్టు చెయ్యకపోతే తమంతట తామే విధులను వదిలిపెట్టి వెళ్లినట్లు గుర్తించాలని అధికారులను ఆదేశించారు. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తి స్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని, విధుల్లో చేరని వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలో చేర్చుకోవద్దన్నది ప్రభుత్వం విధాన నిర్ణయమని వెల్లడించారు. ఇకపై కార్మిక సంఘాల నాయకులతో ఎలాంటి చర్చలు జరపవద్దని ప్రభుత్వం నిర్ణయించింది. చర్చల కోసం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రద్దు చేస్తున్నట్టు కేసీఆర్‌ ప్రకటించారు. ఇదిలాఉండగా.. ట్రాన్స్ పోర్టు కమిషనర్‌గా సందీప్ సుల్తానియాను ప్రభుత్వం నియమించింది.
(చదవండి : ఆర్టీసీ కార్మికులతో మరోసారి చర్చలు విఫలం)

ఈ సమీక్షా సమావేశంలో రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, పార్లమెంటు సభ్యులు కె.కేశవ రావు, నామా నాగేశ్వర్ రావు, కొత్త ప్రభాకర్ రెడ్డి, బండా ప్రకాశ్, రంజిత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె..జోషి, డిజిపి మహేందర్ రెడ్డి, అడిషనల్ డిజిపి జితేందర్, సీనియర్ అధికారులు సోమేశ్ కుమార్, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, నర్సింగ్ రావు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు