కొత్తగా ఇవ్వడం లేదు.. పెంచుతున్నాం

13 Apr, 2017 03:03 IST|Sakshi
కొత్తగా ఇవ్వడం లేదు.. పెంచుతున్నాం

ముస్లింలు, ఎస్టీల రిజర్వేషన్లపై సీఎం స్పష్టీకరణ
ప్రజలకిచ్చిన హామీని తప్పక నెరవేరుస్తాం
తమిళనాడు తరహాలో మక్కీకి మక్కీగా చట్టం తెస్తాం
బిల్లును ఈ నెల 16న అసెంబ్లీలో పెడతాం
ఎంత పెంచాలన్నది 15న కేబినెట్‌ భేటీలో నిర్ణయిస్తాం
త్వరలో బీసీ, ఎస్సీ రిజర్వేషన్లు కూడా పెంచుతాం
కేంద్రం ఈ రిజర్వేషన్లను వద్దంటే సుప్రీంకోర్టుకు వెళ్తాం
తమిళనాడుకు ఉన్న వెసులుబాటు ఇవ్వాలని కోరుతాం
గతంలోని సుప్రీం తీర్పు ఏమాత్రం అడ్డంకి కాబోదు
కేబినెట్‌ భేటీ అనంతరం మీడియాతో ముఖ్యమంత్రి


రాష్ట్రంలో ముస్లింలు, ఎస్టీలకు రిజర్వేషన్లను పెంచుతామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. తెలంగాణ రిజర్వేషన్‌ చట్టం పేరుతో బిల్లును తీసుకొస్తామని.. 16న అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసి బిల్లు ప్రవేశపెడతామని వెల్లడించారు. తమిళనాడు తరహాలో మక్కీకి మక్కీగా రిజర్వేషన్ల బిల్లును రూపొందిస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ బిల్లును రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తామని తెలిపారు. ఇదే తరహాలో త్వరలోనే బీసీలకు, ఎస్సీలకు సైతం రిజర్వేషన్లు పెంచుతామని ప్రకటించారు. తెలంగాణ సామాజిక స్వరూపానికి అనుగుణంగా రిజర్వేషన్లు రూపొందించాల్సిన బాధ్యత తమపై ఉందని స్పష్టం చేశారు. తాము రిజర్వేషన్ల పెంపు కొత్తగా చేయడం లేదని, మతపరమైన రిజర్వేషన్‌ ఇవ్వడం లేదని పేర్కొన్నారు.

‘‘ఎస్టీలకు 12 శాతం, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని ఉద్యమ సమయంలో, ఎన్నికల సభల్లో వందల సార్లు ప్రజలకు హామీ ఇచ్చాం. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాకముందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఇచ్చిన హామీని నెరవేరుస్తాం. మతపరమైన రిజర్వేషన్‌ ఇవ్వడం లేదు. మేం ఇవ్వబోతున్న రిజర్వేషన్‌ కొత్తది కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో అమల్లో ఉన్నదే. దాన్ని కొంత శాతం పెంచుతున్నాం. ఈ నెల 15న మధ్యాహ్నం 2 గంటలకు మంత్రివర్గ భేటీ ఉంటుంది. అదేరోజు సాయంత్రం 4.30కు బీఏసీ సమావేశం ఏర్పాటు చేయాలని స్పీకర్‌ను కోరాం.

16న అసెంబ్లీ సమావేశాలకు పిలవాలని సభాపతిని కోరాం. బీసీ కమిషన్, సుధీర్‌ కమిటీ ప్రభుత్వానికి తమ నివేదికలు అందించాయి. ఈ నివేదికల ఆధారంగా ఎస్టీ, బీసీ–ఈలకు ఎంత రిజర్వేషన్లు ఇవ్వాలనేది కసరత్తు చేయాలని మంత్రిని, అధికారులను ఆదేశించాం. ఈలోగా కసరత్తు జరుగుతుంది. 15న జరిగే కేబినెట్‌ భేటీలో తుది నిర్ణయం తీసుకుంటాం’’అని సీఎం అన్నారు. బుధవారం ప్రగతి భవన్‌లో రాష్ట్ర మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సీఎం విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ఎస్సీలకు ఒక శాతం పెంచాల్సి ఉంది
రాష్ట్రంలో 90 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు పేదరికంలో మగ్గుతున్నారని    సీఎం పేర్కొన్నారు. ‘‘కులాలు, మతాల పేరుతో రిజర్వేషన్లకు అవకాశం లేదు కాబట్టి ఆర్థిక, సామాజిక అంశాల ఆధారంగా బీసీ కమిషన్‌ విచారణ జరిపింది. ముస్లింలకు బీసీ–ఈ కోటాలో రిజర్వేషన్లు ఇస్తాం. ముస్లింలకు కొత్తగా రిజర్వేషన్లు ఇవ్వడం లేదు. ప్రస్తుతమున్న రిజర్వేషన్ల శాతాన్ని పెంచుతున్నాం...’’అని వివరించారు. ‘‘ఇప్పుడున్న జనాభాను బట్టి రాష్ట్రంలో ఎస్సీల కనీసం ఒక శాతం రిజర్వేషన్‌ పెంచుతాం. బీసీలకు కూడా కొంత రిజర్వేషన్లు పెంచాల్సి న అవసరం ఉంది. బీసీల్లో ఎంబీసీలు, సంచార జాతుల స్థితిగతులపై నివేదిక ఇవ్వాలని బీసీ కమిషన్‌ను కోరాం. అన్ని జిల్లాల్లో పర్యటించి 6, 7 నెలల్లో కమిషన్‌ నివేదిక ఇస్తుంది.

బీసీ కమిషన్‌కు అవసరమైన వివరాలివ్వాలని అధికారులను కోరాం. నివేదిక వచ్చాక బీసీల రిజర్వేషన్ల పెంపునకు కృషి చేస్తాం. త్వరలోనే ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్‌ ఏర్పాటు చేస్తాం. ప్రభుత్వంపై ఆరోపణలు చేసేవారు ఆత్మ విమర్శ చేసుకోవాలి. బీసీ–ఈ రిజర్వేషన్లు పెంచితే బీసీల రిజర్వేషన్లు తగ్గుతాయని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఒక్క శాతం కూడా తగ్గేది లేదు. బీసీలకు సైతం రిజర్వేషన్లు పెంచుతాం. పార్టీ మేనిఫెస్టోలపై ఇటీవల సుప్రీం చీఫ్‌ జస్టిస్‌ చేసిన వ్యాఖ్యలు మాకు సరిపోతాయి. దేశంలో నూటికి నూరు శాతం మేనిఫెస్టోను అమలు చేసిన పార్టీ మాది..’’అని సీఎం అన్నారు.

కేంద్రం వద్దంటే సుప్రీంకు..
రిజర్వేషన్ల పెంపునకు కేంద్రం అనుమతించకపోతే సుప్రీంకోర్టుకు వెళ్తామని సీఎం చెప్పారు. ‘‘ఒక దేశంలో రెండు చట్టాలు ఉంటాయా? తమిళనాడు మాదిరిగానే తెలంగాణలోనూ రిజర్వేషన్లు ఇవ్వాలని కోరతాం. రిజర్వేషన్లపై సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అడ్డంకి కాబోదు. మండల్‌ కమిషన్‌ రిజర్వేషన్లపై అలజడి చెలరేగిన సమయంలో ఇందిరా సహానీ కేసులో.. రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పులో మరో విషయం కూడా ప్రస్తావించింది. ప్రత్యేక పరిస్థితులుండీ.. న్యాయబద్ధంగా ఉండీ.. సమంజసమైన ప్రాతిపదిక ఉంటే 50 శాతం పరిధిని పెంచుకునే అవకాశముందని పేర్కొంది. అందుకే తమిళనాడుకు ఉన్న వెసులుబాటునే తెలంగాణకు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరతాం. స్వాతంత్య్రం వచ్చినప్పుడున్న పరిస్థితులు ఇప్పుడు లేవు. మారిన పరిస్థితులను బట్టి కేంద్రం కూడా ఆలోచించుకోవాలి.

 దేశం సురక్షితంగా ఉండాలంటే ఈ అధికారాలను రాష్ట్రాలకు అప్పగించాలి’’అని అన్నారు. విద్య, ఉద్యోగ విషయాల్లో అమలయ్యే ఈ రిజర్వేషన్లు ఎంత ఉండాలనే స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వాలకే అప్పగించాలని కేంద్రానికి సూచించారు. ‘‘పార్టీ ఏదైనా ప్రభుత్వ ప్రక్రియ నిరంతరం. కొన్ని సందర్భాల్లో కేంద్రంలో యూపీఏ ఉండవచ్చు.. ఎన్డీఏ ఉండవచ్చు.. ఏదో బీబీఏ ఉండవచ్చు. తమిళనాడుకు చేసినట్లు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సచ్చినట్లు చేయాలి. తమిళనాడుకు పీవీ ప్రభుత్వం చేసిన చట్టాన్ని ఈ రోజు మోదీ ప్రభుత్వం కొనసాగిస్తోంది. ఒక పార్టీకి ఒక పిచ్చి ఉండవచ్చు.. మా పార్టీకి ప్రజలకు న్యాయం జరగాలన్న పిచ్చి ఉంది. రూ.17 వేల కోట్ల రైతు రుణమాఫీ విజయవంతంగా పూర్తి చేశాం. రైతులపై ఉన్న రూ.లక్ష రుణ భారం తగ్గించాం. ఇది శుభపరిణామం’’అని సీఎం అన్నారు.

వివిధ రాష్ట్రాల్లో ఉన్నట్లే..
ఇప్పటికే పలు రాష్ట్రాల్లో 50 శాతం మించి రిజర్వేషన్లు అమలవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. ‘‘తమిళనాడులో 32 సంవత్సరాలుగా 69 శాతం రిజర్వేషన్లు కొనసాగుతున్నాయి. దేశంలో ఏడు రాష్ట్రాల్లో ముస్లింలలో వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్లున్నాయి. జార్ఖండ్‌లో 60 శాతం, మహారాష్ట్రలో 52, అరుణాచల్‌ప్రదేశ్, మేఘాలయ, నాగాలాండ్, మిజోరంలో 80 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. గుజ్జర్లు, జాట్లకు 68 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని రాజస్తాన్‌ ప్రభుత్వం ఇటీవల అసెంబ్లీలో బిల్లును ఆమోదించి రాష్ట్రపతి ఆమోదానికి పంపించింది. ఇప్పుడు కేంద్రం పరిశీలనలో ఉంది’’అని వివరించారు.

కేబినెట్‌ నిర్ణయాలివి

  • బీసీ కమిషన్, సుధీర్‌ కమిటీ నివేదికకు ఆమోదం
  • ఆదిలాబాద్‌ జిల్లాలో సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా పునరుద్ధరించాలంటూ కేంద్రాన్ని కోరుతూ లేఖ రాయాలని నిర్ణయం
  • తెలంగాణ హెరిటేజ్‌ యాక్టు తెచ్చేందుకు నిర్ణయం
  • గతంలో గవర్నర్‌ ఎమ్మెల్సీ కోటా కింద పనిచేసిన బి.రాజేశ్వరరావు, ఫరూఖ్‌ను తిరిగి మరోసారి నియమించాలని నిర్ణయం. ఈ మేరకు గవర్నర్‌కు ప్రతిపాదన పంపాలని తీర్మానం.
     

మరిన్ని వార్తలు