ఓరుగల్లుపై సీఎం ప్రత్యేక దృష్టి

23 Oct, 2017 11:30 IST|Sakshi

ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి

హన్మకొండ: ఉద్యమంలో వెన్నంటి ఉన్న ఉమ్మడి ఓరుగల్లు అభివృద్ధిపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రత్యేక దృష్టి సారించారని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం జరిగిన కాకతీయ టెక్స్‌టైల్స్‌ పార్కు శంకుస్థాపన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అభివృద్ధిలో జిల్లాను రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వస్త్ర పరిశ్రమగా విరాజిల్లిన ఆజంజాహి మిల్లు తెరిపించడానికి అఖిలపక్షాన్ని ఏర్పాటు చేసి తాను పోరాడానని గుర్తు చేశారు. అప్పటి ప్రధాన మంత్రి పి.వి నరసింహారావును కలిసి మిల్లును తెరిపించాలని కోరినా స్పందించలేదని ఆందోళన వ్యక్తం చేశారు.

ఆజాంజాహి మిల్లు మూతతో ఇక్కడి నేతన్నలు సూరత్, షోలాపూర్, బీవండి వంటి ప్రాంతాలకు వలస వెళ్లారన్నారు. అక్కడ చేనేత కార్మికులు గడుపుతున్న దుర్భర జీవితాలకు చలించిన సీఎం కేసీఆర్‌ ఆజాంజాహి మిల్లు స్థానంలో దేశంలోనే అతిపెద్ద కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేయాలనే నిర్ణయానికి వచ్చారన్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి అంకురార్పరణ చేశారన్నారు. వరంగల్‌లో ఆగ్రోబేస్‌డ్‌ ఇండస్ట్రీని, ఐఐఎం విద్యా సంస్థను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను కోరారు.

ఇది చారిత్రక దినం : స్పీకర్‌ సిరికొండ
కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు శంకుస్థాపన చేసుకోవడం చారిత్రక దినమని స్పీకర్‌ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. తాను స్పీకర్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొనడం తన అదృష్టమన్నారు. పూర్వ వరంగల్‌ జిల్లాను, వరంగల్‌ నగరాన్ని సీఎం కేసీఆర్‌ అన్ని రంగాల్లో అభివృద్ధి వైపు నడిపిస్తున్నారన్నారు.

మరిన్ని వార్తలు