ఆర్టీసీ సమ్మె: కేసీఆర్‌ సరికొత్త వ్యూహం

10 Oct, 2019 15:31 IST|Sakshi

ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంపు

ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేసే వ్యూహం

సాక్షి, హైదరాబాద్‌: సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను ఒంటరి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం వ్యూహాలు పన్నుతోంది. ప్రభుత్వ ఉద్యోగ సంఘాల మద్దతు ఆర్టీసీ కార్మికులకు దక్కకుండా పావులు కదిపింది. ఇందులోభాగంగా ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో కార్యాలయానికి వెళ్లకముందే.. ప్రభుత్వ ఉద్యోగులను ప్రగతి భవన్‌కు పిలుపించుకుంది. ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను టీఎన్జీవో నేతలు కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి తీపికబురు అందించారు. ఉద్యోగులకు కరువుభత్యం (డీఏ)ను 3.5శాతం పెంచుతున్నట్టు ప్రకటించారు. ఉద్యోగులను ప్రభుత్వం వైపు తిప్పుకునేందుకే కేసీఆర్‌ ఇలా వ్యూహరచన చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

సాయంత్రం 4 గంటలకు భవిష్యత్‌ కార్యాచరణ
మరోవైపు తాము చేస్తున్న పోరాటానికి, సమ్మెకు మద్దతునివ్వాల్సిందిగా కోరుతూ ఆర్టీసీ జేఏసీ నేతలు టీఎన్జీవో కార్యాలయానికి చేరుకున్నారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు వీలుగా తమ సమ్మెకు మద్దతునివ్వాలని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలను ఆర్టీసీ జేఏసీ కోరుతోంది. తమ సమస్యలు, న్యాయమైన డిమాండ్లపై ఆర్టీసీ జేఏసీ తరఫు న్యాయవాది హైకోర్టుకు వివరించారని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి అన్నారు. సమ్మె యథావిధిగా కొనసాగుతుందని అన్నారు. సాయంత్రం 4గంటల తర్వాత భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.

>
మరిన్ని వార్తలు