తమిళనాడుకు తాగునీరు

6 Mar, 2020 02:11 IST|Sakshi
సీఎం కేసీఆర్‌కు వినతిపత్రం అందజేస్తున్న తమిళనాడు మంత్రులు జయకుమార్, ఎస్పీ వేలుమణి

ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించాక కేసీఆర్‌ సూత్రప్రాయ అంగీకారం

తమ రాష్ట్రానికి తాగునీటిని విడుదల చేయాలని తమిళనాడు విజ్ఞప్తి

సీఎంతో తమిళనాడు మంత్రుల బృందం ప్రత్యేక భేటీ

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో సంప్రదింపులు జరిపిన అనంతరం తమిళనాడుకు తాగునీరు సరఫరా చేసేందుకు రాష్ట్ర సీఎం కేసీఆర్‌ సూత్రప్రాయంగా అంగీకరించారు. గురువారం ప్రగతిభవన్‌లో తమిళనాడు మంత్రులు సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యి తమ రాష్ట్రానికి తాగునీరు ఇవ్వాలని అభ్యర్థించారు. వారి అభ్యర్థనపై కేసీఆర్‌ స్పందిస్తూ.. ఈ విషయంపై ఏపీ సీఎంతో కూడా సంప్రదింపులు జరపాల్సి ఉన్నందున.. తమిళనాడు ముఖ్యమంత్రి నుంచి అధికారికంగా ఇరు రాష్ట్రాలకూ లేఖలు రాయాలని వారికి సూచించారు. అనంతరం మూడు రాష్ట్రాల అధికారులు, నిపుణుల స్థాయిలో సమావేశం జరపాలని.. ఈ సమావేశంలో చర్చిం చిన అంశాల ఆధారంగా ఒక నివేదిక రూపొం దించాలని తెలిపారు. అనంతరం అధికారుల స్థాయిలో ఏకాభిప్రాయం వచ్చిన తర్వాత తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

తద్వారా పరస్పర సహకారంతో రాష్ట్రాలు ఏం సాధించ గలుగుతాయో దేశానికి వెల్లడవుతుందన్నారు. తాగునీటి సమస్య విషయంలో పొరుగు రాష్ట్రాలు ఉదారంగా వ్యవహరించాలని అన్నారు. గతంలో ఇదే విషయాన్ని నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రస్తావించానని చెప్పారు. తమిళనాడు తాగునీటి సమస్య అంశాన్ని కూడా టీఆర్‌ఎస్‌ ఎంపీలు ఒకటి రెండు పర్యాయాలు లోక్‌సభలో ప్రస్తావించిన విషయాన్ని కేసీఆర్‌ గుర్తు చేశారు. తాగునీటి విషయంలో తమిళనాడు ఎదుర్కొంటున్న సమస్యపై దేశం మొత్తం సిగ్గుపడాలన్నారు. దేశంలో 70వేల టీఎంసీల నీరు అందుబాటులో ఉండగా, సాగునీటికి కేవలం 30 వేల టీఎంసీలు మాత్రమే అవసరమవుతాయని, మరో 10 వేల టీఎంసీలతో దేశ తాగునీటి అవసరాలు తీర్చ వచ్చని కేసీఆర్‌ అన్నారు. మిగతా అన్ని విషయాల కంటే తాగునీటి అంశంపైనే పోరాడేం దుకు ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేసుకోవాలని ప్రతినిధుల బృందానికి సూచించారు. 

దేశం అర్థం చేసుకున్నప్పుడే పరిష్కారం..
తమిళనాడు తాగునీటి అవసరాలను దేశం మొత్తం అర్థం చేసుకున్నప్పుడే సమస్యకు పరిష్కారం లభిస్తుందని కేసీఆర్‌ పేర్కొన్నారు. నిజమైన భారతీయుడిగా పొరుగు రాష్ట్ర సమస్యను పరిష్కరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. తమిళనాడు ప్రతినిధుల బృందం చేసిన విజ్ఞప్తికి సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌తో కేసీఆర్‌ ఫోన్‌లో మాట్లాడారు. తాగునీటి విడుదల చేసేందుకు తాను చేసిన సూచనలను కేసీఆర్‌ వివరించారు. తమిళనాడు తాగునీటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, ఆ రాష్ట్రానికి సహకారం అందించాలని కోరారు.

తమిళనాడు మంత్రులు ఎస్‌పీ వేలుమణి, డి.జయకుమార్, ప్రజా పనుల విభాగం అధికారులు డాక్టర్‌ కె.మణివాసన్, సలహాదారు డాక్టర్‌ ఎం.షీలా ప్రియ సీఎం కేసీఆర్‌ను కలిసిన ప్రతినిధుల బృందంలో ఉన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర మంత్రులు కె.తారకరామారావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రజత్‌ కుమార్, ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు ఎస్‌.నర్సింగరావు, స్మితా సభర్వాల్, సీఎం ఓఎస్‌డీ శ్రీధర్‌రావు దేశ్‌పాండే, ఈఎన్‌సీ మురళీధర్, నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా