ఆదివాసీలకు సీఎం వరాలు

9 Oct, 2014 02:04 IST|Sakshi
ఆదివాసీలకు సీఎం వరాలు

ఆసిఫాబాద్/కెరమెరి : ఆదివాసీలకు సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. బుధవారం కెరమెరి మండలం జోడేఘాట్‌లో నిర్వహించిన భీమ్ 74వ వర్ధంతి పురస్కరించుకొని ఏర్పాటు చేసిన దర్బార్‌లో మాట్లాడుతూ గిరిజనుల సర్వతోముఖాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. గత శాసనసభ ఎన్నికల్లో జిల్లా ప్రజలు టీఆర్‌ఎస్‌ను ఆదరించారని, అందుకు తాను రుణపడి ఉంటానన్నారు. ఈ సందర్భంగా వరాల జల్లు కురిపించారు. జోడేఘాట్‌ను చారిత్రాత్మక ప్రదేశంగా తీర్చిదిద్ది, పర్యాటక కేంద్రంగా తయారు చేస్తానన్నారు. వంద ఎకరాల్లో దీన్ని ఏర్పాటు చేసి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావాడానికి చర్యలు తీసుకుంటామన్నారు.

కెరమెరి జోడేఘాట్ వరకు వచ్చే వర్ధంతి లోపు రెండు వరుసల రోడ్డు నిర్మాణం చేపడతామని, భీమ్ మనవడు సోనేరావును గత ప్రభుత్వాలు ఇప్పటి వరకు విస్మరించాయన్నారు. ఎన్నికల ముందు నుంచి పార్టీకి ఎంతో పనిచేసిన భీమ్ మనవడి కుటుంబానికి రూ.10 లక్షలు నగదు అందజేస్తామని, సోనేరావు కుమారుడు, కుమార్తెకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆపారమైన అటవీ ప్రాంతం ఉన్న ఆదిలాబాద్ జిల్లాను తెలంగాణ కాశ్మీర్‌గా తయారు చేస్తానని, ఆదివాసులను విద్య,వైద్యం, ఉద్యోగ, ఉపాది  తదితర రంగాల్లో ముందుంచుతామన్నారు. ఆసిఫాబాద్‌లో పది పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేస్తామని, జిల్లాను రెండు భాగాలుగా విభజించి, ఆదిలాబాద్ కాకుండా కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాకు కొమురం భీమ్ జిల్లాగా నామకరణం చేస్తామని ప్రకటించారు.
 
జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ
కొత్త జిల్లాలోనే గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తానని స్పష్టం చేశారు. ఆదివాసీ మరణాలు అరికట్టేందుకు రాష్ట్రంలో 500 కళాజాత బృందాలతో ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని, వీటిలో 20 కళాజాత బృందాలను జిల్లాకు చెందిన వారిని ఎంపిక చేసి వారికి ఉద్యోగ భద్రత క ల్పిస్తామన్నారు. హైదరాబాద్‌లోని కార్పోరేట్ ఆసుపత్రి బృందాలచే గిరిజన గూడాలను  సందర్శించి, వారికి పౌష్టికాహారం, ఆరోగ్య పరిరక్షణపై అవగాహన కల్పిస్తామన్నారు. కొమురం భీమ్ తన గుండెల్లో ఉంన్నాడని, అందుకు అన్ని విధాల సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

500 జనాభా ఉన్న ప్రతి గూడెం, తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, ఇందుకోసం రూపకల్పన చేస్తున్నట్లు పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బంజారా హిల్స్‌లో బంజారాలు లేరని, అక్కడ ఎంత ఖర్చయినా బంజారా, ఆదివాసీ భవనాన్ని నిర్మింస్తామన్నారు. ప్రస్తుతం కేవలం కొమురం భీమ్ అభిమానం కోసమే జోడేఘాట్‌కు వచ్చానని, త్వరలో జిల్లాకు వచ్చి, రెండు మూడు రోజులు ఇక్కడే పర్యటించి, అవసరమనుకుంటే ఆదివాసీ గూడాలను స్వయంగా పర్యటిస్తానన్నారు.

మరిన్ని వార్తలు