అధినేత మనసులో ఏముందో!

17 Dec, 2017 13:53 IST|Sakshi

బొగ్గు గని కార్మికుల భవిష్యత్తుపై ముఖ్యమంత్రి ఆలోచన ఏంటి? సంస్థ భవితవ్యంపై ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇచ్చిన హామీలపై గందరగోళం నెలకొన్న తరుణంలో అధినేత మనసులో ఏముంది?  ఎందుకని టీబీజీకేఎస్‌ కమిటీ కూర్పును జాప్యం చేస్తున్నారు? మాట్లాడుకుందాం రండీ! అంటూ పిలిచిన ముఖ్యమంత్రి కార్మిక నేతలకు అపాయింట్‌ మెంట్‌ ఇవ్వడానికి ఎందుకు సుముఖత చూపడం లేదు? సింగరేణి కార్మికులు, నాయకుల మెదళ్లను తొలుస్తున్న ప్రశ్నలివి. గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు జరిగి ఇప్పటికే రెండు నెలలు దాటినా ఇంకా గుర్తింపు సంఘం కమిటీ కూర్పు పూర్తి కాకపోవడం అయోమయానికి దారితీస్తోంది. 

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్‌: తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తి స్థాయి కమిటీని నియమించాలని భావించిన ముఖ్యమంత్రి ఆ సంఘం నేతల్ని హైదరాబాద్‌ రమ్మని ఆహ్వానించారు. వారం రోజులుగా టీబీజీకేఎస్‌ నేతలు సీఎంఓ కార్యాలయం నుంచి ఎప్పుడు పిలుపు వస్తుందా? అని ఎదురుతెన్నులు చూస్తున్నారు. గుర్తింపు కార్మిక సం ఘం ఎన్నికలు జరిగి రెండు నెలలు దాటింది. ఎట్టకేలకు ఈ నెల 5న «చీఫ్‌ లేబర్‌ కమిషనర్‌ (సీఎల్‌సీ) నుంచి సింగరేణి సీఎండీకి గుర్తింపు యూనియన్‌కు సంబంధించిన లేఖ అందింది. అయినా టీబీజీకేఎస్‌ రాష్ట్ర, ఏరియాల కమిటీలు ఎంపికపై ఇప్పటివరకు స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలో ఇటీవల కరీంనగర్‌ పర్యటన సందర్భంగా సీఎం సైతం ‘మాట్లాడుకుందాం రండి’ అని చెప్పడంతో కమిటీల ఎంపిక ఇక కొలిక్కి వచ్చినట్లేనని అనుకున్నారు. కాని వాస్తవ పరిస్థితులను బట్టి చూస్తే ఇప్పట్లో కమిటీల కూర్పు జరిగే అవకాశాలు కనిపించడం లేదు. 

రాజకీయ సమీకరణాలతోనే ఆలస్యం..!
టీబీజీకేఎస్‌ కమిటీల ఏర్పాటుకు రాజకీయ జోక్యం ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. గుర్తిం పు కార్మిక సంఘం ఎన్నికలకు ముందు చోటు చేసుకున్న కొన్ని రాజకీయ పరిణామాలు ఈ అనుమానాలకు బలాన్నిస్తున్నాయి. గతంలో ఐఎన్‌టీయూసీలో జాతీయ నేతగా పని చేసిన మాజీ ఎమ్మెల్సీ బి.వెంకట్రావ్‌ టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు టీబీజీకేఎస్‌ అధ్యక్ష బాధ్యతలు అప్పగించారు. ఎంపీ కవిత గౌరవాధ్యక్షులుగా ఉన్నారు. ఆయనతోపాటు ఏరి యాల వారీగా కొందరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరారు. మరోవైపు మాజీ ఎంపీ, ప్రభుత్వ సలహాదారు గడ్డం వివేకానంద టీఆర్‌ఎస్‌లో చేరా రు. వీరి రాకతో రాజకీయ సమీకరణాల్లో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. వీరితో పా టు మరికొన్ని జాతీయ కార్మిక సంఘాలకు చెం దిన వారు, టీడీపీ అనుబంధ టీఎన్‌టీయూసీ నుంచి ఒకరిద్దరు నేతలు టీబీజీకేఎస్‌లో చేరా రు. ఇలా పలు పార్టీలు, పలు కార్మిక సంఘాల నుంచి నేతల తాకిడి నేపథ్యంలో రాజకీయ జోక్యం కమిటీల కూర్పునకు ప్రతిబంధకంగా మారిందా అనే అనుమానాలకు తావిస్తోంది. 

మాజీ నాయకుల దూరం?
సింగరేణి గుర్తింపు ఎన్నికల్లో అధికార టీబీజీకేఎస్‌ గెలుపుకోసం సార్వత్రిక ఎన్నికల స్థాయిలో కష్టపడాల్సి వచ్చింది. వారసత్వ ఉద్యోగాలపై స్పష్టత లేకపోవం దీనికి ఓ కారణమైతే... గత నాలుగేళ్లు సింగరేణిలో పాలన సాగించిన గుర్తిం పు సంఘం నేతల వైఖరి మరో కారణం. మెడికల్‌ అన్‌ఫిట్‌ల విషయంతో పాటు కార్మికుల పక్షాన నిలవాల్సిన నాయకులు కొందరు అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారినట్లు అధిష్టానా నికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ విషయాన్ని ఎన్ని కల ప్రచార సభల్లో ఎంపీ బాల్క సుమన్‌తో పాటు సీఎంఓ నుంచి పరిశీలకులుగా వచ్చి న నేతలు కూడా ఒప్పుకుంటూ... ‘టీబీజీకేఎస్‌ గెలిచిన తరువాత కొత్త కమిటీని మేమే నియమిస్తాం’ అని స్పష్టం చేశారు. అలాగే టీబీజీకేఎస్‌ నాయకులను ఎన్నికల ప్రచార సభల్లో కూడా కనిపించకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. అంటే ప్రస్తుత టీబీజీకేఎస్‌ నేతల ప్రమేయం లేకుండా ఎంపీ కవిత, ప్రభుత్వ సలహాదారు వివేక్, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్‌లతో పాటు ముఖ్యమైన ఎమ్మెల్యేల కనుసన్నల్లోనే కొత్త కమిటీ కూర్పు ఉంటుందని అప్పుడే స్పష్టమైంది. వీరినుంచి సూచనలు తీసుకొని స్వయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తింపు సంఘం కార్యవర్గానికి తుదిరూపం ఇచ్చే అవకాశం ఉంది. 

నెలాఖరుకల్లా స్పష్టత?
ఎప్పుడెప్పుడా అని నిరీక్షిస్తున్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం పూర్తిస్థాయి కమిటీల ఎంపిక ప్రక్రియ ఈ నెలఖారు దాకా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 19వ తేదీ వరకు ప్రపంచ తెలుగు మహాసభలు పూర్తి కానున్నాయి. డిసెంబర్‌ మూడో వారం వస్తుంది కనుక మరో రెండుమూడు రోజుల పాటు కమిటీల కూర్పుపై కసరత్తు చేసి చివరి వారంలో అధికారికంగా ప్రకటించే సూచనలు కనిపిస్తున్నాయని ఓ ఎంపీ తెలిపారు. కమిటీల ఎంపికపై ముఖ్యమంత్రి వద్ద స్పష్టమైన జాబితా ఉందని, కేవలం తమ ముందు ప్రతిపాదనలు పెట్టి ఆయా కమిటీలను స్వయంగా కేసీఆర్‌ ప్రకటించే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. కాగా కారుణ్య నియామకాలు ఇతరత్రా హక్కుల అమలు కోసం పడిగాపులు కాస్తున్న కార్మికులు మాత్రం ఇంకా కలవరానికి గురవుతున్నారు. కమిటీలు ఇలా జాప్యం జరుగుతుంటో తమ సమస్యలు సంగతి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సీఎం కార్యాలయం నుంచి అందిన ఆదేశాల పుణ్యమా అని టీబీజీకేఎస్‌కు చెందిన ఏ నాయకుడు జీఎం కార్యాలయాల వైపు కన్నెత్తి చూడడం లేదని, చిన్నచిన్న పనులు సైతం పెండింగ్‌లో పడిపోతున్నాయని అంటున్నారు. ఇప్పటికైనా అధినేత తన మనసు విప్పి తమకు న్యాయం చేసే దిశగా కమిటీల కూర్పునకు తుది రూపం ఇస్తే బాగుంటుందని కార్మికవర్గం కోరుతోంది. 

మరిన్ని వార్తలు