వారంలో జిల్లాకు రానున్న సీఎం కేసీఆర్‌

10 Oct, 2019 09:14 IST|Sakshi
డబుల్‌ బెడ్రూం ఇళ్లను ప్రారంభిస్తున్న సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

దేశానికే ‘డబుల్‌’ ఆదర్శం

అలీసాగర్‌ నీటి రివర్స్‌ పంపింగ్‌కు చర్యలు

స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి 

సాక్షి, బాన్సువాడ: రాష్ట్ర ప్రభుత్వం నిర్మించి ఇస్తున్న డబుల్‌ బెడ్రూం ఇళ్లు యావత్‌ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. తన సొంతూరు పోచారంలో నిర్మించిన డబుల్‌ బెడ్రూం ఇళ్లను బుధవారం ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. పేదవారి ఆత్మగౌరవం కాపాడటానికి ప్రభత్వం ఖర్చుకు వెనుకాడకుండా డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తుందన్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 6వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు నిర్మించామని, 15 వేల ఇళ్లు నిర్మించడమే లక్ష్యమని స్పీకర్‌ అన్నారు. బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్‌ శివారులో 500 ఇళ్లు పూర్తిచేసి మరో 500 ఇళ్ల నిర్మాణం పనులు ప్రారంభించామన్నారు. పూర్తయిన ఇండ్లను త్వరలోనే సీఎం  కేసీఆర్‌తో కలిసి ప్రారంభించి అర్హులైన వారికి పంపిణీ చేస్తామన్నారు. 

త్వరలోనే అలీసాగర్‌ రివర్స్‌ పంపింగ్‌.. 
వారం రోజుల్లో సీఎం కేసీఆర్‌ నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. శ్రీరాం సాగర్‌లోకి రివర్స్‌ పంపింగ్‌ ద్వారా  కాళేశ్వరం నీళ్లు వచ్చాయన్నారు. అలాగే అలీసాగర్‌ నీటిని రివర్స్‌ పంపింగ్‌ ద్వారా నిజాంసాగర్‌ 28 డిస్ట్రిబ్యూటరీ కెనాల్‌కు తీసుకురావడానికి సుమారు రూ.150కోట్లతో సీఎం కేసీఆర్‌ భూమిపూజ చేస్తారన్నారు. నాన్‌ కమాండ్‌ ఏరియాలో ఉన్న చందూర్, జాకోరాల్లో ఎత్తిపోతల పథకాలకు భూమిపూజ చేయడంతో పాటు ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పట్టాలను సీఎం కేసీఆర్‌ పంపిణీ చేస్తారాన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో రాజేశ్వర్, సర్పంచ్‌ రాధ సాయిరెడ్డి, ఎంపీపీ నీరజారెడ్డి, జెడ్పీటీసీ పద్మా, ఎఎంసీ చైర్మన్‌ నందిని, పోచారం సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, వెంకట్రాంరెడ్డి, మహ్మద్‌ ఎజాస్, మోహన్‌నాయక్, భాస్కర్, శ్రీనివాస్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, నర్సింలు తదితరులు పాల్గొన్నారు. 

శుభాకాంక్షలు తెలిపిన అధికారులు 
పోచారం గ్రామంలోని స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి నివాసానికి  బుధవారం కలెక్టర్‌ సత్యనారాయణ, ఎస్పీ శ్వేతారెడ్డి, జిల్లా అసిస్టెంట్‌ కలెక్టర్‌ తేజస్‌ నందలాల్‌ పవర్‌ మర్యాద పూర్వకంగా వచ్చారు. దసరా పండుగ సందర్బంగా జమ్మిఆకులు(బంగారం) పెట్టి  శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ ఆర్డీవో రాజేశ్వర్, తహసీల్దార్‌ సుదర్శన్‌ ఉన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు