ప్రగతి సింగారానికి వచ్చిన సీఎం కేసీఆర్‌

15 Aug, 2019 10:28 IST|Sakshi

సాక్షి, వరంగల్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ బుధవారం వరంగల్‌ రూరల్‌ జిల్లా శాయంపేట మండలం ప్రగతి సింగారానికి వచ్చారు. పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తండ్రి మల్లారెడ్డి అనారోగ్యంతో బాధపడుతూ ఈ నెల 4న మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ మేరకు బుధవారం దశ దినకర్మ జరగగా సీఎం కేసీఆర్‌ వచ్చారు. ఈ మేరకు మల్లారెడ్డి చిత్రపటం వద్ద పూలు వేసి శ్రద్ధాంజలి ఘటించడంతో పాటు ధర్మారెడ్డి, ఆయన కుటుంబీకులను ఓదార్చారు. ఆ తర్వాత మల్లారెడ్డి అనారోగ్యంపై ఆరా తీశారు. అనంతరం ధర్మారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి సీఎం కేసీఆర్, మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి భోజనం చేశారు. 

గంట పాటు ప్రజాప్రతినిధులతో భేటీ
చల్లా ధర్మారెడ్డి ఇంట్లో ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. భోజనం చేసిన అనంతరం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలను లోపలకు పిలిచారు. ఈ సందర్భంగా జిల్లాలో అభివృద్ధి పనులపై సుమారు గంట పాటు చర్చించారని సమాచారం. కాళేశ్వరం ద్వారా త్వరలో సాగు నీరు వస్తుందని.. దీంతో వరంగల్‌ దశ మారుతుందని సీఎం ప్రజా ప్రతినిధులకరు చెప్పినట్లు తెలిసింది. కాళేశ్వరం, దేవాదుల ద్వారా సాగు విస్తీర్ణం పెరిగి రైతులు ఆనందం వ్యక్తం చేస్తారని అన్నారు. కాళేశ్వరం ద్వారా ఒక్కో నియోజకవర్గంలో ఎంత సాగు అవుతుందని వివరించారు. టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన సీనియర్‌ నాయకులు గుడిమల్ల రవికుమార్, మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, మాజీ జడ్పీ చైర్మన్‌ సాంబారి సమ్మారావు, టీఆర్‌ఎస్‌ నాయకురాలు హరి రమాదేవిని సైతం లోపలకు పిలిపించి కేసీఆర్‌ మాట్లాడారు.

భారీ భద్రత
ప్రగతి సింగారంలో మల్లారెడ్డి దశ దినకర్మను చల్లా ధర్మారెడ్డి, రఘుపతిరెడ్డి, కుటుంబ సభ్యులు నిర్వహించారు. ఆ తర్వాత ఆవరణను సీఎం ప్రత్యేక సెక్యూరిటీ అదుపులోకి తీసుకుంది. వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ రవీందర్‌ ఆధ్వర్యాన డీసీపీ కే.ఆర్‌.నాగరాజు, ఏసీపీ సునీతామోహన్‌తో పాటు 450 మంది సిబ్బంది, 15 మంది సీఐలు, 10 మంది ఏసీపీలతో ముడంచెల భద్రత ఏర్పాటు చేశారు. బంధువులందరినీ ఒక పక్కకు పంపించి రోప్‌ను కట్టారు. తొలుత మీడియా వారిని సైతం బయటకు పంపించారు. ఈ విషయమై జర్నలిస్టులు కలెక్టర్, కమిషనర్‌తో చర్చించడంతో ప్రత్యేక రోప్‌ను ఏర్పాటు చేసి బంధువుల పక్కన ఉండి కవరేజీ చేసుకునేలా అవకాశం కల్పించారు. 

1.52 గంటల పాటు ప్రగతి సింగారంలో
గంట యాభై రెండు నిముషాల పాటు ప్రగతి సింగారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌ రావు ఉన్నారు. మధ్యాహ్నం 1.50గంటలకు ప్రత్యేక హెలీక్యాప్టర్‌లో ప్రగతి సింగారానికి ఆయన చేరుకున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక బస్సులో మధ్యాహ్నం 2.02 గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటికి వచ్చారు. మధ్యాహ్నం 3.29గంటలకు చల్లా ధర్మారెడ్డి ఇంటి నుంచి బయటకు వచ్చిన కేసీఆర్‌ 3.38గంటలకు హెలీప్యాడ్‌కు చేరుకున్నాడు. అక్కడ 3.42గంటలకు హెలీకాప్టర్‌లో హైదరాబాద్‌కు బయలుదేరారు. 

మరిన్ని వార్తలు