కరీంనగర్‌లో సీఎం కేసీఆర్‌

13 Feb, 2020 08:41 IST|Sakshi
బుధవారం రాత్రి ఉత్తర తెలంగాణ భవన్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

సాక్షి, కరీంనగర్‌: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు మరోసారి కరీంనగర్‌కు విచ్చేశారు. గత సంవత్సరం డిసెంబర్‌ 30న వేములవాడ రాజన్నను దర్శించుకొని మిడ్‌మానేరు రిజర్వాయర్‌కు పూజలు చేసి ఇక్కడికి వచ్చిన కేసీఆర్‌ 40 రోజుల తరువాత బుధవారం రాత్రి మరోసారి తనకిష్టమైన కరీంనగర్‌కు వచ్చారు. గురువారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయంలో పూజలు, కాళేశ్వరం ప్రాజెక్టులోని ప్రధానమైన లక్ష్మీ బ్యారేజీలను సీఎం సందర్శించనున్నారు. ఇందుకోసం హైదరాబాద్‌ నుంచి బుధవారం రాత్రి రోడ్డు మార్గంలో బయలుదేరి కరీంనగర్‌ వచ్చిన ముఖ్యమంత్రి తీగలగుట్టపలి్లలోని నివాసానికి చేరుకున్నారు. రాత్రి ఇక్కడే బస చేసిన సీఎం గురువారం ఉదయం కాళేశ్వరం బయలుదేరనున్నారు.

ఇదీ షెడ్యూల్‌
కరీంనగర్‌ కలెక్టరేట్‌లోని హెలిప్యాడ్‌ నుంచి ఉదయం 9 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా ఆకాశమార్గంలో కాళేశ్వరం బయలుదేరుతారు. ఉదయం 9.40 గంటలకు కాళేశ్వరంలోని ముక్తేశ్వర స్వామిని దర్శించుకోనున్నారు. అక్కడే ఉన్న గోదావరి ఘాట్‌ను సందర్శిస్తారు. ముక్తేశ్వర స్వామి దర్శనం తరువాత లక్ష్మీ బ్యారేజ్‌(మేడిగడ్డ రిజర్వాయర్‌ను సందర్శించనున్నారు. అక్కడే మధ్యాహ్న భోజనం పూర్తిచేసి మధ్యాహ్నం 2 గంటలకు కరీంనగర్‌కు హెలికాప్టర్‌ ద్వారా పయనం కానున్నారు. 2.40 గంటలకు తీగలగుట్టపల్లి నివాసానికి చేరుకొంటారు. కాళేశ్వరం మేడిగడ్డ రిజర్వాయర్‌ విశేషాలను తెలియజేసేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉంది. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులతో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమావేశం కానున్నట్లు సమాచారం. సాయంత్రంలోగా హెలికాప్టర్‌ ద్వారా గానీ రోడ్డు మార్గంలో గానీ తిరిగి హైదరాబాద్‌ ప్రగతిభవన్‌కు బయలుదేరనున్నారు.  

స్వాగతం పలికిన మంత్రి, అధికారులు
కరీంనగర్‌కు చేరుకున్న కేసీఆర్‌కు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్‌ శశాంక, ఎమ్మెల్యే రవిశంకర్, జెడ్పీ చైర్‌పర్సన్‌ విజయ, మేయర్‌ సునీల్‌రావు, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌ సత్యనారాయణ తదితరులు స్వాగతం పలికారు.

కాళేశ్వరం నుం‍చి కరీంనగర్‌కు
రాష్ట్ర ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్‌రావు కాళేశ్వరం పర్యటనలో భాగంగా బుధవారం రాత్రి కరీంనగర్‌కు చేరుకున్నారు. సీఎం టూర్‌కు  సంబంధించిన ఏర్పాట్లపై అంతకుముందు కలెక్టర్‌ కె.శశాంక జిల్లా అధికారులతో సమీక్షించారు. కరీంనగర్‌ పట్టణ ప్రవేశం నుంచి తీగలగుట్టపల్లి వరకు రోడ్లు శుభ్రంగా ఉంచాలని మున్సిపల్‌ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కాన్వాయితో డాక్టర్ల బృందాన్ని పంపించాలని సూచించారు. కాన్వాయిలో, కలెక్టరేట్‌ హెలిప్యాడ్‌లో, తీగలగుట్టపల్లిలోని ఉత్తర తెలంగాణ భవన్‌ వద్ద అగ్నిమాపక వాహనాలను సిద్ధంగా ఉంచామన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా నగరంలో నిరంతర విద్యుత్‌ సరఫరా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. తీగలగుట్టపల్లిలోని ఉత్తరతెలంగాణ భవన్‌లో ఏర్పాట్ల పనులను మేయర్‌ సునీల్‌రావు పర్యవేక్షించారు. నగరంలోని పలు ప్రదేశాల్లో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. తీగలగుట్టపలి్లలోని ఉత్తర తెలంగాణ భవన్, పరిసర ప్రాంతాల్లో డాగ్‌స్క్వాడ్‌, బాంబ్‌స్క్వాడ్‌తో తనిఖీలు చేశారు. 

మరిన్ని వార్తలు