మళ్లీ ఆశలు 

22 Feb, 2019 07:18 IST|Sakshi

సాక్షి, కొత్తగూడెం: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధిపై జిల్లా ప్రజలు మరోసారి ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేడు శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత మూడు బడ్జెట్లలో భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయం మాస్టర్‌ ప్లాన్‌ కోసం రూ.100 కోట్లు ప్రకటించింది. కానీ.. ఒక్క పైసా కూడా విడుదల చేయలేదు. దీంతో ఈ ప్రాంతవాసులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఈసారైనా చిత్తశుద్ధితో వ్యవహరిస్తారని ఆశిస్తున్నారు. ఈ ప్రభావం గత శాసనసభ ఎన్నికల్లోనూ చూపింది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ భద్రాచలం నియోజకవర్గంలో మొదటిసారి పాగా వేయాలని ఆశించినా.. నెరవేరలేదు. భద్రాద్రి రామాలయ అభివృద్ధిని పట్టించుకోకపోవడంపై స్థానిక ఓటర్లు వ్యతిరేకత చూపారని పలువురు పేర్కొంటున్నారు.

నయా పైసా ఇవ్వలేదు  
భద్రాద్రి ఆలయ అభివృద్ధి కోసం ఉద్దేశించిన మాస్టర్‌ ప్లాన్‌ అమలు కోసం ప్రభుత్వం నయా పైసా ఇవ్వలేదు. దీంతో ఆలయ మాస్టర్‌ప్లాన్‌ ప్రక్రియ ఒక్క అంగుళం కూడా ముందుకు కదల్లేదు. మరోవైపు భద్రాచలం చుట్టూ ఉన్న గ్రామాలన్నీ ‘పోలవరం ప్రాజెక్ట్‌’ విలీన మండలాల ద్వారా ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాయి. భద్రాచలం పట్టణం నుంచి నియోజకవర్గంలోని మిగిలిన మండలాలకు వెళ్లాలంటే ఆంధ్రప్రదేశ్‌లోని సరిహద్దులను రెండుచోట్ల దాటాల్సి వస్తోంది. దీంతో భద్రాచలం పట్టణం అభివృద్ధికి ఆస్కారం లేకుండా పోయింది. అభివృద్ధి నిలిచిపోవడంతో పాటు, పట్టణంలోని చెత్తను, వ్యర్థపదార్థాలను డంప్‌ చేసేందుకు అవసరమైన డంపింగ్‌యార్డ్‌కు సైతం స్థలం లేదు. భద్రాచలం పట్టణాన్ని గ్రామపంచాయతీ, మున్సిపాలిటీ కాకుండా త్రిశంకుస్వర్గంలో ఉంచడంతో పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా తయారైంది.

అభివృద్ధిపై దృష్టి పెట్టాలి  
పట్టణ అభివృద్ధికి ఆయువుపట్టుగా ఉన్న ఎటపాక, కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తపట్నం గ్రామాలు సైతం ఆంధ్రాలోకి వెళ్లాయి. భద్రాచలం పట్టణాన్ని 2003 సంవత్సరంలో టౌన్‌షిప్‌గా ఏర్పాటుచేశారు. తర్వాత 2005లో మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్‌ చేశారు. దీనిపై కొందరు వ్యక్తులు ఏజెన్సీ చట్టాలకు విరుద్ధమంటూ కోర్టుకు వెళ్లడంతో 2010 మార్చిలో తిరిగి గ్రామ పంచాయతీగా మార్చారు. తాజాగా మళ్లీ మున్సిపాలిటీగా ప్రతిపాదించారు.  అయినా ఇప్పటికీ స్పష్టత లేదు. ఆలయ మాస్టర్‌ ప్లాన్‌తో అమలుతో పాటు పట్టణ అభివృద్ధికి తగిన నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.

కనికరం చూపాలి 
భద్రాచలం అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ మూడు సంవత్సరాలుగా రూ.100 కోట్లు ప్రకటిస్తున్నారు. కానీ నిధులు విడుదల చేయడంలేదు. రాష్ట్ర విభజన, జిల్లా విభజన తర్వా భద్రాచలం పట్టణం అభివృద్ధి పూర్తిగా ఆగిపోయింది. వ్యాపారాలు కూడా మందగించాయి. సామాన్య జీవులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడైనా కనికరం చూపాలి. – పూనాటి నర్సింహారావు, వ్యాపారి 

హామీని నిలబెట్టుకోవాలి 
యాదాద్రిలా భద్రాద్రిని మారుస్తానని, ఇందుకోసం మొదటి విడతగా రూ. 100కోట్లు ఇస్తానని సీఎం కేసీఆర్‌ చెప్పారు. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అన్ని విధాలుగా నష్టపోయిన భద్రాచలాన్ని ఆదుకోవాలి. రామాలయం అభివృద్ధికి కేసీఆర్‌ చొరవ తీసుకోవాలి.   –మంగిపూడి లక్ష్మి, గృహిణి 

మరిన్ని వార్తలు