బంగారు తెలంగాణ బాటలు కనిపిస్తలేవా?

17 Nov, 2017 02:51 IST|Sakshi

శాసనసభలో కాంగ్రెస్‌పై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం

సాక్షి, హైదరాబాద్‌: ‘బంగారు తెలంగాణ’పై గురువారం శాసనసభలో ఆసక్తికర చర్చ జరిగింది.  గురుకుల పాఠశాలలపై చర్చ సందర్భంగా అధికార పార్టీ సభ్యుడు వివేకానంద మాట్లాడారు. తన ప్రసంగంలో పలుమార్లు ‘బంగారు తెలంగాణ’పదాన్ని ఉచ్ఛరించారు. అనంతరం మాట్లాడిన కాంగ్రెస్‌ సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. ‘‘ఇందాక వివేకానంద తన ప్రసంగంలో 20 సార్లు బంగారు తెలంగాణ పదాన్ని వాడారు. అసలు ఈ బంగారు తెలంగాణ అంటే ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు.  ఇదో మిలియన్‌ డాలర్ల ప్రశ్నగా మారింది..’’అని వ్యాఖ్యానించారు. అసలు మంచి విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు, రైతులకు కనీస మద్దతు ధర ఉండటమే తన దృష్టిలో బంగారు తెలంగాణ అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్‌ జోక్యం చేసుకొని ‘‘బంగారు తెలంగాణ వారాలు, నెలల్లో ఆవిష్కృతం కాదు.. దాని కోసం నిర్మాణాత్మక ప్రస్థానాన్ని ప్రారంభించాం. కాంగ్రెస్‌ హయాంలో ఏర్పాటు కానన్ని గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసినం.  వారు బంగారు మంచాలేస్తే మేం పీకి పాడుచేసినమా?’’అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు, అప్పులు.. ఇలా కాం గ్రెసోళ్లకు రెండు మూడు అంశాలు ఉన్నాయని, ఎప్పుడు చూసినా వాటినే చెప్తుంటారని, ఈ తీరు చూసి జనం నవ్వుతున్నారన్నారు. వారు రాష్ట్రాన్ని కారు చీకట్లు చేస్తే, తాము వెలుగులు తేలేదా, బంగారు తెలంగాణ దిశగా వేస్తున్న బాటలు కనిపిస్తలేవా? అని ప్రశ్నించారు. రాబోయే రోజుల్లో ప్రతి మండలానికి, రెండు మూడు చొప్పున గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు