విద్యుత్‌ బిల్లు చెల్లించకపోతే వేటే!

1 Aug, 2019 01:32 IST|Sakshi

పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సీఎం హెచ్చరిక 

సాక్షి, హైదరాబాద్‌: ‘గ్రామ పంచాయతీలు, మున్సి పాలిటీలు పెద్ద మొత్తంలో విద్యుత్‌ బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లించకపోవడం దారుణం. ఇప్పటి నుంచి నెలనెలా గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ వంటి సంస్థలు కూడా విద్యుత్‌ బిల్లులు చెల్లించాలి. సకాలంలో కరెంటు బిల్లు కట్టకపోతే గ్రామాల్లో అయితే సర్పంచ్, గ్రామకార్యదర్శి, మున్సిపాలిటీ అయితే చైర్‌పర్సన్, కమిషనర్లపై వేటు తప్పదు. ఇంతకుముందు పేరుకుపోయిన పాత బకాయిలను వన్‌టైం సెటిల్మెంట్‌ కింద ప్రభుత్వమే చెల్లిస్తుంది. విద్యుత్‌ సంస్థల బకాయిలను కూడా జీరో సైజుకు తెస్తాం. భవిష్యత్తులో వాడే విద్యుత్‌కు క్రమం తప్పకుండా బిల్లులు చెల్లించాలి. గ్రామాలు, పట్టణాల్లో వీధి లైట్ల వాడకంలో కూడా క్రమశిక్షణ రావాలి. పగలు లైట్లు వెలగకుండా చూసుకోవాలి’అని సీఎం కేసీఆర్‌ సూచించారు. ప్రభుత్వ శాఖల్లో కూడా క్రమశిక్షణ రావాలని, అనేక ప్రభుత్వ శాఖలు సకాలంలో విద్యుత్‌ బిల్లులు చెల్లించట్లేదని, ఇకపై ప్రభుత్వ శాఖల బిల్లులను ఆయా శాఖలకు కేటాయించే బడ్జెట్‌ నుంచి ఆర్థిక శాఖే నేరుగా చెల్లిస్తుందని చెప్పారు. విద్యుత్‌ శాఖపై బుధవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. 

విద్యుత్‌ సంస్థలది కీలక పాత్ర.. 
తెలంగాణ పురోభివృద్ధిలో విద్యుత్‌ సంస్థలు కీలక పాత్ర పోషించాయని కేసీఆర్‌ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడినప్పుడు తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉండేదని, నేడు దేశానికే మనం ఆదర్శంగా నిలిచామని చెప్పారు. నేడు తెలంగాణలో అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్యుత్‌ కారణంగా పారిశ్రామికాభివృద్ధి సాధ్యమైందన్నారు. ఈ క్రమంలో విద్యుత్‌ సంస్థలు మరింతగా అభివృద్ధి చెందాలని, తెలంగాణ లో కనురెప్ప పాటు కూడా కరెంటు పోకుండా ఉం డేందుకు ప్రభుత్వపరంగా చేయాల్సిందంతా చేస్తా మన్నారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ అవసరాల కోసం వాడే విద్యుత్‌ కోసం ప్రీపెయిడ్‌ మీటర్లు అమర్చాలని ఆదేశించారు. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇచ్చేందుకు ఎత్తిపోతల పథకాలకు విద్యుత్‌ సరఫరా చేయడానికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందన్నారు.  

7 రోజుల పాటు ‘పవర్‌ వీక్‌’ 
‘గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీల్లో తక్షణం చేయాల్సిన పనులకు సంబంధించి ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తుంది. 60 రోజుల పాటు అమలయ్యే కార్యాచరణలో 7 రోజుల పాటు ‘పవర్‌ వీక్‌’ఉంటుంది. ఆ సమయంలో ఒరిగిన విద్యుత్‌ స్తంభాలను, లైన్లను సరిచేయడం, బిల్లులు పెండింగులో లేకుండా చూడటం తదితర పనులు నిర్వహిస్తాం. సదరు గ్రామానికి, పట్టణానికి వీధిలైట్ల కోసం ఎంత కరెంటు అవసరమవుతుంది.. ఎంత బిల్లు వస్తుందనే విషయాలను మదింపు చేయాలి’ అని అధికారులకు సీఎం సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఇతర పట్టణాల్లో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయడానికి స్థలం లేక ఇబ్బందులు వస్తున్నాయని, ఇందుకు పట్టణాలు, నగరాల్లో చేసే లేఅవుట్లలో విద్యుత్‌ అవసరాలకు తగినంత స్థలం కేటాయించేలా చట్టం తీసుకొస్తామని చెప్పారు.

ఎత్తిపోతల పథకాలకు ఏ సమయంలో ఎంత విద్యుత్‌ అవసరం.. దాన్ని ఎలా సమకూర్చాలి అనే విషయాలపై నీటిపారుదల, విద్యుత్‌ శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమావేశమై సరైన అంచనాలతో ముందుకుపోవాలని చెప్పారు. ఎత్తిపోతల పథకాలకు ఏర్పడిన డిమాండ్‌ను తట్టుకునేందుకు, సోలార్‌ విద్యుత్‌ సమకూర్చుకోవాలని సూచించారు. వెయ్యి మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కోసం టెండర్లు పిలవాలని ఆదేశించారు.

సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ఎస్పీడీసీఎల్‌ సీఎండీ జి.రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్‌ సీఎండీ గోపాల్‌రావు, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాస్‌రావు, స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ మిశ్రా, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శులు ఎస్‌.నర్సింగ్‌రావు, రామకృష్ణారావు, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ దానకిశోర్, నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్‌రావు, íసీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు