జెడ్పీ చైర్మన్లు... ముందే ఖరారు 

20 Apr, 2019 04:43 IST|Sakshi

ముఖ్యనేతలకు జిల్లా పదవుల పంపకం 

పరిషత్‌ ఎన్నికలపై టీఆర్‌ఎస్‌ వ్యూహం

సాక్షి, హైదరాబాద్‌: జిల్లా, మండల పరిషత్‌ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యమే లక్ష్యంగా కసరత్తు చేస్తున్న టీఆర్‌ఎస్‌.. జెడ్పీ చైర్‌పర్సన్‌ అభ్యర్థులపైనా ముందే స్పష్టత ఇస్తోంది. టీఆర్‌ఎస్‌లో సీనియర్లకు పదవుల పంపకంపై దృష్టి పెట్టిన సీఎం కేసీఆర్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా పలువురు ముఖ్య నేతలకు అవకాశం ఇవ్వా లని నిర్ణయించారు. పలు కారణాలతో ఇప్పటికీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాలు రాని వారికి, పోటీ చేసి ఓడిన వారిలో కొందరికి జిల్లా పరిషత్‌ చైర్మన్లుగా అవకాశం ఇచ్చేందుకు టీఆర్‌ఎస్‌ అధినేత కసరత్తు చేస్తున్నారు. ఆసిఫాబాద్, పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవికి టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించారు. మిగిలిన జిల్లాల విషయంలోనూ ఇదే తరహా వ్యూహాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల నోటిఫికేషన్‌ వచ్చేలోపే వీలైనన్ని ఎక్కువ జెడ్పీలకు చైర్మన్‌ అభ్యర్థులను ప్రకటించాలని భావిస్తున్నారు.

అన్ని జిల్లా పరిషత్‌లు, అత్యధిక ఎంపీపీల్లో గెలుపే లక్ష్యం గా కేసీఆర్‌ ఇప్పటికే వ్యూహం సిద్ధం చేశారు. ఉమ్మడి జిల్లాల వారీగా గెలుపు వ్యూహంపై మంత్రులు, ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. జిల్లాల వారీగా రిజర్వేషన్లు, అశావహుల వివరాలను సేకరిస్తున్నారు. శుక్రవారం పలువురు మంత్రులు, ముఖ్యనేతలతో చర్చించారు. ఆశావహులతోపాటు ముఖ్యనేతల పేర్ల ను పరిశీలించి ప్రతి జెడ్పీకి ఇద్దరు చొప్పున నేతలతో సీఎం జాబితా రూపొందిస్తున్నారు. చివరికి ఒక్కరి పేరును ఖరారు చేయనున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిన వారు, ప్రస్తుత జెడ్పీ చైర్‌పర్సన్లు, కార్పొరేషన్‌ చైర్మన్లకు.. జెడ్పీ పద వులను కేటాయిస్తున్నారు. ఇలా ఎంపిక చేసిన వారికి సీఎం స్వయంగా ఫోన్లు చేసి చెబుతున్నారు. జిల్లా పరిషత్‌గా అవకాశం ఇస్తున్నామని, సమన్వయంతో పని చేసుకోవాలని సూచిస్తున్నారు.  

►ఆసిఫాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మాజీ ఎమ్మెల్యే కోవా లక్ష్మీకి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. ఈ నెల 15న జరిగిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు ప్రకటించారు. కోవా లక్ష్మీ 2014లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో 171 ఓట్ల తేడాతో ఓడిపో యారు. ఆసిఫాబాద్‌లో గెలిచిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఇటీవల టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. దీంతో లక్ష్మీకి జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవితో అవకాశం కల్పించాలని కేసీఆర్‌ నిర్ణయించారు.  

►పెద్దపల్లి జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకు అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్‌ ప్రకటించారు. మంత్రి ఈటల రాజేందర్‌తో సమన్వయం చేసుకుని చైర్మన్‌ అభ్యర్థిగా ప్రచారం చేసుకోవాలని సూచించారు. పుట్టా మధు 2014 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉండే మంథని సెగ్మెంట్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచారు. అధికారికంగా టీఆర్‌ఎస్‌ ప్రాతినిథ్యం ఈ సెగ్మెంట్‌లో కీలకమైన నేపథ్యంలో మధుకు జెడ్పీ చైర్మన్‌గా అవకాశం ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

►భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవిని ఇల్లెందు మాజీ ఎమ్మెలే కోరం కనకయ్య, అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, పినపాక మాజీ ఎమ్మెల్యే పి.వెంకటేశ్వర్లు  ఆశిస్తున్న ట్లు తెలిసింది. అధిష్టానం ఈ పేర్లను పరిశీలిస్తోంది. 

►ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా చైర్‌పర్సన్‌ తుల ఉమకు ఈసారి జగిత్యాల జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా అవకాశం ఇచ్చే పరిస్థితి ఉందని పార్టీ వర్గాలు చెబు తున్నాయి. ఉమ సొంత మండలం జెడ్పీటీసీ స్థానం, జగిత్యాల జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి రిజర్వేషన్లు ఆమెకు అనుకూలంగా ఉన్నాయి. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఉమకు మరోసారి అవకాశం ఇచ్చే పరిస్థితి ఉంది. 

►ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిషత్‌కు రెండోసారి చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తున్న పట్నం సునీతామహేందర్‌రెడ్డిని మరోసారి ఇదే పదవి వరించే అవకాశం ఉంది. సునీతకు ఈసారి వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పదవి ఇవ్వాలని అధిష్టానం నిర్ణయించింది. రంగారెడ్డి జెడ్పీ చైర్‌పర్సన్‌ పదవి సైతం ఈసారి జనరల్‌ మహిళకు రిజర్వు అయ్యింది. షాద్‌నగర్‌ మాజీ ఎమ్మెల్యే సిహెచ్‌.ప్రతాప్‌రెడ్డి కుటుంబ సభ్యు లు, మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కోడలు అనిత పేర్లను అధిష్టానం పరిశీలిస్తోంది.

►నల్లగొండ జిల్లా పరిషత్‌ చైర్మన్‌గా బండ నరేందర్‌రెడ్డికి అవకాశం ఇస్తున్నట్లు కేసీఆర్‌ శుక్రవారం ఆయనకు చెప్పినట్లు తెలిసింది. తెలంగాణ ఉద్యమ సమయంలో బండ నరేందర్‌రెడ్డి నల్లగొండ ఉమ్మడి జిల్లా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడిగా పని చేశారు. ప్రస్తుతం రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్‌గా ఉన్నారు. ఇదిలా ఉండగా మరో నేత తిప్పన విజయసింహారెడ్డి పేరును సైతం పరిశీలిస్తున్నట్లు టీఆర్‌ఎస్‌ వర్గాలు తెలిపాయి. 

►ఖమ్మం జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పదవి కోసం సీఎం సీనియర్ల పేర్లను పరిశీలిస్తున్నారు. సత్తుపల్లి అసెంబ్లీ స్థానానికి టీఆర్‌ఎస్‌ టికెట్‌ ఆశించి అధిష్టానం హామీతో పోటీకి దూరంగా ఉన్న మట్టా దయానంద్‌కు చైర్మన్‌ పదవి వచ్చే అవకాశం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో మధిర నుంచి పోటీ చేసి ఓడిన లింగాల కమల్‌రాజ్‌ పేరు సైతం పరిశీలనలో ఉంది. 

మరిన్ని వార్తలు