త్వరలో పాలమూరుకు సీఎం

21 Aug, 2019 09:46 IST|Sakshi

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల పరిశీలన

కరివెన, గట్టు ఎత్తిపోతల పనులు సందర్శించే అవకాశం

గట్టు మండలం మొసలిదొడ్డిలో మొక్కలు నాటనున్న కేసీఆర్‌? 

పెండింగ్‌ ప్రాజెక్టులపై మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ సమీక్ష 

ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ అధికారులకు దిశానిర్దేశం 

సాక్షి, మహబూబ్‌నగర్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రాజెక్టుల బాట పట్టనున్నారు. ఉమ్మడి పాలమూరులో కొనసాగుతున్న ప్రాజెక్టులు..ఎత్తిపోతల పథకాల పురోగతిని తెలుసుకునేందుకు త్వరలోనే ఆయన మహబూబ్‌నగర్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో పర్యటించనున్నారు. పాలమూరులో పర్యటిస్తానని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే.. జిల్లా కలెక్టర్ల సదస్సు తర్వాత సీఎం పర్యటన పాలమూరులోనే ఉంటుందనే చర్చ రాజకీయ.. అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులందరూ అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఈ నెల 19న మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ జడ్చర్ల, నారాయణపేట, దేవరకద్ర, కొడంగల్, షాద్‌నగర్‌ ఎమ్మెల్యేలు, ఇరిగేషన్‌ ఉన్నతాధికారులతో సమావేశం కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

ఇందులో పాలమూరు–రంగారెడ్డి పథకం పనులు వేగవంతానికి కార్యాచరణ, మిగులు ఆయకట్టుకు నీరు అందించే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. మరో రెండురోజుల్లో సీఎం పర్యటన షెడ్యూల్‌ ఖరారయ్యే అవకాశాలున్నందున అధికారులూ ప్రాజెక్టుల పురోగతిపై నివేదికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇదీలా ఉంటే కేసీఆర్‌ కరివెనతో పాటు గట్టు ఎత్తిపోతల పథక పనులను పరిశీలిస్తారని విశ్వసనీయ సమాచారం. ఇదే క్రమంలో సీఎం గట్టు మండలం మొసలిదొడ్డిలో మొక్కలు నాటే విధంగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ‘జిల్లాలో సీఎం కేసీఆర్‌ పర్యటన ఉంటుంది.. కానీ ఎప్పుడు వస్తారు..? ఏ ప్రాంతంలో పర్యటిస్తారనే దానిపై ఇంకా స్పష్టత లేదు’ అని మాజీ మంత్రి, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ‘సాక్షి’తో చెప్పారు.  

పాలమూరు–రంగారెడ్డిపై ప్రత్యేక దృష్టి.. 
ఉమ్మడి పాలమూరు జిల్లాతో పాటు రంగారెడ్డి జిల్లాలో 12.30లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేసేలా ప్రభుత్వం రూ.35,200 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మించతలపెట్టిన పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ద్వారా రూ.10వేల కోట్ల రుణం మంజూరు అయిన విషయం తెలిసిందే. దీంతో నిధుల సమస్యతో నత్తనడకన సాగుతున్న పనులు పరుగులు పెట్టే విధంగా ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఇటు సీఎం కేసీఆర్‌ ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పూర్తితో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై ప్రత్యేక దృష్టిసారించారు. జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులతో హైదరాబాద్‌లో సమావేశం నిర్వహించి.. పనుల ప్రగతిపై దిశానిర్దేశం చేశారు. ఈ పథకం పనుల్లో జాప్యంపై చర్చించారు.

భూసేకరణ సమస్యను పరిష్కరించడంతో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రస్తుతం ఈ పథకంలో భాగమైన నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన రిజర్వాయర్ల నిర్మాణానికి సంబంధించి రూ.8,184కోట్ల మేరకు పనులు జరగాల్సిన ఉండగా నిధుల సమస్యతో ఇప్పటివరకు రూ. 3,272కోట్ల పనులు జరిగాయి. వీటితో పాటు కాలువల నిర్మాణ పనులు జరగాల్సి ఉంది. దీంతో పాటు 35వేల ఎకరాలకు సాగునీరందిచేలా అప్‌గ్రేడ్‌ అయిన గట్టు ఎత్తిపోతల పథకానికి సుమారు రూ.2వేల కోట్లు అవసరమున్నాయని అధికారులు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇటు తుమ్మిళ్ల ఎత్తిపోతల పథకం స్టేజ్‌–2 పరిధిలో తనగల, జూలకల్, రామాపురం గ్రామాల్లో జలాశయాల నిర్మాణాలకు రూ.300కోట్లు అవసరమున్నట్లు అధికారులు నివేదికలు సిద్ధం చేసినట్లు సమాచారం.    

మరిన్ని వార్తలు