కేంద్ర విద్యుత్‌ సవరణ బిల్లుపై కేసీఆర్‌ ఫైర్‌

3 Jun, 2020 02:29 IST|Sakshi

రాష్ట్రాలపై ప్రభావం చూపే చట్టాలు కేంద్రం తేవడం సరికాదు

ఈ ధోరణిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం

ప్రజలు, విద్యుత్‌ సంస్థల ప్రయోజనాలకు భంగం

ప్రస్తుత సబ్సిడీ, క్రాస్‌ సబ్సిడీ విధానాన్నే కొనసాగించాలి

ఎలాంటి సవరణలు ప్రతిపాదించినా వ్యతిరేకిస్తాం

ఈఆర్సీల నియామక అధికారాన్ని లాక్కోవడం తగదు

సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం అంటూ ప్రధాని మోదీకి లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ‘రాష్ట్రాలకు సంబంధించిన నిర్దిష్టమైన అధికారాలు, విధులను ప్రతిపాదిత విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు లాక్కుంటుంది. కేంద్రం ఏర్పాటు చేసే ఎంపిక కమిటీ.. రాష్ట్రాల విద్యుత్‌ రెగ్యులేటరీ కమిషన్‌లను నియమించడం, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో రాష్ట్రాల ఈఆర్సీ బాధ్యతలను పొరుగు రాష్ట్రాల ఈఆర్సీలకు అప్పగించడం వంటి చర్యలు రాజ్యాంగంలో పొందుపరిచిన సమాఖ్య రాజ్య స్ఫూర్తిని దెబ్బతీయనున్నాయి. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో ఓ అంశం ఉన్నంతమాత్రాన రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై ప్రత్యక్షంగా తీవ్ర ప్రభావం చూపే చట్టాలను కేంద్రం/పార్లమెంట్‌ తీసుకురావడం సమంజసం కాదు. ఈ ధోరణిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం’ అని సీఎం కేసీఆర్‌ కేంద్రంపై మండిపడ్డారు. ఇటీవల కేంద్రం తీసుకొచ్చిన ముసాయిదా విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు–2020పై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు/సూచనలు కోరగా.. రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్‌ మంగళవారం లేఖ రాశారు. ప్రజలు, రాష్ట్రాల విద్యుత్‌ సం స్థలు, రాష్ట్ర ప్రభుత్వాల ప్రయోజనాలకు విఘాతం కలిగించే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. లేఖలోని అంశాలు ఇవీ..

విద్యుత్‌ వినియోగదారులకు, ముఖ్యంగా వ్యవసాయం, గృహ వినియోగదారులకు అందించే విద్యుత్‌ రాయితీలను నగదు బదిలీ(డీబీటీ) ద్వారా అందించాలన్న నిబంధనను బిల్లులో ప్రతిపాదించారు. ఈ నిబంధన రైతులు, పేద వినియోగదారుల ప్రయోజనా లకు విరుద్ధం. రైతులకు 24 గంటలు నిరంతరంగా ఉచిత విద్యుత్‌ సరఫరా చేయడం తెలంగాణ విధానం. సబ్సిడీల చెల్లింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయాలి. ప్రస్తుతం అమల్లో ఉన్న సబ్సిడీల విధానాన్ని సవరించేందుకు చేసే ఎలాంటి ప్రతిపాదనలు అయినా రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తుంది.

సబ్సిడీ లేకుండానే అన్ని కేటగిరీల వినియోగదారుల విద్యుత్‌ టారీఫ్‌ను ఈఆర్సీ నిర్ణయించాలని బిల్లులో ప్రతిపాదించారు. కొన్ని రకాల వినియోగదారులు క్రాస్‌ సబ్సిడీ భరించేలా ప్రస్తుత టారీఫ్‌ విధానం ఉంది. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు అమల్లోకి వస్తే వ్యవసాయం సహా అన్ని కేటగిరీల వినియోగదారులకు వాస్తవ విద్యుత్‌ సరఫరా వ్యయం ఆధారంగా కరెంటు బిల్లులు జారీ చేయాల్సి వస్తుంది. ఈ నిబంధనలను మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. సముచిత విధానంలో కొన్ని కేటగిరీల వినియోగదారులపై క్రాస్‌ సబ్సిడీలు విధించే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకే వదిలేయడం శ్రేయస్కరం.

రాష్ట్రాల సంపూర్ణ అంగీకారంతోనే ఏదైనా జాతీయ పునరుత్పాదక ఇంధన విధానానికి రూపకల్పన చేయాలి. జల, పవన విద్యుదుత్పత్తికి ఉన్న అవకాశాలు, భూముల లభ్యత వంటి అంశాల విషయంలో దేశంలో ప్రతి ఒక్క రాష్ట్రం ప్రత్యేక పరిస్థితిని కలిగి ఉంది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన విషయంలో జాతీయ విధానానికి లోబడి తమకు అనువైన నిర్ణయం తీసుకునే అధికారం రాష్ట్రాలకు కల్పించేలా జాతీయ విధానం రూపకల్పన జరగాలి. పునరుత్పాదక ఇంధన లక్ష్యాలు అందుకోకపోతే రాష్ట్రాలకు జరిమానాలు విధించే నిబంధనలు ఉండరాదు.

ఈ బిల్లు ద్వారా దేశవ్యాప్తంగా పవర్‌ షెడ్యూలింగ్‌కు సంబంధించిన పూర్తి స్థాయి అధికారాలను జాతీయ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ (ఎన్‌ఎల్‌డీసీ)కి కట్టబెట్టతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెలంగాణ లోడ్‌ డిస్పాచ్‌ సెంటర్‌ అత్యంత సంతృప్తికర రీతిలో మెరిట్‌ ఆర్డర్‌ను అమలు చేస్తోంది. గ్రిడ్‌ క్రమశిక్షణకు ఉన్న అత్యంత ప్రాధాన్యం దృష్ట్యా ఎన్‌ఎల్‌డీసీకి అదనపు బాధ్యతలు అప్పగించడం సముచితం కాదు. ఇది రాష్ట్రాల థర్మల్‌ విద్యుదుత్పత్తి కేంద్రాల బ్యాకింగ్‌ డౌన్‌ (ఉత్పత్తి తగ్గింపు/ పూర్తిగా నిలుపుదల)కు దారితీస్తుంది. కేంద్ర విద్యుదుత్పత్తి ప్లాంట్లతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు పోటీ పడలేవు. ఎన్టీపీసీ, ఎన్‌హెచ్‌పీసీ వంటి కేంద్ర విద్యుత్‌ ప్లాంట్ల విద్యుదుత్పత్తి ధరలు తక్కువగా ఉండటంతో మెరిట్‌ ఆర్డర్‌ ప్రకారం విద్యుత్‌ కొనుగోళ్లలో వాటికి ప్రాధాన్యం లభించనుంది. దీంతో రాష్ట్రాల విద్యుదుత్పత్తి ప్లాంట్లు నష్టపోనున్నాయి.

విద్యుదుత్పత్తి కేంద్రాలకు సకాలంలో బిల్లుల చెల్లింపులు జరిగేలా పర్యవేక్షించే అధికారాన్ని ఎన్‌ఎల్‌డీసీకి అప్పగించేందుకు బిల్లులో ప్రతిపాదనలు చేశారు. ఇలాంటి వాణిజ్యపర అంశాలను ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం రాష్ట్రాల ఈఆర్సీలు, సివిల్‌ కోర్టులకే వదిలేయాలి. విద్యుత్‌ షెడ్యూలింగ్, గ్రిడ్‌ భద్రత వంటి సాంకేతికపరమైన బాధ్యతలకే ఎన్‌ఎల్‌డీసీ పరిమితం కావాలి. 

డిస్కంల నుంచి కాకుండా వినియోగదారులు బహిరంగ మార్కెట్‌ నుంచి నేరుగా ఓపెన్‌ యాక్సెస్‌ విధానంలో స్వేచ్ఛగా విద్యుత్‌ కొనుగోలు చేసుకునేందుకు అనుమతించాలని బిల్లులో ప్రతిపాదించారు. ఈ అవకాశం కల్పిస్తే డిస్కంల ఆదాయానికి గండి పడనుంది. సాంకేతికంగా సాధ్యం కాకపోయినా, మెగావాట్‌కు పైగా విద్యుత్‌ అవసరమైన వినియోగదారులు పెద్ద సంఖ్యలో ఓపెన్‌ యాక్సెస్‌కు వెళ్లే ప్రమాదముంది. దీనికి తోడు సబ్‌ లైసెన్సీలు ఓపెన్‌ యాక్సెస్‌లో విద్యుత్‌ కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేసే అవకాశం లభించనుంది. దీని ద్వారా కూడా డిస్కంలు ఆర్థికంగా కుంగిపోనున్నాయి.

రాష్ట్రాల ఈఆర్సీల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాన్ని ప్రతిపాదిత విద్యుత్‌ బిల్లు లాక్కోనుంది. ఇది సమాఖ్య విధాన స్ఫూర్తికి విరుద్ధం. కాంట్రాక్టులకు సంబంధించిన అన్ని అంశాలను పర్యవేక్షించేందుకు కేంద్ర స్థాయిలో ‘ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అథారిటీ’పేరుతో సమాంతర వ్యవస్థ ఏర్పాటు చేయాలని బిల్లులో ప్రతిపాదించారు. ప్రస్తుతం కాంట్రాక్టుల వివాదాలు సివిల్‌ కోర్టుల పరిధిలో ఉండగా, ఈ వ్యవస్థ ఏర్పాటుతో రెండింటి పరిధిలో వివాదాలు రానున్నాయి.

విద్యుత్‌ చట్ట సవరణ ముసాయిదా బిల్లు–2020పై మాకున్న తీవ్ర అభ్యంతరాల్లో కొన్నింటిని పైన పేర్కొనడం జరిగింది. ఈ సవరణలు ఇటు ప్రజలకు, అటు రాష్ట్ర విద్యుత్‌ సంస్థలు/రాష్ట్ర ప్రభుత్వాలకు ఏ మాత్రం ప్రయోజనం కలిగించేలా లేవు. పైన పేర్కొన్న అంశాల దృష్ట్యా ప్రజా ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని కేంద్ర విద్యుత్‌ శాఖ.. ఈ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని కోరుతున్నాం.

మరిన్ని వార్తలు