హరితహారం.. భావితరాలకు వరం

8 Jan, 2015 02:40 IST|Sakshi
హరితహారం.. భావితరాలకు వరం

* అన్ని శాఖల సమన్వయంతోనే ఇది సాధ్యం
* రాష్ట్రం అందంగా ఉంటే మరిన్ని పెట్టుబడులొస్తాయి
* సీఎం కార్యాలయ ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్

సంగారెడ్డి అర్బన్: హరితహారం విజయవంతంతో మెదక్ జిల్లాను రాష్ట్రానికి మోడల్‌గా నిలిపేందుకు అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని సీఎం కార్యాలయ ఓఎస్డీ, హరితహారం ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమ అమలుపై కలెక్టరేట్‌లో బుధవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి పాతినిథ్యం వహిస్తున్న జిల్లాను హరితహారంలో ముందంజలో నిలపాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచే స్తూ.. ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించినప్పుడే లక్ష్యం నెరవేరుతుందన్నారు. సీఎం ఇతర జిల్లాలకు వెళ్లినప్పుడు మెదక్‌ను ఆదర్శంగా చూపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

ప్రతిఒక్కరూ తమ శక్తి మేరకు కృషి చేస్తే ఈ కార్యక్రమం భవిష్యత్ తరాలకు ఒక వరంలా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. దీనికోసం వారితో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించాలని జేసీ శరత్‌ను ఆదేశించారు. ప్రతి విద్యార్థి తమ ఇంటి వద్ద రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించేలా అవగాహన కల్పించాలన్నారు. పాఠశాలల ఆవరణల్లో మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని డీఈఓ రాజేశ్వర్‌రావును ఆదేశించారు.

పరిశ్రమల్లో కూడా దీన్ని అమలు చేయాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్  మేనేజర్‌ను, పీహెచ్‌సీల వద్ద కూడా మొక్కలు నాటాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. వసతి గృహాల్లో సైతం మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత సంక్షేమాధికారులను ఆదేశించారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలని సూచించారు. సంగారెడ్డిలో కూడా దీన్ని అమలు చేయాలని కమిషనర్‌ను ఆదేశించారు.

కార్యక్రమ అమలులో స్వయం సహాయక బృందాలను భాగస్వాములను చేయాలన్నారు. ఈ ఏడాది  దాదాపు రూ.5 కోట్లు వెచ్చించి ఇతర రాష్ట్రాల నుంచి మొక్కలు కొనుగోలు చేస్తున్నామని వచ్చే సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోని గ్రూపులకు అవకాశం ఇస్తామన్నారు. మున్సిపల్, గ్రామ పంచాయతీల్లో కొత్త భవనాల నిర్మాణానికి అనుమతులిచ్చే ముందు తప్పకుండా ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పెంచే విధంగా చర్యలు తీసుకునే విధంగా సూచించాలన్నారు.
 
లక్ష్యం 3.52 కోట్ల మొక్కల పెంపకం...
జాయింట్ కలెక్టర్ డా.ఎ.శరత్ మాట్లాడుతూ, జిల్లాలో హరితహారం కార్యక్రమం అమలు కోసం 478 నర్సరీలను ఎంపిక చేసి మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. మొదటి సంవత్సరంలో 3.52 కోట్ల మొక్కలు నాటడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. డీఎఫ్‌ఓ, డ్వామా ఏజెన్సీల ఆధ్వర్యంలో నర్సరీల ద్వారా మొక్కలను నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

నర్సరీల ఏర్పాటు కోసం ప్లాస్టిక్ బ్యాగ్‌లలో 60 శాతం మట్టిని నింపి ఉంచామన్నారు. జిల్లాలోని వివిధ ఏజెన్సీల ద్వారా మొక్కలు పెంచి నాటేందుకు ప్రణాళికలు రూపొందించామని వివరించారు. ప్రభుత్వ ఖాళీ స్థలాలు, దేవాదాయ భూములు, ఆవరణల్లో మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని ప్రత్యేకాధికారి ప్రియాంక వర్గీస్‌కు వివరించారు. ప్రతి గ్రామ పంచాయతీలో పదెకరాల చొప్పున 11 వేల ఎకరాలలో 1.82 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రైవేట్ నర్సరీల యాజమాన్యాలు లక్షలాది మొక్కలను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయని, వారిని సంప్రదించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు.
 
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్...
జిల్లాలో హరితహారం విజయవంతం అయ్యేందుకు తీసుకుంటున్న చర్యలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా టెరిటోరియల్ డీఎఫ్‌ఓ సుధాకర్‌రెడ్డి వివరించారు. సమీక్షా సమావేశంలో డ్వామా పీడీ ర వీందర్, డీఆర్‌డీఏ పీడీ సత్యనారాయణరెడ్డి, జెడ్పీ సీఈఓ మధు, డీపీఓ ప్రభాకర్‌రెడ్డి, డీడీ సోషల్ వెల్ఫేర్ శ్రీనివాస్‌రెడ్డి, ఇరిగేషన్ ఎస్‌ఈ సురేంద్ర, పీఆర్ ఎస్‌ఈ ఆనందం, డీఎంహెచ్‌ఓ బాలాజీ పవార్, ఆర్వీఎం పీఓ యాస్మిన్‌బాషా  పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు