బీసీల వినతులను  సీఎం తిరస్కరించారు: జాజుల

24 Dec, 2018 03:15 IST|Sakshi

హైదరాబాద్‌: పంచాయతీ రాజ్‌ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అంశంపై సీఎం కేసీఆర్‌కు అఖిలపక్ష పార్టీలు, న్యాయనిపుణులు, బీసీ సంఘాల నేతలు వినతి పత్రాలను సమర్పిస్తే వాటిని పెడచెవిన పెట్టి ఫెడ రల్‌ ఫ్రంట్‌ అంటూ విమానం ఎక్కారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ విమర్శించారు. బీసీల వినతులను సీఎం తిరస్కరించారని ఆరోపించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఈ నెల 26న అఖిలపక్ష పార్టీలు, బీసీ సంఘాలు, న్యాయ నిపుణులతో అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 29న  31 జిల్లాల్లో కలెక్టరేట్లను ముట్టడిస్తున్నట్లు పేర్కొన్నారు. జనవరి మొదటి వారంలో లక్ష మందితో హైదరాబాద్‌లో ఆత్మగౌరవసభ నిర్వహిస్తామని, అప్పుడు కూడా ప్రభుత్వం దిగిరాకపోతే జనవరి రెండో వారంలో రాష్ట్ర బంద్‌ నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎస్‌.దుర్గయ్య గౌడ్, తాటికొండ విక్రం గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.  

రిజర్వేషన్ల తగ్గింపు చరిత్రాత్మక తప్పిదం.. 
బీసీల రిజర్వేషన్లను 34 శా తం నుంచి 23 శాతానికి తగ్గించడం ప్రభుత్వం చేస్తు న్న చరిత్రాత్మక తప్పిదం అని జాజుల విమర్శించారు. ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బీసీ సబ్‌ప్లాన్‌ కమిటీ, ఎంబీసీ సంఘం ఆధ్వర్యంలో జరిగిన రౌండ్‌టేబుల్‌ సమావేశంలో జాజుల మాట్లాడుతూ ఏపీ సీఎం చంద్రబాబుకు ఇచ్చే గిఫ్ట్‌ను సీఎం కేసీఆర్‌ బీసీలకు ఇచ్చాడా? అని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మొదటి గిఫ్ట్‌ ఇదేనన్నారు. బీసీల రిజర్వేషన్లకు గండికొడితే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో బీసీ సబ్‌ప్లాన్‌ సాధన కమిటీ చైర్మన్‌ ప్రొఫె సర్‌ కె.మురళీమనోహర్, ఎంబీసీ సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి పైళ్ల ఆశయ్య, సామాజికవేత్త ఉ.సాంబశివరావు, బీసీ సబ్‌ ప్లాన్‌ సాధన సమితి గ్రేటర్‌ నేత కిల్లే గోపాల్, ఎంబీసీ సంఘం నేత ప్రొ. సుదర్శన్‌రావు, వివిధ సంఘాల నేతలు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు