వడివడిగా.. ఐడీహెచ్ గృహాలు

24 Jun, 2015 01:04 IST|Sakshi
వడివడిగా.. ఐడీహెచ్ గృహాలు

పక్కాగా నిర్మాణం
- రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలని సీఎం ఆదేశం
- వచ్చే దసరానాటికి గృహప్రవేశం
సాక్షి, సిటీబ్యూరో:
ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు ఎన్నికల హామీల అమలులో భాగంగా  ఐడీహెచ్‌కాలనీలో  చేపట్టిన పేదలకు డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల నిర్మాణం వడివడిగా సాగుతోంది. గత అక్టోబర్‌లో ఈ పథకానికి శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి పనులు పూర్తి చేసి పేదలకు అందిస్తామని ప్రకటించారు. అయితే వివిధ కారణతో పనుల్లో జాప్యం జరిగింది. దీంతో వాటిని పూర్తి చేసేందుకు  అధికారులు యుద్ధప్రాతిపాదికన పనులు చేస్తున్నారు.  రాష్ట్రావతరణ దినోత్సవం సందర్భంగా ఈనెల 2వ తేదీన ఒక్క బ్లాక్‌కైనా ప్రారంభోత్సవం చేయాలని నిర్ణయించారు.
 
అయితే ఈ పథకం రాష్ట్రానికి ఆదర్శంగా నిలవాల్సి ఉన్నందున హడావుడిగా పనులు చేసి ఆగమాగంగా చేయవద్దని సీఎం సూచించారు. దీంతో కొద్దిగా ఆలస్యమైనా పకడ్బందీగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు  శ్రమిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్ నిరంతర పర్యవేక్షణతో పనులు చివరి దశకు చేరుకున్నాయి.

మొత్తం 33 బ్లాకులకుగాను 15 బ్లాకులు ఫినిషింగ్ దశలో ఉండగా, మిగతావాటిని సెప్టెంబర్‌లోగా పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటున్నారు.  దీంతో వచ్చే దసరా నాటికి ప్రారంభోత్సవం జరిగే అవకాశాలున్నాయి.  లబ్ధిదారులపై ఎలాంటి భారం పడకుండా రూ.36.54 కోట్లతో చేపట్టిన ఈ పథకంలో ఇళ్లతో పాటుగా రహదారులు, తాగునీరు, డ్రైనేజీ, విద్యుత్,  కూరగాయల మార్కెట్, కమ్యూనిటీహాల్  తదితర సదుపాయాలు కల్పించనున్నారు. ఇందుకు గాను త్వరలో టెండర్లు పిలవనున్నారు.
 
పథకం వివరాలు..
- ఐడీహెచ్‌కాలనీ, పార్థివాడ, సుభాష్‌చంద్రబోస్‌నగర్, భగత్‌సింగ్‌నగర్, అమ్ముగూడ బస్తీల్లోని వారికి గృహ సదుపాయం.
- ఐడీహెచ్ కాలనీ వారికి 216, అమ్ముగూడ బస్తీవాసులకు 101, సుభాష్ చంద్రబోస్‌నగర్ నివాసితులకు 26, భగత్‌సింగ్‌నగర్ వాసులకు 12, పార్థివాడకు చెందిన వారికి 31 ఇళ్లు అందుబాటులోకి వస్తాయి. జీప్లస్2 విధానంలో నిర్మాణం  చేపట్టారు.
- మొత్తం 33 బ్లాకుల్లో 396 ఇళ్లు నిర్మిస్తుండగా,  ఎస్సీలకు 276, ఎస్టీలకు 31, బీసీలకు 79, మైనార్టీ(ఒసీ)లకు 10 గృహాలను కేటాయించారు.
- 69 చ.గ.ల స్థలంలో 580 ఎస్‌ఎఫ్‌టీ ప్లింత్‌ఏరియాతో నిర్మాణం.
- జీప్లస్ టూ విధానంలో ఒక్కో  బ్లాక్‌లో 12 ఇళ్ల నిర్మాణం
- ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ. 7.90 లక్ష లు, మౌలిక సదుపాయాలకు రూ. 1.30 లక్షలు వంతున రూ. 9.20 లక్షలు వినియోగం
- రోడ్లకు రూ. 1.16 కోట్లు, వరద కాలువలకు రూ. 56 లక్షలు, డ్రైనేజీ సదుపాయానికి రూ. 62 లక్షలు, విద్యుత్ సదుపాయానికి రూ. 72 లక్షలు, పార్కు, కూరగాయల మార్కెట్, ఇతరత్రా సదుపాయాలకు  రూ. 30 లక్షలు వెచ్చించనున్నారు.
- ఇందిరానగర్, హమాలీబస్తీ, తదితర ప్రాంతాల్లోనూ ఈ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు.

మరిన్ని వార్తలు