గజ్వేల్.. జిగేల్..

10 May, 2015 03:58 IST|Sakshi
శనివారం గజ్వేల్‌లో ఆస్పత్రి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న సీఎం కేసీఆర్, చిత్రంలో మంత్రులు హరీశ్‌రావు, కడియం, డిప్యూటీ స్పీకర్ పద్మా

- సకల హంగులతో రూపురేఖలు మారుస్తా: సీఎం కేసీఆర్ వెల్లడి
 
గజ్వేల్:
ఒకటి రెండేళ్లలో గజ్వేల్‌కు అన్ని హంగులు కల్పించి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి పరుస్తామని, పట్టణ ముఖచిత్రాన్నే మార్చివేస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అన్నారు.  శనివారం ఆయన తన సొంత నియోజకవర్గమైన మెదక్ జిల్లా గజ్వేల్‌లో పర్యటించి, రూ. 98.72 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. మర్కుక్ పీహెచ్‌సీ, ఇతర అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.


పాండవుల చెరువులో మిషన్‌కాకతీయ పనులను ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.  తాను మార్చి 12న ఇచ్చిన మాట ప్రకారం మోడల్ కాలనీ, వంద పడకల ఆసుపత్రి, ఆడిటోరియం, బాల, బాలికల ఎడ్యుకేషన్ హబ్, ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ తదితర నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తున్నట్టు తెలిపారు. మోడల్ కాలనీలో సుమారు 2,500 నుంచి 3 వేల మందికి జీ ప్లస్ వన్ పద్ధతిలో ఇళ్లు నిర్మించి ఇవ్వనున్నట్టు చెప్పారు. కాలనీ వాసులకు రోడ్లు, మంచినీరు, షాపింగ్ కాంప్లెక్స్, ప్రార్థనా మందిరాలు, ఫంక్షన్ హాళ్లు వంటి సదుపాయాలను కల్పిస్తామనీ, విరివిగా మొక్కలు నాటుతామన్నారు.

మోడల్ కాలనీకి రింగ్ రోడ్డు, నాలుగు వరుసల రోడ్ల నిర్మాణాలతో అనుసంధానం చేస్తామన్నారు.  గజ్వేల్ నగర పంచాయతీ వాసులకు మరో 7, 8 నెలల్లో ప్రతి ఇంటికి నల్లా నీరు అందిస్తామన్నారు. దీంతోపాటు మంత్రి హరీశ్‌రావు ఆలోచన మేరకు గజ్వేల్‌లో భూగర్భ డ్రైనేజీ విధానాన్ని అమల్లోకి తెచ్చే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి టి.హరీశ్‌రావు, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.  అనంతరం కేసీఆర్ ఎర్రవల్లి గ్రామ సమీపంలో గల తన వ్యవసాయ క్షేత్రానికి చేరుకున్నారు.  
 
సీఎం పర్యటనలో విలేకరులకు తప్పిన ముప్పు
గజ్వేల్‌లో శనివారం జరిగిన ముఖ్యమంత్రి పర్యటనలో కాన్వాయి వెంట ఓపెన్‌టాప్ వాహనంలో ఉన్న విలేకరులు, ఎలక్ట్రానిక్ మీడియా కెమెరామెన్లకు పెనుప్రమాదం తప్పింది.  మీడియా ప్రతినిధులు వాహనంలో వెళ్తున్న సమయంలో రోడ్డుపై కిందకు వేలాడుతున్న వైర్లు ఓపెన్‌టాప్ వాహనంలోని నలుగురు విలేకరులకు తాకాయి. దీంతో వారు అరుస్తూ, వాహనంలోనే పడిపోగా, డ్రైవర్ వాహనాన్ని ఆపాడు. స్వల్పంగా గాయపడ్డ విలేకరులను పలువురు పరామర్శించారు.

మరిన్ని వార్తలు