సీఎం పర్యటన వాయిదా

20 Jan, 2015 06:03 IST|Sakshi
సీఎం పర్యటన వాయిదా

తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో..?
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు.
 
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు జిల్లా పర్యటన తాత్కాలికంగా వాయిదా పడింది. ఈనెల 22, 23 తేదీల్లో సీఎం జిల్లాలో పర్యటిస్తారని భావించిన అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో ఆయన పర్యటన వాయిదా పడిందని, తిరిగి ఫిబ్రవరి మొదటి వారంలో సీఎం జిల్లాకు వచ్చే అవకాశాలున్నాయని, తేదీలు ఇంకా ఖరారుకాలేదని పార్లమెంటరీ కార్యదర్శి జలగం వెంకట్రావు తెలిపారు.

సీఎం జిల్లాలోని ఖమ్మం, మణుగూరు, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉందని తొలుత భావించిన అధికారులు ఆ మేరకు ఆయా ప్రాంతాల్లో ఆగమేఘాల మీద ఏర్పాట్లు చేశారు. అయితే ఈ నెల 22వ తేదీన ఆదిలాబాద్ జిల్లా గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే నాగోబా జాతర జరగనుండటంతో దానికి హాజరయ్యేందుకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు.

ఈ నేపథ్యంలోనే ఆయన పర్యటన వాయిదా పడినట్లు తెలుస్తోంది. సీఎం ఫిబ్రవరి మొదటివారంలో జిల్లా పర్యటనకు వచ్చే అవకాశం ఉందని, ఏ తేదీన వస్తారు?, ఎన్ని రోజులు ఉంటారనే విషయం ఇంకా ఖరారు కాలేదని పార్లమెంటరీ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యాలయ వ్యవహారాల ఇన్‌చార్జి జలగం వెంకటరావు విలేకరులకు తెలిపారు. సీఎం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు సర్వసన్నద్ధం అవుతూనే ఉన్నారు.

సోమవారం నుంచి జిల్లా కేంద్రంలోని 17 మున్సిపల్ రెవెన్యూ వార్డులలో ఆసరా పింఛన్లు మంజూరు కాని వారి నుంచి దరఖాస్తులు తీసుకుంటున్నారు. ఆహార భద్రత కార్డుల అర్హులను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేశారు. ఇందుకు 17మంది జిల్లా అధికారులను ఖమ్మం నగరంలో ప్రాంతాల వారీగా నియమించారు. సీఎం పర్యటన ఫిబ్రవరి మొదటివారంలో ఖాయమని తెలుస్తోంది.

మరిన్ని వార్తలు