నేడు పాలమూరుకు సీఎం కేసీఆర్

18 Jan, 2015 14:29 IST|Sakshi

మహబూబ్‌నగర్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లాకు రానున్నారు. మురికివాడల్లో స్థితిగతులు మెరుగుపరిచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సీఎం దృష్టి కేంద్రీకరించనున్నారు. ముఖ్యంగా మహబూబ్‌నగర్ మున్సిపాలిటీ పరిధిలోని మురికివాడల్లో పర్యటించి అక్కడి ప్రజలు తెలుసుకోనున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు ఇదివరకు రెండుమార్లు వచ్చినప్పటికీ.. ఈ సారి మాత్రం మురికివాడల్లో విస్తృతంగా పర్యటన చేపట్టనున్నారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో జిల్లా కలెక్టర్ టీకె శ్రీదేవి మహబూబ్‌నగర్ పట్టణంలోని పలు మురికివాడల్లో ఉదయం 5గంటల నుంచే పర్యవేక్షించి సమస్యలు గుర్తించారు. ముఖ్యమంత్రి పర్యటనలో జిల్లాకు ఏం వరాలు ఇస్తారోనని జిల్లావాసులు ఆశగా ఎదురుచూస్తున్నారు.

షెడ్యూల్‌పై గోప్యత...
 ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలపై స్పష్టత లేదు. ఈ విషయమై జిల్లా ఉన్నతాధికారులు పూర్తి గోప్యంగా ఉంచుతున్నారు. కార్యక్రమంపై సీఎం కార్యాలయం నుంచే స్పష్టత లేదని పేర్కొంటున్నారు. అయితే సీఎం మాత్రం మహబూబ్‌నగర్ పట్టణంలోని నాలుగు మురికి వాడలను సందర్శించే అవకాశం ఉంది.

 సీఎం పర్యటన ఇలా..?
 సీఎం పర్యటన వివరాలు అధికారులు ప్రకటించనప్పటికీ ఆయన పర్యటన ఇలా ఉండే అవకాశం ఉంది. మొదటగా సీఎం హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గం ద్వారా మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. ఉదయం 11 గంటల వరకు ఆర్‌అండ్‌బీ అథితిగృహానికి చేరుకుంటారు. అక్కడ మంత్రులు, జిల్లా నాయకులు, ఉన్నతాధికారులు స్వాగతం పలుకుతారు. అక్కడి నుంచి నేరుగా మురికివాడల్లో పర్యటించనున్నారు. మున్సిపాలిటీల్లోని నాలుగు మురికి వాడల్లో పర్యటనకు వీలుగా అధికారులు ఏర్పాట్లు చేసుకున్నారు. పాత పాలమూరు, వీరన్నపేట, పాతతోట(కూరగాయల మార్కెట్), టీడీగుట్ట ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది. మొదటగా మధ్యాహ్న సమయంలోపు రెండువాడల్లో పర్యటించేలా అధికారులు ప్రణాళిక రచించారు. లంచ్ తర్వాత మరో రెండు ప్రాంతాల్లో పర్యటించనున్నారు. అలాగే సంబంధిత ప్రాంతాల్లో పర్యటించేటప్పుడు ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించనున్నారు. సీఎం పర్యటించే ఆయా ప్రాంతాల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం కోసం శంకుస్థాపన చేయనున్నారు. సాయంత్రం తేనీటి విందు తర్వాత జెడ్పీ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో సమీక్ష జరపనున్నారు. అనంతరం అక్కడే మళ్లీ ప్రజల నుంచి వచ్చే వినతులను స్వీకరించనున్నారు.

 అధికారుల అప్రమత్తత..!
 సీఎం కేసీఆర్ జిల్లాలో నేరుగా సమస్యల పై దృష్టి సారించనుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గతంలో వరంగల్ జిల్లాలో నాలుగు రోజుల పర్యటనలో తలెత్తిన ఇబ్బందులు పునారావృతం కాకుండా చూసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. లబ్ధిదారుల చిట్టాను పక్కాగా తయారు చేస్తున్నారు. ముఖ్యంగా రేషన్‌కార్డులు, పింఛన్ల విషయంలో సమస్యలు తలెత్తకుండా సరిచూసే పనిలో నిమగ్నమయ్యారు. అలాగే రెండు రోజులుగా వివిధ శాఖల అధికారులు సమీక్షలు జరుపుతూ బిజీబిజీగా గడిపారు. తాగునీరు, ఇళ్లు, రహదారులు, వీధిలైట్లు, డ్రైనేజీ సమస్యలపై ప్రణాళికలు రచించారు. వీటితో పాటు విలీన పంచాయతీల్లో సమస్యలపై ప్రత్యేక నోట్ తయారు చేశారు.

 పనులను అడ్డుకున్న స్థానికులు.. సముదాయించిన కలెక్టర్
 సీఎం పర్యటించే ప్రాంతాల్లో పనులు చేసేందుకు వెళ్లిన అధికారులను స్థానికులు అడ్డుకున్నారు. ప్రధానంగా పాత పాలమూరులో పనులను అడ్డుకొని అధికారులతో వాగ్వాదానికి దిగారు. ‘ఇన్నాళ్లు తమను పట్టించుకోని వారు ఇప్పుడు సీఎం వస్తున్నారని ఇవన్నీ చేస్తున్నారా... మా సమస్యలు సీఎంకు చూపిద్దామనుకుంటే.. ఇప్పుడు పనులు చేసి అంతా బాగున్నట్టు చెప్పుదామని చూస్తున్నారా’ అంటూ ఘర్షణకు దిగారు. దీంతో కలెక్టర్ శ్రీదేవి వారిని సముదాయించారు.

 కౌన్సిల్ జాబితా సిద్ధం...
 సీఎం ప్రత్యేకంగా మున్సిపల్ సమస్యలపైనే వస్తుండడంతో మహబూబ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ చిట్టాపద్దును తయారు చేసుకుంది. పట్టణ ప్రధాన సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పెద్ద మొత్తంలో నిధులు రాబట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్ అధ్యక్షతన కౌన్సిలర్లు ప్రత్యేకంగా సమావేశమై జాబితా సిద్ధం చేశారు. ప్రధానంగా మహబూబ్‌నగర్ చుట్టూ ఔ టర్ రింగ్‌రోడ్డు, అంతర్గత రహదారులు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పట్టణంతో పాటు విలీన గ్రామ పంచాయతీల్లో తాగునీటి సౌకర్యం, ఇదివరకు పట్టణానికి తాగునీ రు సరఫరా చేస్తున్న రామన్‌పాడు, కోయిల్‌సాగర్‌ల నుంచి అదనంగా మరో పైపులైన్, పట్టణంలోని పలు ప్రాంతాల గుం డా రైల్వేలైన్లు ఉన్నందున ఆయా ప్రాం తాల్లో రైల్వే ఓవర్ బ్రిడ్జిలు, పార్కుల ఏ ర్పాటు తదితర వాటితో మొత్తం రూ.500 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులతో కూడిన నివేదికను సిద్ధం చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా