సీఎం ఆఫీసులో కరోనా కలకలం 

7 Jun, 2020 04:49 IST|Sakshi

ముఖ్యకార్యదర్శి పేషీలో ఓ ఉద్యోగికి పాజిటివ్‌

30 మంది సీఎంవో ఉద్యోగులకు పరీక్షలు

బీఆర్‌కేఆర్‌లో ఇద్దరు ఉద్యోగుల బంధువులకు కరోనా

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంఓ)లో కరోనా కలకలం రేపింది. కొత్త సచివాలయ భవన సముదాయం నిర్మాణం కోసం దాదాపు కొన్ని నెలల కింద సచివాలయాన్ని ఖాళీ చేయడంతో సీఎంవోను బేగంపేటలోని మెట్రోరైలు భవనానికి తరలించిన విషయం తెలిసిందే. సీఎంవోలో సీఎం ముఖ్యకార్యదర్శి స్థాయి అధికారి పేషీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇటీవలే మహారాష్ట్ర నుంచి ఆ ఉద్యోగి కుమారుడు హైదరాబాద్‌కు వచ్చినట్లు అధికారులు గుర్తించారు. కుమారుడి ద్వారా సీఎంవో ఉద్యోగికి వైరస్‌ సోకిందని నిర్ధారించారు. ఈ క్రమంలో శనివారం సీఎంవో కార్యాలయాన్ని శానిటైజ్‌ చేసి భవనాన్ని సీజ్‌ చేశారు.

సీఎంవో ఉద్యోగులు ఎవరూ కార్యాలయానికి రావద్దని ఆదేశించారు. సీఎంవోకు ఎవరూ రావొద్దని అన్ని శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో కొద్దిరోజుల పాటు సీఎంవో బంద్‌ కానుంది. సీఎంవోలో పనిచేస్తున్న దాదాపు 30 మంది సిబ్బంది ఉద్యోగుల శాంపిళ్లను చెస్ట్‌ ఆస్పత్రి వైద్య సిబ్బంది సేకరించారు. ఒకటి రెండ్రోజుల్లో వీరికి సంబంధించిన రిజల్ట్స్‌ రానున్నాయి. సీఎంవోలో పనిచేస్తున్న వారిలో సీనియర్‌ సిటిజన్స్‌ అధికంగా ఉన్నారు. రిటైర్డు అధికారులూ ఉన్నత పదవుల్లో కొనసాగుతున్నారు. దీంతో తీవ్ర ఆందోళన నెలకొంది. రిటైర్డు సీఎస్, ప్రధాన సలహాదారు రాజీవ్‌ శర్మ కాలుష్య నియంత్రణ మండలి కార్యాలయం నుంచి విధులు నిర్వహిస్తున్నారు.

బీఆర్‌కేఆర్‌లో కూడా.. 
రాష్ట్ర తాత్కాలిక సచివాలయం బీఆర్‌కేఆర్‌కు కూడా కరోనా సెగ తాకింది. రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి సమీప బంధువు శుక్రవారం రాత్రి గాంధీలో కరోనాతో మరణించారు. దీంతో ఆ ఉద్యోగికి సంబంధించిన కుటుంబ సభ్యులందరి నుంచి శాంపిల్స్‌ తీసుకుని పరీక్షల కోసం పంపించారు. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ కార్యాలయంతో పాటు బీఆర్‌కేఆర్‌ భవనాన్ని మరోసారి శానిటైజ్‌ చేయించారు. బీఆర్‌కేఆర్‌ నుంచే పనిచేస్తున్న రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలోని ఓ మహిళ అధికారి కుమారుడు ఉస్మానియాలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. ఆయనకు సైతం 4 రోజుల కింద కరోనా పాజిటివ్‌ అని తేలడంతో ఆ ఉద్యోగిని హోం క్వారంటైన్‌లో ఉన్నారు.  

మరిన్ని వార్తలు