పంచాయతీల్లో కో ఆప్షన్‌  

12 Mar, 2019 16:55 IST|Sakshi
వేముల గ్రామ పంచాయతీ భవనం  

కొత్త చట్టంతో గ్రామ స్థాయిలో పదవులు 

ఒక్కో పంచాయతీకి ముగ్గురు 

సాక్షి, మూసాపేట: ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన పంచాయతీరాజ్‌ చట్టం–2018 ప్రకారం గ్రామ పంచాయతీలో కో ఆప్షన్‌ సభ్యులకు చోటు కల్పించనున్నారు. గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశ్యంతో నూతనంగా కో ఆప్షన్‌ సభ్యులకు అవకాశం కల్పించనున్నారు. గ్రామ పాలనను బలోపేతం చేయడమే లక్ష్యంగా కో ఆప్షన్‌ సభ్యులను భాగస్వామ్యం చేయనున్నారు.

కొత్త పంచాయతీ రాజ్‌ చట్టం ప్రకారం 500 జనాభా కలిగి ఉన్న శివారు గ్రామాలు, గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. పాలన వికేంద్రీకరణలో భాగంగా మూసాపేటను నూతనంగా ఏర్పాటు చేయగా అందులో 12 గ్రామ పంచాయతీల నుంచి 15 గ్రామ పంచాయతీలుగా మూసాపేట మండలాన్ని ఏర్పాటు చేశారు. ఈ 15 గ్రామ పంచాయతీలకు గాను ఒక్కో గ్రామ పంచాయతీలో ముగ్గురి చొప్పున 45 మందిని కో ఆప్షన్‌ సభ్యులుగా ఎన్నుకోనున్నారు. వారికి వార్డు సభ్యులతో సమానంగా కో ఆప్షన్‌ సభ్యులకు కూడా హోదా వస్తుంది.

 
మూడు విభాగాల్లో సభ్యుల ఎన్నిక.. 
గ్రామ పంచాయతీ పాలక వర్గంలో కో ఆప్షన్‌ సభ్యులను మూడు విభాగాల్లో ఎన్నుకుంటారు.ఆ గ్రామంలో రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగి, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి ,గ్రామ పంచాయతీకి ఆర్థికంగా సాయం చేసిన దాతకు కో ఆప్షన్‌ సభ్యుల కోటాలో అవకాశం కల్పిస్తారు. గ్రామ అభివృద్ధిలో కో ఆప్షన్‌ సభ్యుల సలహాలు, సూచనలు చేయవచ్చు.

 
గ్రామాల్లో పోటా పోటీ.. 
మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీల్లో కో ఆప్షన్‌ సభ్యుల కోసం పోటీ తీవ్రంగా ఉంది. రిజర్వేషన్, సామాజిక వర్గం కలిసి రాక కొందరు, ఖర్చు చేయలేక మరికొందరు పోటీకి దూరంగా ఉన్న వాళ్లు కో ఆప్షన్‌ పదవులను దక్కించుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు