జోడేఘాట్‌లో నల్ల బంగారం

3 Apr, 2015 01:42 IST|Sakshi
జోడేఘాట్‌లో నల్ల బంగారం

భారీ స్థాయిలో బయటపడిన బొగ్గు నిక్షేపాలు
1,100 మిలియన్ టన్నుల వరకూ ఉన్నట్లు అంచనా
ఆదిలాబాద్ జిల్లాలోని మరిన్ని ప్రాంతాల్లోనూ బొగ్గు నిల్వలు
 భారీగా సున్నపురాయి నిల్వలు కూడా గుర్తింపు
 వందేళ్ల వరకూ సిమెంట్ ఉత్పత్తికి సరిపడా ఖనిజాలు
 రామగుండం-భూపాలపల్లి కారిడార్‌లోనూ మరిన్ని నిల్వలు
 
 అడవులకు ప్రసిద్ధిగాంచిన ఆదిలాబాద్ జిల్లాలో భారీ స్థాయిలో బొగ్గు, సున్నపురాయి నిక్షేపాలు బయటపడ్డాయి. గిరిజన పోరాటయోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్‌తో పాటు మరిన్ని ప్రాంతాల్లో ‘డీ’ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నట్లు సింగరేణి అధికారులు గుర్తించారు. ఇక్కడితోపాటు చింతగూడ, కెరమెరి, బేల మండలాల పరిధిలోనూ బొగ్గు నిక్షేపాలను కనుగొన్నారు. మొత్తంగా 1,500 మిలియన్ టన్నుల వరకూ బొగ్గు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇక ఇదే ప్రాంతంలో అత్యంత భారీ స్థాయిలో సున్నపురాయి నిక్షేపాలు ఉన్నట్లు సింగరేణి అధికారులు గుర్తించారు.     
 - బెల్లంపల్లి
 
 భారీగా సున్నపురాయి నిక్షేపాలు..
 జోడేఘాట్‌లో బొగ్గు సంపదను తలదన్నే రీతిలో భారీగా సున్నపురాయి నిక్షేపాలు కూడా బయటపడ్డాయి. డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ నుంచి జోడేఘాట్ వరకు దాదాపు 85 చదరపు కిలోమీటర్ల అటవీ ప్రాంతంలో... బొగ్గు కోసం చేసిన డ్రిల్లింగ్ ప్రక్రియలో అపారమైన ఈ సున్నపురాయి నిల్వలను సింగరేణి అధికారులు గుర్తించారు. ప్రస్తుతం బయటపడిన సున్నపురాయి నిల్వలు కనీసం 10 సిమెంట్ ఫ్యాక్టరీల అవసరాలను తీర్చగలవని సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. మొత్తంగా వందేళ్ల వరకు సిమెంట్ పరిశ్రమలను నిర్వహించడానికి సరిపడా ముడి సరుకు ఈ ప్రాంతంలో లభిస్తుందని పేర్కొంటున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా బయ్యారంలో సింగరేణి అన్వేషణ విభాగం అధికారులు ఇనుప ఖనిజం నిక్షేపాలపై పరిశీలన చేస్తున్నారు. అదేమాదిరి డోర్లి-2, జోడేఘాట్ అటవీ ప్రాంతంలోని సున్నపురాయి నిక్షేపాలపైనా చర్యలు చేపట్టాల్సి ఉందని భావిస్తున్నారు.
 
 రామగుండం వద్ద కూడా..
 
 గోదావరిఖని: కరీంనగర్ జిల్లా రామగుండం నుంచి వరంగల్ జిల్లా భూపాలపల్లి వరకు మరిన్ని బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లా గోదావరిఖని, యైటింక్లయిన్‌కాలనీ, సెంటినరీ కాలనీతోపాటు వరంగల్ జిల్లా భూపాలపల్లిలో భూగర్భ గనులు, ఓపెన్‌కాస్ట్ ప్రాజెక్టులను సింగరేణి సంస్థ నిర్వహిస్తోంది. తాజాగా భూపాలపల్లి సమీపంలోని వెంకటాపూర్ డీప్‌సైడ్ బ్లాక్‌లో 35 చదరపు కిలోమీటర్ల పరిధిలో 588 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలున్నట్లు గుర్తించారు. తాడిచర్ల బ్లాక్-2లో 277 మిలియన్ టన్నులు, మహదేవపూర్ మండలం కాళేశ్వరం సమీపంలోని చంద్రుపల్లి బ్లాక్, లక్ష్మీదేవిపల్లి-పాలంపేట బ్లాక్, భూపాలపల్లి వద్ద కేటీకే-6 ఫేజ్-2, మహదేవపూర్ బ్లాక్‌లో నిల్వలను గుర్తించారు. పూర్తిస్థాయిలో నిర్ధారించడం కోసం త్వరలో డ్రిల్లింగ్ చేపట్టనున్నారు. మొత్తంగా రామగుండం నుంచి భూపాలపల్లి వరకు గల కోల్‌కారిడార్‌లోని చాలా ప్రాంతాల్లో తక్కువ నాణ్యత కలిగిన ఎఫ్, జి-గ్రేడ్‌ల బొగ్గును, పలు చోట్ల ఈ-గ్రేడ్ బొగ్గు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేశారు. మొత్తంగా రామగుండం నుంచి భూపాలపల్లి వరకు ఉన్న సుమారు 3 వేల మిలియన్ టన్నుల బొగ్గు నిక్షేపాలున్నాయని.. ఇప్పటివరకు వెలికితీసింది 30 నుంచి 40 శాతమేనని అధికార వర్గాలు చెబుతున్నాయి.
 
 నాణ్యమైన బొగ్గు..
 గిరిజన పోరాటయోధుడు కొమురం భీమ్ పురిటిగడ్డ జోడేఘాట్ ప్రాంతంలో భారీగా బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ దాదాపు వందేళ్లకు సరిపడా బొగ్గు, సున్నపురాయి నిల్వలు ఉన్నట్లు బెల్లంపల్లిలోని సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం సర్వే చేసి నిర్ధారించింది. తిర్యాణి మండలం డోర్లి-2 ఓపెన్‌కాస్ట్ (ఓసీ) ప్రాజెక్టు నుంచి జోడేఘాట్ వరకు సుమారు 85 చదరపు కిలోమీటర్ల అటవీ భూమిలో దాదాపు 1,100 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. అటవీ ప్రాంతంలోని కొందన్‌మోర్, మోవాడ్, జోడేఘాట్ ప్రాంతాల్లో చేసిన డ్రిల్లింగ్‌లో ఈ బొగ్గు నిక్షేపాలు బయటపడ్డాయి. ఇక్కడ సుమారు 500 మీటర్ల లోతులో ‘డీ’ గ్రేడ్ నాణ్యత కలిగిన బొగ్గు ఉన్నట్లు తేలింది.
 
 మరిన్ని చోట్ల కూడా: ఆదిలాబాద్ జిల్లాలోని మరికొన్ని చోట్ల భారీస్థాయిలో బొగ్గు నిక్షేపాలు వెలుగుచూశాయి. ఆసిఫాబాద్ మండలంలోని చింతగూడ ప్రాంతంలో 240 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు సింగరేణి అధికారుల సర్వేలో తేలింది. చింతగూడ పరిసరాల్లోని వెంకటాపూర్, నిమ్మగూడ, మోవాడ్, బల్హాన్‌పూర్, ఆజి దస్నాపూర్ పరిసరాల్లో ఈ బొగ్గు ఉంది. ఈ ప్రాంతాన్ని సింగరేణి బొగ్గు అన్వేషణ విభాగం అధికారులు నాన్ ఫారెస్ట్ ఏరియాగా గుర్తించారు. చింతగూడలో 300 మీటర్ల లోతులోనే ‘డీ’ గ్రేడ్ బొగ్గు నిల్వలున్నాయి. దీంతో ఇక్కడ ఓపెన్‌కాస్ట్‌లను చేపట్టేందుకు అవకాశాలున్నాయి. కెరమెరి గుట్టల్లోనూ బొగ్గు నిక్షేపాలను గుర్తించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బేల మండలంలోనూ బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లున్నట్లు సింగరేణి అధికారులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది మరిన్ని సార్లు డ్రిల్లింగ్ చేసి... ఆయా ప్రాంతాల్లో బొగ్గు నిక్షేపాలు ఎంత లోతులో ఉన్నాయో తేల్చనున్నట్లు చెబుతున్నారు.

 


 

మరిన్ని వార్తలు