నాలుగు రోజులకే బొగ్గు!

15 Jun, 2014 04:23 IST|Sakshi
నాలుగు రోజులకే బొగ్గు!

కేటీపీపీలో నిండుకున్న నిల్వలు
గణపురం: గణపురం మండలం చెల్పూరు శివారులో ఉన్న కాకతీయ థర్మల్ విద్యుత్ కేంద్రం(కేటీపీపీ)లో బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. ప్రస్తుతం కేటీపీపీ బొగ్గు యార్డ్‌లో శనివారం నాటికి 29,034 మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు మాత్రమే ఉన్నాయి. బొగ్గు సరఫరాలో అంతరాయం కలిగినా.. వర్షాలు కురిసినా.. వారం రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయో ప్రమాదం పొంచి ఉన్నది. వాస్తవానికి అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవడంలో విఫలం కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. బొగ్గురవాణా చేసే కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒక కారణమైతే, సింగరేణి సంస్థ బొగ్గును అందించకపోవడం మరో కారణంగా చెప్పవచ్చు.

500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కేటీపీపీకి ప్రతిరోజు 7,500 మెట్రిక్ టన్నుల బొగ్గు అవసరం అవుతుంది. అంటే రోజుకు 450 లారీల బొగ్గు అవసరం. కచ్చితంగా చెప్పాలంటే ప్రతి మూడు నిమిషాలకు లారీ బొగ్గు (లారీలో దాదాపు17టన్నులు ఉంటే) కావాల్సి ఉంది. విద్యుత్ కేంద్రంలో విద్యుత్ నిలిచిపోకుండా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 400 పైగా లారీల బొగ్గు ప్లాంట్‌కు సరఫరా కావాలి. బొగ్గు కాంట్రాక్టర్లు కేటీపీపీకి 450 లారీల బొగ్గును సరఫరా చేసిన సందర్భాలు చాలా తక్కువ.

ఇప్పటి వరకైతే 300 నుండి 400లారీల బొగ్గు ప్లాంట్‌కు చేరుతుంది. శుక్రవారం నాడు మాత్రం 7850 మెట్రిక్ టన్నుల బొగ్గు (సుమారుగా 450 లారీల బోగ్గు )ప్లాట్‌కు చేరుకుంది. భూపాలపల్లి బొగ్గు బావుల్లో, ఒపెన్‌కాస్ట్ బావిలోనూ టార్గెట్ మేరకు బొగ్గు ఉత్పత్తి కాకపోవడంతో కేటీపీపీకి అవసరమైన బొగ్గు రావడం లేదు. దాంతో గోదావరిఖని, రామగుండం, బెల్లంపల్లి, మంచిర్యాల నుంచి సరఫరా చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ దశలో విద్యుత్ ప్లాంట్‌లో బొగ్గు నిల్వలు ఆశిం చిన మేరకు లేక పోవడంతో అధికారుల్లో గుబు లు మొదలైంది. బొగ్గుకొరత ఏర్పడుతుందనే విషయాన్ని గమనించిన అధికారులు ప్రస్తుతం కొంత బొగ్గు, కొంత ఆయిల్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తున్నది.

వాస్తవానికి కేటీపీపీలో విద్యుత్ ఉత్పత్తి  ప్రారంభం నాటి నుంచీ బొగ్గు సరఫరా విషయంలో క్షణంక్షణం టెన్షన్‌గానే ఉంది. బొగ్గు సరఫరా  కాంట్రాక్టులు దక్కించుకున్న కాంట్రాక్టుర్లు వారి టార్గెట్ ప్రకారం బొగ్గు ను సరఫరా చేస్తే అధికారులకు తలనొప్పి ఉండేదికాదు. 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వ ఉండాలని నిబంధన ఉన్నప్పటికీ దానిపై అధికారులు దృష్టి సారించడం లేదు. బొగ్గు సర ఫరా కాంట్రాక్టులో కొంతమందికి రాజకీయంగా పలుకుబడి ఉండటంతో టార్కెట్ పూర్తి చేయకున్నా.. వారిపై చర్యలు చేపట్టడానికి అధికారులు సహసం చేయలేక పోతున్నారు.
 
ఏ రోజుకు.. ఆ రోజే సరఫరా
భూపాలపల్లి బొగ్గు గనుల నుంచి కేటీపీపీ 4500 మెట్రిక్ టన్నుల బొగ్గు సరఫరా కావాల్సి ఉండగా 3500నుండి 4000 మెట్రిక్ టన్నులు సరఫరా అవుతున్నది, గోదావరిఖని నుంచి 3వేల మెట్రిక్ టన్నులకు గాను వెయ్యి మెట్రిక్‌టన్నులు, బెల్లంపల్లి, రాంగుండం, మంచిర్యాల రైల్వేట్రాక్ ద్వారా ఉప్పల్‌కు వచ్చిన 4వేల మెట్రిక్ టన్నుల బొగ్గు నుంచి రోజుకు రెండు వేల నుంచి ఇరైవె ఐదు వందల మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫారా అవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఏ రోజుకు కావాల్సిన బొగ్గు ఆ రోజే సరఫరా అవుతున్నది. నిల్వ చేసుకోవడానికి అదనంగా ఎక్కడి నుంచి కూడా రావడం లేదు. అనివార్య కారణాల మూలంగా బొగ్గు రాక్ రాకుంటే కేటీపీపీ పరిస్థితి ఏమిటనే ప్రశ్నకు అధికారుల దగ్గర సమధానం లేదు.

>
మరిన్ని వార్తలు