కిచిడీ ప్రభుత్వం వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి

23 Mar, 2019 14:13 IST|Sakshi
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న చింత సాంబమూర్తి

 టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్యనే పోటీ

  ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న టీఆర్‌ఎస్‌

 బీజేపీ, వరంగల్‌ పార్లమెంట్‌ అభ్యర్థి చింత సాంబమూర్తి 

సాక్షి, హన్మకొండ: వివిధ ప్రాంతీయ పార్టీలతో కూడిన కిచిడీ ప్రభుత్వం కేంద్రంలో వస్తే ఆరు నెలలకో ప్రధానమంత్రి మారుతారని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గ అభ్యర్థి చింత సాంబమూర్తి అన్నారు. శుక్రవారం హన్మకొండ హంటర్‌ రోడ్డులోని వేద బాంక్వెట్‌ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్‌ పార్టీ దేశవ్యాప్తంగా నిర్వీర్యమై పోయిందని, ఆ పార్టీ నాయకులు నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ ఉందా లేదా అన్నట్లుగా ఉందని విమర్శించారు.

తెలంగాణలో ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసే పరిస్థితులు లేవన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌–బీజేపీ మధ్యనే పోటీ ఉంటుందన్నారు. దేశ ప్రజలు నరేంద్ర మోదీ వైపు చూస్తున్నారని, మోదీ ద్వారానే దేశానికి రక్షణ ఉంటుందని, అభివృద్ధి పరుగులు పెడుతుందన్నారు. ఉగ్రవాదులను కూకటి వేళ్లతో పెకిలించే సత్తా మోదీకి మాత్రమే ఉందన్నారు.

నేడు నిత్యావసర వస్తువుల ధరలు చాలా తగ్గాయన్నారు. మోదీ పేదలకు ఉచితంగా గ్యాస్‌ ఇస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 15 మంది ఎంపీలుండి ఏం చేశారని వచ్చే ఎన్నికల్లో 16 మంది ఎంపీలు గెలిచి టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్‌ సాధించేది ఏమిటని ప్రశ్నించారు. కేసీఆర్‌ మతతత్వ పార్టీ ఎంఐఎంతో చేతులు కలిపి, మతపరమైన, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 25న చింత సాంబమూర్తి నామినేషన్‌ దాఖలు చేస్తారన్నారు. 26న హన్మకొండ హంటర్‌ రోడ్డులోని అభిరాం గార్డెన్‌లో బీజేపీ వరంగల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు.

పార్టీ నాయకులు సాంబమూర్తిని సన్మానించారు. మాజీ ఎంపీ చందుపట్ల జంగారెడ్డి, బీజేపీ వరంగల్‌ అర్బన్‌ జిల్లా అధ్యక్షురాలు రావుపద్మ, వరంగల్‌ రూరల్‌ జిల్లా అధ్యక్షుడు ఎడ్ల అశోక్‌ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మార్తినేని ధర్మారావు, నాయకులు డాక్టర్‌ విజయలక్ష్మి, డాక్టర్‌ పెసరు విజయచంద్రారెడ్డి, దొంతి దేవేందర్‌రెడ్డి, గంఢ్రతి యాదగిరి చందుపట్ల కీర్తి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
   

>
మరిన్ని వార్తలు