ఇదిగిదిగో నీటి కుక్క!

17 May, 2020 03:35 IST|Sakshi
హిమాయత్‌సాగర్‌ వద్ద కెమెరా కంటికి చిక్కిన నీటి కుక్క

హిమాయత్‌సాగర్‌లో ఈ నీటి కుక్క ఫొటోలు తీసిన పక్షి ప్రేమికులు

అంతరించనున్న జాతికి చెందిన స్మూత్‌ కోటెడ్‌ ఒటొర్‌గా గుర్తింపు 

సాక్షి, హైదరాబాద్‌: అది ఓ అరుదైన ఉభయచరం.. ప్రపంచవ్యాప్తంగా అంతరించబోయే జాతుల్లో ఆ జీవి ఉంది.. హైదరాబాద్‌ శివార్లలో అనుకోకుండా ప్రత్యక్షమైంది.. అదే నీటిపైనా, నేలమీదా ఉండగలిగే స్మూత్‌ కోటెడ్‌ ఒటొర్‌ (నీటి కుక్క). నాలుగైదు రోజుల క్రితం హిమాయత్‌సాగర్‌ జలాల్లో దీనిని పర్యావరణ, పక్షి ప్రేమికులు కనిపెట్టడమే కాకుండా దాన్ని తమ కెమెరాల్లోనూ బంధించారు. ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ రంగంలో కంప్యూటర్‌ నిపుణులుగా పనిచేస్తున్న శ్రీకాంత్‌ భమిడిపాటి, గోకుల్‌ కృష్ణ అద్దంకి పర్యావరణ ప్రేమికులుగా, ‘బర్డ్‌వాచర్స్‌’గా తమ అభిరుచిని చాటుకుంటున్నారు.

నాలుగైదు రోజుల కింద హిమాయత్‌సాగర్‌ వైపు వెళ్లినపుడు ఓ అరుదైన దృశ్యం కంటపడింది. పిల్లి, పులి, కుక్కల ఆకారం పోలిన ఒక నల్లటి జంతువు వేగంగా పరిగెడుతూ నీళ్లలోకి వెళ్లింది. వెంటనే వారు నాలుగైదు ఫొటోలు తీశారు. అది నీటిలోకి వెళ్లిన ప్రాంతం దగ్గరకు వెళ్లి చూస్తే అప్పటికే కనబడకుండా పోయింది. దాని పాదముద్రల జాడలు కూడా భిన్నంగా ఉండటంతో వాటి ఫొటోలను కూడా తీశారు. ఇంటర్నెట్‌లో అలాంటి లక్షణాలున్న జంతువుల ఫొటోలతో పోల్చిచూసి, దానిని స్మూత్‌ కోటెడ్‌ ఒటొర్‌గా నిర్ధారించుకున్నారు. ఈ ఫొటోలు, తమ వద్దనున్న సమాచారాన్ని అందజేయడంతో పాటు ఈ అంశంపై లోతైన విశ్లేషణ నిర్వహించాల్సి ఉంటుందని అటవీ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

మూసీ వెంట సర్వే నిర్వహిస్తే.. 
అతి అరుదైన జాతి ఉభయచరం హైదరాబాద్‌ శివార్లలోని హిమాయత్‌సాగర్‌లో కనిపించిందంటే చాలా గొప్ప విషయం. మూసీ నదీ పరీవాహక ప్రాంతమంతా సర్వే నిర్వహిస్తే ఒటోర్‌కు సంబంధించి మరింత సమాచారం తెలిసే అవకాశముంది. – శ్రీకాంత్‌ భమిడిపాటి, బర్డ్‌ వాచర్‌

ఈ జాతిని రక్షించుకోవాలి.. 
అరుదైన, అంతరించిపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్న ఉభయచరాన్ని ప్రత్యేకమైన ఆ జాతిని రక్షించుకోవాల్సిన అవసరముంది.  – గోకుల్‌ కృష్ణ అద్దంకి, బర్డ్‌ వాచర్‌

చార్మినార్‌నే కాదు ఒటొర్‌నూ చూడాలి 
హైదరాబాద్‌ చార్మినార్, ఐటీ, హైటెక్‌ సిటీ వంటి వాటికే కాదు ప్రకృతి రమణీయతకు, జీవవైవిధ్యానికి, పర్యావరణ పరిరక్షణకు, అరుదైన జంతుజాలానికి కూడా ఆలవాలమై ఉందని తెలిపేందుకు నీటి కుక్క ఉనికిని గుర్తించడం కూడా ఉపయోగపడుతుంది. – శివకుమార్‌ వర్మ, పర్యావరణ ప్రేమికుడు 

మరిన్ని వార్తలు