మళ్లీ ‘మత్తు’ కలకలం!

6 Jun, 2020 08:00 IST|Sakshi

బెంగళూరు కేంద్రంగా నగరంలో వీఐపీలకు డ్రగ్స్‌ సరఫరా?

22 మంది సెలబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరాపై అనుమానాలు

లాక్‌డౌన్‌ సమయంలో పెరిగిన వినియోగం.. ధర రెండింతలు

సెలబ్రిటీలకు ఇవ్వలేదు: ఎక్సైజ్‌ శాఖ వివరణ

ఇటీవల ఇద్దరు నిందితులఅరెస్ట్‌తోవెలుగులోకి..

సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్‌లో మళ్లీ పెద్దమొత్తంలో నిషేధిత డ్రగ్స్‌ పట్టుబడడం కలకలం సృష్టిస్తోంది. ఇటీవల ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు నగరంలోని పంజగుట్ట, లోతుకుంట ప్రాంతాలకు చెందిన ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేయడంతోపాటు..వారి వద్ద నుంచి 54 గ్రాముల కొకైన్‌ స్వాధీనం చేసుకోవడంతో నగరంలో మరోసారి డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టు రట్టయింది. నగరంలో సుమారు 22 మంది వీఐపీలకు నిందితులిద్దరూ డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో నగరంలో మాదక ద్రవ్యాల వినియోగం పెరగడంతోపాటు..నిషేధిత డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్న మాఫియా వీటి ధరలను రెండింతలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం. కాగా గతేడాది నగరంలో పెద్ద ఎత్తున డ్రగ్స్‌ రాకెట్‌ గుట్టురట్టుకావడంతో పలువురు సినిమా సెలబ్రిటీలను ఆబ్కారీశాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం ప్రత్యేకంగా విచారించిన విషయం విదితమే.

అయితే ఈ నెల 2న అరెస్టుచేసిన తరణ్‌ జ్యోతిసింగ్, అమిత్‌కుమార్‌ల వద్ద నుంచి సుమారు రూ.5 లక్షల విలువైన కొకైన్‌ డ్రగ్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరూ కోవిడ్‌ మాస్క్‌లను బెంగళూరులో విక్రయిస్తామంటూ పోలీసుల వద్ద పాస్‌తీసుకొని అక్కడికి వెళ్లి నైజీరియాకు చెందిన మైక్‌ అనే వ్యక్తి వద్ద నుంచి 70 గ్రాముల కొకైన్‌ కొనుగోలు చేసినట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  పోలీసులు తెలిపారు. వారు అక్కడి నుంచి బయలుదేరి మే 30న హైదరాబాద్‌ నగరానికి చేరుకున్నారని..మార్గమధ్యంలో నిందితులిద్దరూ సుమారు 16 గ్రాముల కొకైన్‌ సేవించినట్లు పేర్కొన్నారు. వీరికి డ్రగ్స్‌ విక్రయించిన మైక్‌ పరారీలో ఉన్నారన్నారు. కాగా నిందితులు ప్రయాణించిన స్కోడా కారు,మొబైల్‌ఫోన్లను సైతం పోలీసులు సీజ్‌చేశారు. వీరిలో అమిత్‌కుమార్‌ అనే నిందితుడు గత 15 ఏళ్లుగా డ్రగ్స్‌ వాడుతున్నారని..వివిధ నిషేధిత మాదక ద్రవ్యాల కొనుగోలుచేయడంతోపాటు స్వయంగా వాటిని తీసుకునేవారని తమ ప్రాథమిక విచారణలో వెల్లడైందన్నారు. ఇక మరో నిందితుడు తరణ్‌ జ్యోత్‌సింగ్‌ ఐదేళ్లుగా డ్రగ్స్‌వాడుతున్నారన్నారు.

ఇటీవల ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ పోలీసులు అరెస్టు చేసిన తరణ్‌జ్యోతిసింగ్, అమిత్‌కుమార్‌ 
సెలబ్రిటీలకు చేరవేశారా?
నగరంలో చాపకింద నీరులా విస్తరిస్తున్న డ్రగ్స్‌ సంస్కృతి సభ్యసమాజాన్ని కలచివేస్తోంది. డ్రగ్స్‌ రాకెట్‌లో కీలకంగా వ్యవహరిస్తున్న నిందితులు..నగరంలోని యువతరం, సినీ, రాజకీయ, వ్యాపార రంగానికి చెందిన సెలబ్రిటీలకు, వీఐపీలకు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం తనిఖీల్లో తరచూ బయటపడుతోంది. అయితే తాజా డ్రగ్స్‌ రాకెట్‌లో ఇద్దరు మినహా ఎవరూ నిందితులు లేరని..సెలబ్రిటీలకు డ్రగ్స్‌ సరఫరా చేసినట్లు ఆధారాలు లేవని ఎన్‌ఫోర్స్‌ మెంట్‌ పోలీసులు పైకి చెబుతున్నా..ఇద్దరు నిందితులు సుమారు 22 మంది వీఐపీలకు సరఫరా చేసినట్టు సమాచారం గుప్పుమంటుండటం గమనార్హం. ఈవిషయంలో ఎలా ముందుకెళ్లాలో తెలియక ఆబ్కారీ శాఖ తటపటాయిస్తున్నట్లు సమాచారం. గతేడాది సినీ ప్రముఖుల డ్రగ్స్‌ రాకెట్‌గుట్టును ఎక్సైజ్‌ పోలీసులు రట్టు చేసినా..ఈ స్కామ్‌లో సూత్రధారులు, పాత్రధారులపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం గమనార్హం.

రెండింతల ధరలు...
అత్యంత ధరపలికే నిషేధిత మాదకద్రవ్యాలను డ్రగ్స్‌ మాఫియా లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌తో రెండింతల ధరలకు విక్రయిస్తున్నట్లు తెలిసింది. సుమారు గ్రాముకు ఐదు వేల విలువైన డ్రగ్స్‌ను సుమారు పది లేదా పదిహేను వేలకు విక్రయిస్తున్నట్లు సమాచారం. తాజాగా పట్టుబడిన డ్రగ్స్‌ సుమారు రూ.5 లక్షల విలువ కాగా..దీన్ని సొమ్ముచేసుకున్న పక్షంలో నిందితులకు పది నుంచి రూ.15 లక్షలు కొల్లగొట్టేవారిని ఆబ్కారీపోలీసులు చెబుతున్నారు.

సెలబ్రిటీలకు, వీఐపీలకు డ్రగ్స్‌ సరఫరా చేయలేదు
ఇటీవల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ తనిఖీల్లో పట్టుబడిన నిందితుల కేసును తదుపరి విచారణ నిమిత్తం సికింద్రాబాద్‌ ఎక్సైజ్‌ పోలీసులకు అప్పజెప్పాం. తాజా డ్రగ్స్‌ కేసులో నిందితులు ఇద్దరు డ్రగ్స్‌ సేవించారు. సెలబ్రిటీలు, వీఐపీలు ఎవరికీ డ్రగ్స్‌ సరఫరా చేయలేదని మా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. గతేడాది నమోదైన పాత కేసుకు సంబంధించిన పాత వివరాలతో కొన్నిప్రసార మాధ్యమాలు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. సెలబ్రిటీలకు, వీఐపీలకు చేరవేసినట్లు ఎలాంటిఆధారాలు లేవని స్పష్టం చేస్తున్నాం. – ఎన్‌.అంజిరెడ్డి, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌సూపరింటెండెంట్, ఎన్‌ఫోర్స్‌మెంట్‌

మరిన్ని వార్తలు