ఆర్టీసీ చైర్మన్, టీఎంయూ మధ్య కోల్డ్‌వార్‌ 

4 Sep, 2018 02:44 IST|Sakshi

సోమారపు వ్యాఖ్యలపై భగ్గుమన్నఅశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి 

హైదరాబాద్‌: తెలంగాణ ఆర్టీసీ చైర్మన్, గుర్తింపు సంఘం టీఎంయూ మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. అదిప్పుడు బహిరంగంగా ఒకరిపై మరొకరు విమర్శలు చేసుకునే వరకు వెళ్లింది. చైర్మన్‌ సోమారపు సత్యనారాయణ తమపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, కార్మికుల మనోభావాలను దెబ్బతీసినందుకు క్షమాపణ చెప్పాలని టీఎంయూ ప్రధానకార్యదర్శి అశ్వత్థామరెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ థామస్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం బస్‌ భవన్‌లో విలేకరులతో వారు మాట్లాడారు. గత నెల 28న సీసీఎస్, పీఎఫ్‌ నిధులను చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ బస్‌భవన్‌ ముందు ధర్నా నిర్వహించిన తమ ను ఉద్దేశించి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని, పోలీస్‌ కేసు పెడతామని, ఇదేచివరి వార్నింగంటూ చైర్మన్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని అన్నారు. ఈ వ్యాఖ్యలను నిరసిస్తూ భోజన సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశామని, తమపై చర్య లు తీసుకునే అధికారం చైర్మన్‌కు లేదని అన్నారు.  

అధికారిని వెనుకేసుకొస్తున్నారు.. 
ఆర్టీసీ ఎండీ లేని సమయంలో చైర్మన్‌ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని అశ్వత్థామరెడ్డి, థామస్‌రెడ్డి విమర్శించారు. ఫైనాన్స్‌ అడ్వైజర్‌ స్వర్ణశంకరన్‌ నిబంధనలకు విరుద్ధంగా సీసీఎస్‌ నుంచి రూ.400 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని ఆరోపించారు. కార్మికుల ప్రావిడెండ్‌ ఫండ్‌(పీఎఫ్‌)కు చెందిన దాదాపు రూ.500 కోట్లను డ్రా చేసి సంస్థకు వాడారని, అలాగే ఎస్‌బీటీ, ఎస్‌ఆర్‌బీఎస్‌లకు సంబంధించిన రూ.100 కోట్లను కూడా డ్రా చేశారని తెలిపారు. కార్మికులు ఎన్‌క్యాష్‌మెంట్‌ రాక జీతభత్యాలు లేక నానా అవస్థలు పడుతుంటే ఫైనాన్స్‌ అడ్వైజర్‌ నిధు లను దుర్వినియోగం చేశారని, చట్టప్రకారం అడ్వైజర్‌ను శిక్షించాల్సిందిపోయి చైర్మన్‌ వెనుకేసుకొస్తున్నా రని విమర్శించారు. ప్రభుత్వం నుంచి రూ.600 కోట్లు, జీహెచ్‌ఎంసీ నుంచి రూ.400 కోట్లు సంస్థకు రావాల్సి ఉందని, వాటిని తీసుకురావాల్సిన బాధ్యతను విస్మరిస్తూ టీఎంయూపై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. పోలీస్‌ కేసులు, జైళ్లకు భయపడేది లేదని, జైలుకు పంపితే బెయిల్‌ కూడా తీసుకోబోమని వారు స్పష్టం చేశారు. 

>
మరిన్ని వార్తలు