కమలాకర్‌ వర్సెస్‌ కమలాసన్‌

25 Jul, 2019 12:39 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : అధికార పార్టీకి చెందిన సీనియర్‌ ఎమ్మెల్యే ఒకరైతే... మరొకరు డీఐజీ ర్యాంక్‌లో కమిషనర్‌గా పనిచేస్తున్న పేరున్న ఐపీఎస్‌ అధికారి. ఇద్దరూ తమ తమ బాధ్యతల్లో ప్రజల మన్ననలు పొందుతున్న వారే. ఎక్కడ ఎవరి అహం దెబ్బతిందో తెలియదు గానీ... గత కొంతకాలంగా వారి మధ్య అంతరం పెరిగింది.

కరీంనగర్‌ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గంగుల కమలాకర్‌కు, దాదాపు మూడేళ్లుగా కరీంనగర్‌ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కమలాసన్‌రెడ్డికి మధ్య నడుస్తున్న కోల్డ్‌వార్‌ ప్రస్తుతం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. కరీంనగర్‌ హెడ్‌క్వార్టర్‌ ఎమ్మెల్యేగా ఉన్న తనకు తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదని కమలాకర్‌ భావిస్తుండగా, శాంతిభద్రతల సమస్యలు ఉత్పన్నం కాకుండా చూస్తూనే... వివిధ అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్గిస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తున్నట్లు కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల కొత్తపల్లి మండలం, చింతకుంటలో గత ఆదివారం పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో చోటు చేసుకున్న సంఘటనతో సమస్య తీవ్రమైంది. 

‘పెట్రోల్‌’ మంట రాజేసిన పింఛన్ల సభ
అధికారులు తన ఇంటికి నెంబర్లు కేటాయిండం లేదని రెండు లీటర్ల పెట్రోల్‌ క్యాన్‌తో చింతకుంట సభలో ఓ మహిళ వేదిక మీదికి వచ్చి పెట్రోల్‌ మీద పోసుకొనేందుకు ప్రయత్నించగా, ఎమ్మెల్యే గన్‌మెన్లు అప్రమత్తమై నిలువరించారు. అప్పటికే పెట్రోల్‌ ఎమ్మెల్యే, ఇతర నాయకులపై కూడా పడడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. తనకు భద్రత కల్పించడంలో పోలీసులు ఉద్ధేశపూర్వకంగా నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ డీఐజీ ప్రమోద్‌కుమార్‌కు తన అసంతృప్తిని తెలియజేసినట్లు సమాచారం.

పింఛన్ల సభ జరుగుతుంటే కనీస భద్రత ఏర్పాటు చేయలేదని, సభకు పెట్రోల్‌ క్యాన్‌తో ఓ మహిళ వచ్చి, వేదిక ఎక్కుతున్నా అడ్డుకునే పోలీసులు లేకుండా పోవడాన్ని తప్పుపట్టారు. కొత్తపల్లి ఎస్‌ఐ, ఇద్దరు బ్లూకోల్ట్స్‌ కానిస్టేబుళ్లు సభకు వచ్చి, వేరే బందోబస్తుకు వెళ్లిపోతే ఎమ్మెల్యేకు పోలీసుల భద్రత అవసరం లేదా అని ప్రశ్నించినట్లు సమాచారం. విషయం తెలిసిన వెంటనే కమిషనర్‌ కమలాసన్‌రెడ్డి స్వయంగా ఎమ్మెల్యేకు ఫోన్‌ చేసి, జరిగిన సంఘటనపై విచారం వ్యక్తం చేశారు.

కొత్తపల్లి ఎస్‌ఐని తక్షణమే అక్కడి నుంచి తొలగించి, కమిషనరేట్‌కు అటాచ్డ్‌ చేశారు. అయితే పెట్రోల్‌తో మహిళ సభావేదిక మీదికి వచ్చినప్పుడు ఏదైనా అనుకోని సంఘటన జరిగి ఉంటే పరిస్థితి ఏమయ్యేదని భావిస్తున్న ఎమ్మెల్యే చల్లబడడం లేదు. 

అసెంబ్లీ ఎన్నికల నాటి నుంచేనా?
గత సంవత్సరం చివరలో జరిగిన శాసనసభ ఎన్నికల సమయంలోనే కమిషనర్‌కు ఎమ్మెల్యేకు మధ్య సఖ్యత లోపించినట్లు సమాచారం. ఎమ్మెల్యే కుటుంబానికి చెందిన ఓ హోటల్‌లో పోలీసులు తనిఖీలు జరపడం, ఇతరత్రా సంఘటనలతో పొరపొచ్చాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. ఎన్నికల కమిషన్, ఉన్నత స్థాయి అధికారుల ఆదేశాల మేరకు ఎన్నికల సమయంలో కట్టుదిట్టంగా వ్యవహరించామే తప్ప ఎమ్మెల్యే, ఇతర నేతల గురించి కాదని పోలీసులు సమర్థించుకుంటున్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్‌లో బీజేపీకి మెజారిటీ రావడంపై కూడా గంగుల అసంతృప్తికి కారణంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో చింతకుంట సంఘటన ఇద్దరి మధ్య మంటలు రాజేసింది.  

ఎస్‌ఐ సమాచార లోపమే కారణమా..?
ఆదివారం చింతకుంటలో ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌ నేతృత్వంలో పింఛన్ల సమావేశం జరుగుతుందనే విషయాన్ని ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ తమకు తెలియజేయలేదని ఉన్నతాధికారులు చెబుతున్నారు. కరీంనగర్‌ రూరల్‌ సర్కిల్‌లోని కొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఎమ్మెల్యే పింఛన్ల సభ ఉన్న విషయం తనకు సమాచారం లేదని రూరల్‌ సీఐ శశిధర్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.

ఎస్‌ఐ స్వరూప్‌రాజ్‌ తనతోపాటు ఇద్దరు కానిస్టేబుళ్లతో కలిసి సభకు పోయి, తరువాత శాతవాహన యూనివర్సిటీలో ఏదో ధర్నా సమాచారం వస్తే అక్కడికి వెళ్లినట్లు చెబుతున్నారని, ఈ విషయాలేవీ తనకు గానీ, ఏసీపీకి గానీ తెలియవని ఆయన స్పష్టం చేశారు. పోలీస్‌ కమిషనర్‌ కమలాసన్‌రెడ్డిని ఈ విషయంపై ప్రశ్నించగా... ఎమ్మెల్యే సభ గురించి ఎస్‌ఐ పై అధికారులకు చెప్పక, విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా విషయం తెలిసిన వెంటనే కొత్తపల్లి ఎస్‌ఐ బాధ్యతల నుంచి స్వరూప్‌రాజ్‌ను తొలగించి, జరిగిన సంఘటనపై విచారణకు ఆదేశించామని చెప్పారు. ఎమ్మెల్యే కమలాకర్‌తోపాటు ప్రజాప్రతినిధులు అందరికీ పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తున్నామని, సమాచారలోపంతో ఈ సంఘటన జరిగినట్లు ఆయన చెప్పారు. 

ఎమ్మెల్యేకు పెరిగిన భద్రత 
చింతకుంటలో ఆదివారం జరిగిన సంఘటన వివాదాస్పదం కావడంతో పోలీస్‌ అధికారులు తక్షణ చర్యలు తీసుకున్నారు. ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌తోపాటు ప్రజా ప్రతినిధులందరికీ భద్రతను పెంచారు. ఎస్‌బీ విభాగాన్ని అలర్ట్‌ చేశారు. ఎమ్మెల్యే కార్యక్రమాల సమాచారం పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌కు తెలియజేయకపోవడంపై ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్, సిబ్బందిపై కమిషనర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా జరిగిన సంఘటనపై ఎమ్మెల్యే కమలాకర్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. మునిసిపల్‌ ఎన్నికల వేళ వివాదం రాజుకోకుండా నష్ట నివారణ చర్యలు కూడా మొదలైనట్లు సమాచారం. 

మరిన్ని వార్తలు