వైద్యుల మధ్య అంతర్గత యుద్ధం

10 Oct, 2019 08:45 IST|Sakshi

అన్ని ఆస్పత్రుల్లోనూ గ్రూపులు  

అస్తవ్యస్తంగా పాలనా వ్యవస్థ..

ట్రాన్స్‌ప్లాంటేషన్లకు సహకరించని వైనం

నాలుగేళ్లలో భారీగా తగ్గిన చికిత్సలు

ఆందోళన చెందుతున్న రోగులు

 సాక్షి,సిటీబ్యూరో: ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొంత మంది వైద్యుల మధ్య కోల్డ్‌వార్‌ నడుస్తోంది. అర్హత, అనుభవాన్ని పక్కనబెట్టి పైరవీకారులకు, జూనియర్లకు పెద్దపీట వేస్తుండటం ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఈ అంశాన్ని కొంత మంది వైద్యులు జీర్ణించుకోలేక అధికారులపై తిరుగుబావుటను ఎగరేస్తున్నారు. పరిపాలన పరమైన అంశాల్లో సహకరించక పోవడం, అసమర్థతపై ప్రశ్నించడం, ఆరోపణలు, ఫిర్యాదలు చేయడం వరకు వెళుతుండడతో పరోక్షంగా ఆస్పత్రుల పరువు పోతోంది. ప్రతిష్టాత్మాక ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఈఎన్‌టీ సహా నగరంలోని అన్ని ప్రధాన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. వైద్యుల మధ్య నెలకొన్న విభేదాలు సర్జరీలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వైద్యుల మధ్య తలెత్తుతున్న వివాదాలు ఇన్‌పేషంట్‌ సేవలతో పాటు సర్జరీలు కూడా తగ్గడానికి కారణమవుతోందని సీనియర్‌ వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

నివురు గప్పిన నిప్పులా నిలోఫర్‌
చిన్నపిల్లకు మెరుగైన వైద్యం అందించేందుకు 1953లో 100 పడకల సామర్థ్యంతో ఏర్పాటు చేసిన నిలోఫర్‌ ఆస్పత్రిలో శిశువులకు మెరుగైన వైద్యం అందించేందుకు అత్యాధునిక రాజీవ్‌ ఇంటెన్సీవ్‌ కేర్‌ యూనిట్‌ను మూడేళ్ల క్రితం ప్రారంభించారు. పడకల సంఖ్యను 1000కి పెంచారు. 2016లో 11,305 సర్జరీలు చేస్తే..2018లో 2,668 సర్జరీలకు పడిపోయింది. తాజాగా ఇద్దరి వైద్యుల మధ్య నెలకొన్న గొడవలు ఒకరిపై మరొకరు పోలీసులకు ఫిర్యాదు చేసుకునేదాకా వెళ్లింది. ఆస్పత్రి వైద్యుల మధ్య నెలకొన్న ఈ అంతర్గత విబేధాలకు తోడు ఆరోగ్యశ్రీ ఇంటెన్సివ్‌స్‌ తక్కువగా ఉండటంతో చాలా మంది వైద్యులు చికిత్సలు చేసేందుకు ఆసక్తిచూపడం లేదు. 

గాంధీలోనూ అంతర్గత యుద్ధం
ఉస్మానియాతో పోలిస్తే గాంధీ ఆస్పత్రి కొంత భిన్నమైంది. కొత్త భవనంతో పాటు అత్యాధునిక వైద్య పరికరాలు ఇక్కడే ఉన్నాయి. 1012 పడకల సామర్థ్యం ఉన్న ఈ ఆస్పత్రికి గతంతో పోలిస్తే ప్రస్తుతం ఓపీ ఘణనీయంగా పెరిగింది. అనస్థీషియన్ల కొరతకు తోడు వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల తరచూ సర్జరీలు నిలిచిపోతున్నాయి. 2016లో 59,868 సర్జరీలు చేయగా, 2018లో 50,502 సర్జరీలు మాత్రమే చేశారు. ఆస్పత్రిలో సర్జరీల సంఖ్య తగ్గడానికి వైద్యుల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలే కారణమన్న అభిప్రాయం బలంగా ఉంది. 

వాళ్లకు విన్పించదు..వీళ్లకు కన్పించదు
సుమారు 125 పడకల సామర్థ్యం గల చెవి, ముక్కు, గొంతు(ఈఎన్‌టీ) ఆస్పత్రి ఓపీకి రోజుకు సగటున 1500 మంది రోగులు వస్తుంటారు. వైద్యుల మధ్య నెలకొన్న అభిప్రాయ బేధాలు చికిత్సలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. 2015లో 46,950 సర్జరీలు జరిగితే.. 2018లో 37,033 చికిత్సలకు పడిపోవడానికి ఇదే కారణమని సీనియర్‌ వైద్యులు అభిప్రాయపడుతున్నారు.   

ఉస్మానియాలోనూ అంతే..
ప్రపంచంలోనే తొలిసారిగా క్లోరోఫామ్‌ను మత్తుమందుగా ఉపయోగించి రోగులకు చికిత్స చేసిన ఘనతతో పాటు 1982లో దేశంలోనే తొలి కిడ్నీ మార్పిడి చికిత్స చేసిన ఘనత ఉస్మానియా ఆస్పత్రి వైద్యుల సొంతం. ఒకప్పుడు దేశంలోనే ఎంతో మంచి గుర్తింపు సంపాధించకున్న ఆస్పత్రిలో ప్రస్తుతం సాధారణ చికిత్సలూ కరువయ్యాయి. సర్జికల్‌ గ్యాస్ట్రో ఎంటరాలజీ, ప్లాస్టిక్‌ సర్జరీ విభాగం వైద్యులు ఏడాది క్రితం వరకు అనేక అరుదైన చికిత్సలు చేసి అందరి మన్నలను పొందారు. ఈ గుర్తింపును జీర్ణించుకోలేని కొంత మంది అధికారులు వారికి సహాయపడక పోగా, వివిధ అంశాలపై ఆరోపణలు గుప్పించడంతో మనస్థాపం చెందిన వైద్యులు చికిత్సలకు దూరంగా ఉంటున్నట్లు తెలిసింది. విభాగాధిపతులే మెడికోలను రెచ్చగొట్టడం.. పీజీలతో సహాయ నిరాకరణ చేయంచడం.. మహిళా ప్రొఫెసర్లను కించరిచడం వంటి సంఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. ఇక నిపుణులు లేకపోవడంతో కిడ్నీ మార్పిడి చికిత్సలు కూడా దాదాపుగా నిలిచిపోయాయి. ఈ సంఘటనలు ఉన్నదాధికారుల దృష్టికి వెళ్లినా పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నాలు చేయకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా