మత్స్యశాఖలో కోల్డ్‌వార్‌!

21 Oct, 2017 18:50 IST|Sakshi

నల్లగొండ టూటౌన్‌ : రాష్ట్ర ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా పంపిణీ చేస్తున్న చేపపిల్లల వ్యవహారం ఆ శాఖ అధికారుల మధ్య కోల్డ్‌వార్‌కు తెరలేపింది. కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు రెండు గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు ఆధిపత్యం చెలాయించడానికి పోటీపడుతున్నారు. ఎవరి పని వాళ్లు చేయకుండా ఇతరుల సెక్షన్‌లో వేలు పెట్టడమే వీరి మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. మత్స్యశాఖ సొసైటీల బాధ్యులతో రహస్య మంతనాలు జరిపి ‘ముడుపులు నాకు ఇస్తే చేప పిల్లల సరఫరా అంతా నేనే చూసుకుంటాను ... ఏది ఉన్నా నన్ను కలిస్తే సరిపోతది ..? ఏదీ కావాలన్నా నేను పనిచేసి పెడతా .. ఇక్కడ అంతా నాకు బాగా తెలుసు’’ అని మత్య్సకారులకు  ఓ ఉద్యోగి చెబుతున్నట్లు సమాచారం. దీంతో ఇతర ఉద్యోగులకు ముడుపులు అందకుండా అతనొక్కడే అందినకాడికి నొక్కుతున్నారనే విషయంలో వారి మధ్య బేదాభిప్రాయాలు పొడిచూపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఉద్యోగుల ఆధిపత్యంతో మత్స్యకారులు నానా ఇబ్బందులు పడుతున్నారు.

ముడుపులిచ్చిన వారికే ముందు ...
 ప్రభుత్వం మత్స్యకారులకు ఉచితంగా చేపపిల్లలు ఇస్తుంది. కానీ ఇక్కడ తతంగం వేరే నడుస్తోంది. ముడుపులు ఇచ్చిన వారికే ముందుగా చేపపిల్లలు పంపిణీ చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉచితంగా చేపపిల్లలు పొందుతున్న మత్స్యకారుల వద్ద కొంతమంది ఉద్యోగులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలకు ఇటీవల జరిగిన పరిణామాలే బలం చేకూరుస్తున్నాయి. ఈ శాఖ ఉద్యోగులు ఏకంగా జిల్లా కేంద్రంలోనే ఓ లాడ్జి గదిలో కాంట్రాక్టర్లతో బేరాసారాలకు దిగడం సంచలనం సృష్టించింది. వైరి వర్గం ఉద్యోగులే ఫోన్‌లో ఇది భయపడే విధంగా చేశారని సదరు ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ప్రస్తుతం రెండు వర్గాలుగా విడిపోయిన ఉద్యోగుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయంటే పరిస్థితి ఎంతతీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.  

బహిరంగంగానే తిట్ల పురాణం ..!
మత్స్యశాఖ కార్యాలయంలో ఉద్యోగులు తీరు చూసి మత్స్యకారులు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇచ్చిన కాసులు తీసుకొని చడీ చప్పుడు లేకుండా ఉండకుండా  వీరెందుకు ఒకరిపై ఒకరు నిందారోపణలు చేసుకుంటన్నారని అనుకుంటుండడం విశేషం. ఉన్నతస్థాయి ఉద్యోగులపై కిందిస్థాయి వారు నోరు పారేసుకోవడం, మరికొంతమంది కిందిస్థాయి ఉద్యోగులు సైతం కార్యాలయంలో ఓ ఉద్యోగి అవినీతి అక్రమాలు పాల్పడుతున్నారని బహిరంగంగానే చర్చించుకోవడం పెద్ద దుమారం రేపుతోంది. ఉన్నత ఉద్యోగిపై సైతం కార్యాలయ కింది స్థాయి సిబ్బంది వినే విధంగా ఓ ఉద్యోగి ఆరోపణలు చేయడంతో తిట్ల పురాణం ఎటు వైపు దారి తీస్తుందోనని కార్యాలయంలోని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించడం గమనార్హం.

మత్స్యకారుల ఇబ్బందులు ..
అధికారులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా జిల్లాలోని మత్స్యకారులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. పనికోసం వచ్చిన కార్మికులకు సరైన సమాధానం చెప్పడంలోనూ అధికారులు  వైఫల్యం చెందుతున్నారు. నచ్చిన వారికి సమాచారం ఇవ్వడం, మిగతా వారికి నాకు తెలియదు మరో అధికారిని కలవండి అని చెప్పడం లాంటి ఘటనలతో మత్సకార్మికులు అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వంనుంచి వస్తున్న సంక్షేమ పథకాలపై కార్మికులకు సమాచారం ఇవ్వకుండా దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

మరిన్ని వార్తలు