అర్లి–టీ 2.7 డిగ్రీలు

1 Jan, 2019 04:27 IST|Sakshi

మరో నాలుగు రోజులు ఇంతే..

జాగ్రత్తలు తీసుకోవాలని అధికారుల సూచన 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రం చలి గుప్పిట్లో గజగజలాడుతోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో జనం వణికిపోతున్నారు. గత 24 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో పలుచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయాయి. ఆసిఫాబాద్‌ జిల్లా భీంపూర్‌ మండలం అర్లి–టీలో ఏకంగా 2.7 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఈ సీజన్‌లో ఇదే మొదటిసారి. అలాగే కొమురంభీం జిల్లా తిర్యాని మండలం గిన్నధరి, సిర్పూరు, కామారెడ్డి జిల్లా బిక్నూరులోనూ 3 సెంటీమీటర్ల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆదిలాబాద్‌ సహా ఆ జిల్లాలోని రాంనగర్, కొమురంభీం జిల్లా లింగాపూర్, సంగారెడ్డి జిల్లా అలగోల్‌లో 4 డిగ్రీల చొప్పున రాత్రి ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

ఇలా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఆరేడు డిగ్రీల వరకు తక్కువగా రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు కూడా సాధారణం కంటే మూడు డిగ్రీల వరకు తగ్గాయి. వచ్చే నాలుగు రోజులూ రాష్ట్రంలో తీవ్రమైన చలి తీవ్రత కొనసాగుతుందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, మంచిర్యాల, మెదక్, వరంగల్‌ రూరల్‌ జిల్లాల్లో తీవ్రమైన చలి గాలుల తీవ్రత ఉంటుందని తెలిపింది. హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, సిద్దిపేట, జయశంకర్‌ భూపాలపల్లి, వరంగల్‌ అర్బన్, నిజామాబాద్, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ నెల 2 నుంచి 5 వరకు వరకు ఆయా జిల్లాల్లో చలిగాలులు వీస్తాయని, చలి తీవ్రత కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.   

మరిన్ని వార్తలు