అఫ్జల్ పార్కును పునరుద్ధరిస్తాం

29 Sep, 2014 00:45 IST|Sakshi
అఫ్జల్ పార్కును పునరుద్ధరిస్తాం
  • మూసీ నది ప్రక్షాళనకు సహకరించండి
  •  గ్రేటర్ కమిషనర్ సోమేష్ కుమార్
  • దత్తాత్రేయనగర్: ఉస్మానియా ఆస్పత్రి వెనుక గేటు వద్ద గల అఫ్జల్ పార్కును పునరుద్ధరించి సుందరంగా తీర్చి దిద్దుతామని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్ తెలిపారు. మూసీ ఒడ్డున గల చింతచెట్టు 150 మందిని రక్షించి సెప్టెంబర్ 28 నాటికి 106 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. ఇండియాలో తనకు బాగా నచ్చిన చారిత్రక నగరం హైదరాబాద్ అన్నారు. నవాబుల కాలం నాటి ఈ పార్కు గత వైభవాన్ని తెచ్చేందుకు కృషి చేస్తామన్నారు. ఇందుకోసం వెంటనే కార్యాచరణ ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మూసీ నది ప్రక్షాళనకు అన్ని విభాగాల అధికారులతో పాటు ప్రజల సహకారం అవసరమన్నారు. ముఖ్యంగా ప్రజలు మూసీలో చెత్త వేయకుండా సహకరించాలన్నారు.

    అనంతరం ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ అధ్యక్షుడు ఎం.వేదకుమార్ మాట్లాడుతూ.. హైదరాబాద్ చరిత్రను మలుపు తిప్పిన 1908 మూసీ నదికి వచ్చిన వరదతో నాటి పాలనా యంత్రాంగం వివిధ రంగాల నిపుణులతో కలిసి పలు పథకాలు చేపట్టిందన్నారు. దీంతో హైదరాబాద్ ఆధునిక సిటీ ప్లానింగ్‌కు ఒక ఉదాహరణగా మారిందని గుర్తు చేశారు.

    ప్రస్తుతం ప్రణాళికా రహిత వృద్ధి కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్నా రు. ఈ నేపథ్యంలోనే సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్, ఫోరం ఫర్ ఎ బెటర్ హైదరాబాద్‌లు నగర సమస్యలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ డెక్కన్ స్టడీస్ కార్యదర్శి సజ్జద్ షాహిద్, ఏకే హైమద్, జగన్ రెడ్డి, అన్వర్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు